ట్రంప్‌కు క్లీన్‌చిట్‌!

Clean Chit To America President Donald Trump - Sakshi

అధికారంలోకొచ్చిన ఆర్నెల్ల నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను వెంటాడుతూ వస్తున్న ఓ పెద్ద భూతం చివరకు శాంతించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ ప్రచార బృందం రష్యా ప్రభుత్వంతో కుమ్మక్కయిందని, ఆ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి తోడ్పడిందని వచ్చిన ఆరోపణలపై 22 నెలలుగా దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక అటార్నీ, ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ రాబర్ట్‌ మ్యూలర్‌... ఆ విషయంలో ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని తేల్చిచెప్పినట్టు అమెరికా అటార్నీ జనరల్‌ విలియం బార్‌ నాలుగు పేజీల లేఖలో వెల్లడించారు. అయితే ఆ నివేదిక వాస్త వంగా ఏం చెప్పిందో, ఆ నిర్ధారణకు తోడ్పడిన అంశాలేమిటో ఇప్పటికైతే తెలియదు. ఎందుకంటే బార్‌ లేఖ మ్యూలర్‌ నివేదిక సారాంశమంటూ ఒకటి రెండు అంశాలు మాత్రమే ప్రస్తావించింది. ఆ అంశాల విషయంలోనైనా తగిన సాక్ష్యాధారాలను ఆయన జత చేయలేదు. ఇక ఇతర అంశాల గురించి మ్యూలర్‌ ఏమని తేల్చారో తెలియదు.

వాటిని బయటపెట్టడం ‘దేశ ప్రయోజనాలకు’ భంగకరమని ట్రంప్‌ నిర్ణయించుకుంటే అవి బయటికొచ్చే అవకాశం ఉండదు. ట్రంప్‌ ప్రచార బృందానికీ, రష్యా ప్రభుత్వానికీ మధ్య కుమ్మక్కు వ్యవహారం నడవలేదని మ్యూలర్‌ నివేదిక చెప్పి ఉండొచ్చుగానీ...అక్కడ అధికారంలో ఉన్నవారితో సన్నిహితంగా మెలగుతూ వారి ఆదేశాలకు తగి నట్టు వ్యవహరించే ప్రైవేటు బృందాలతో ట్రంప్‌ సహచరులకు ఉన్న సంబంధం గురించి అది ఏం చెప్పిందో ఇంకా తెలియవలసి ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుండగా మ్యూలర్‌ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు కీలకమైనవి. హిల్లరీ క్లింటన్‌ అవకాశాలను దెబ్బతీసేందుకు, ట్రంప్‌కు లబ్ధి చేకూర్చేందుకు రష్యా ప్రభుత్వం ప్రయత్నించిందని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ద్వారా, కొందరు ప్రముఖ డెమొక్రాట్లకు చెందిన ఈ–మెయిళ్లు హ్యాక్‌ చేయడం ద్వారా ఇదంతా జరిగిందని ఆయన గతంలో చెప్పారు. ట్రంప్‌కు చెందిన సంస్థ మాస్కో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులతో చర్చించిందని, అందులో రష్యా అధికారుల ప్రమేయం ఉన్నదని తెలి పారు. వారు అనేకమార్లు ట్రంప్‌కూ, ఆయన కుటుంబసభ్యులకూ ఈ ప్రాజెక్టు గురించి వివరించా రని మ్యూలర్‌ అభిప్రాయపడ్డారు.

ట్రంప్‌కు జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారుగా పని చేసిన మైకేల్‌ ఫ్లిన్‌ రష్యాపై విధించిన ఆంక్షల గురించి ఆ దేశ రాయబారితో చర్చలు జరిపిన సంగ తిని ఎఫ్‌బీఐ దగ్గర దాచిపెట్టారని ఆయన ఎత్తిచూపారు. ఈ అంశాలన్నిటా మ్యూలర్‌ నేరారోప ణలు ఖరారు చేశారు. ఇప్పుడు బార్‌ రాసిన లేఖ ఈ అంశాల విషయంలో మ్యూలర్‌ తుది అభిప్రా యాలు ఏమిటో, ఎటువంటి చర్యలకు ఆయన సిఫార్సు చేశారో చెప్పడం లేదు. ఇక ఈ దర్యాప్తును అడ్డుకోవడానికి ట్రంప్‌ ప్రయత్నించారనడానికి పూర్తి ఆధారాలు లభించలేదని మ్యూలర్‌ తేల్చారు. ‘అధ్యక్షుడు నేరం చేశాడని ఈ నివేదిక నిర్ధారించలేదు, అలాగని ఆయన్ను పూర్తిగా నిర్దోషి అని చెప్పడం లేదు’ అని బార్‌ అంటున్నారు. సహజంగానే తాజా నివేదిక ట్రంప్‌కు ఎక్కడలేని సంతోషాన్నీ కలగజేస్తోంది. అది ఆయన్ను నిర్దోషి అని పూర్తిగా చెప్పకపోయినా అలా చెప్పిందన్నట్టుగానే ట్రంప్‌ ప్రచారం చేసుకుంటున్నారు. దర్యాప్తు మొదలైనప్పటినుంచి తరచుగా దానిపై విరుచుకుపడుతూ వస్తున్న ట్రంప్‌... అమెరికా ఈ స్థితి ఎదుర్కొనవలసిరావడం సిగ్గుచేటని, దేశాధ్యక్షుడు ఇలాంటి పరిస్థితుల్లో పడటం ప్రజలకే అవ మానకరమని చెబుతున్నారు.

వీటి మాటెలా ఉన్నా మ్యూలర్‌ నివేదిక న్యాయ మంత్రిత్వ శాఖకు అందినప్పటినుంచి ట్రంప్, ఆయన అనుచర గణం కంగారుగానే ఉంది. ట్రంప్‌ తన న్యాయవాదు లతో, రాజకీయ సలహాదారులతో పలుమార్లు సమావేశమయ్యారు. ఆ మంతనాల పర్యవసానం గానే చివరకు బార్‌ ఈ సారాంశాన్ని రూపొందించినట్టున్నారు. బార్‌ అయినా, ఆయన సహచరు డైన డెప్యూటీ అటార్నీ జనరల్‌ రాడ్‌ రోసెన్‌స్టీన్‌ అయినా ట్రంప్‌ నియమించినవారే. మ్యూలర్‌ సమగ్ర నివేదికలో ఏముందన్న అంశం సంగతలా ఉంచి తాజా పరిణామాలతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మ్యూలర్‌ నివేదికలోని అంశాలు వెల్లడయ్యాక ట్రంప్‌ను అభిశంసించాలని డెమొక్రాట్లు ఎప్పటినుంచో అనుకుంటున్నారు. బార్‌ లేఖ వారిని సహజంగానే నిరాశపరిచి ఉంటుంది. డెమొక్రాట్లు కోరుకున్నది జరగకపోగా, వారే పీకల్లోతు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కనబడుతోంది. ట్రంప్‌పై లేనిపోని అభాండాలు వేసి ఆయన్ను చికాకుపరచడంతోపాటు దేశ పరు వుప్రతిష్టల్ని మంటగలిపినందుకు వారిపై ఎదురు కేసులు పెట్టడానికి రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది.  మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను కూడా ఇందులోకి ఈడ్చాలని చూస్తున్నారు.  

ఇదంతా సహజంగానే అమెరికాను మరో సంక్షోభంలోకి నెడుతుంది. వచ్చే ఏడాది చివరిలో అధ్యక్ష ఎన్నికలుంటాయి గనుక రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య వైరం రాను రాను మరింత ఉధృత మవుతుంది. అటు సెనేట్‌ న్యాయవ్యవహారాల కమిటీ ముందుకూ, ఇటు ప్రతినిధుల సభ న్యాయ వ్యవహారాల కమిటీ ముందుకూ బార్‌ను రప్పించి ఆయన నుంచి మరిన్ని రాబట్టాలని రెండు వర్గాలూ ప్రయత్నిస్తున్నాయి. అయితే ట్రంప్‌కు కష్టకాలం గడిచిపోయినట్టు కాదు. మ్యూలర్‌ విచారణలో బయటపడిన కొన్ని అంశాలు–ట్రంప్‌కు చెందిన చారిటబుల్‌ ఫౌండేషన్‌ కార్యకలా పాలు, ఒక సెక్స్‌ వర్కర్‌తో తనకున్న సంబంధాలు వెల్లడికాకుండా ఉండేందుకు 2016లో ఆమెకు తన న్యాయవాది ద్వారా డబ్బు చెల్లించడం వగైరాలు ఇంకా తేలాల్సి ఉంది. ఇవన్నీ ఇప్పటికే బజా రునపడ్డ అమెరికా రాజకీయాల స్థాయిని మరింత దిగజారుస్తాయి. ఇప్పటికే రాజ్యాంగ వ్యవస్థల పనితీరుపైనా, ప్రత్యేకించి న్యాయవ్యవస్థపైనా, మీడియాపైనా అమెరికా ప్రజల్లో నమ్మకం సన్న గిల్లుతున్నదని పలు సర్వేలు చెబుతున్నాయి. రాబర్ట్‌ మ్యూలర్‌ నివేదిక ఆ విశ్వాసరాహిత్యాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు. ఇరుపక్షాలూ దూరదృష్టితో వ్యవహరించకపోతే అది మున్ముందు మరిన్ని సంక్షోభాలకు దారితీస్తుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top