జ్ఞాననేత్రం తెరుచుకోవాలి

Business War Between America And China - Sakshi

ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అందరూ అనుకుంటున్న వాణిజ్య యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భేరీ మోగించారు. చైనా దిగుమతులపై వార్షి కంగా 6,000 కోట్ల డాలర్ల సుంకాలు విధించబోతున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే చైనా అప్రమత్తమైంది. తాము సైతం అమెరికా దిగుమతులపై 300 కోట్ల డాలర్ల మేర సుంకాల మోత మోగిస్తామని స్పష్టం చేసింది. మున్ముందు మరెలాంటి నిర్ణ యాలు తీసుకుంటారన్న ఊహాగానాల సంగతి అలా ఉంచితే ఇప్పటికే ఆయన ఉక్కు ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధించి చైనాను మాత్రమే కాదు... అందరినీ దిగ్భ్రాంతిపరిచారు. ప్రతీకారంగా సుంకాలు విధించడంతో ఊరుకోక అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూ టీఓ)కు ఫిర్యాదు చేస్తానని కూడా చైనా హెచ్చరించింది. 

ఒకప్పుడు ప్రపంచీకరణ పేరుతో అన్ని దేశాలనూ తన దోవకు తెచ్చుకుని వాటిని ఒక ఆట ఆడించిన అమె రికా ఇప్పుడు సరిగ్గా దానికి విరుద్ధమైన పోకడలకు పోవడం ప్రపంచ దేశాలకు మింగుడుపడని విషయం. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్‌చేసిన ప్రకటనలకూ, ఇప్పుడాయన అనుసరిస్తున్న పోకడలకూ వైరుధ్యమేమీ లేదు. అప్పట్లో ఆయన ఉపన్యాసాలను అమెరికాలోనూ, వెలుపలా ఎవరూ తీవ్రంగా తీసుకోలేదు. ఆయన అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే అవకాశమే లేదని... ఒకవేళ అలా జరిగినా చాలా త్వరలోనే ఆయన ‘అంతా తెలుసుకుని’ గత అధ్యక్షుల బాటలో వెళ్తారని అంచనా వేశారు. కానీ ట్రంప్‌ ఈ అంచనాలను తలకిందులు చేశారు. ఇప్పుడాయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఒక్క చైనాకు మాత్రమే కాదు... మన దేశంతోపాటు జపాన్, జర్మనీలకు కూడా నష్టం కలుగుతుంది. 

చైనా స్థాయిలో కాకపోయినా మన దేశం, జపాన్, జర్మనీ అమెరికాకు ఉక్కు, అల్యూమి నియం ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తున్నాయి. చైనాతోపాటు ఈ దేశాలకు కూడా భారీ సుంకాల బెడద తప్పదు. కానీ చైనా తరహాలో ఈ దేశాలు ప్రతీకారానికి దిగు తాయా అన్నది అనుమానమే. అమెరికాతో ఇతరత్రా ఉన్న అనుబంధం వల్ల కావొచ్చు, చైనాతో పోలిస్తే మన ఆర్థికవ్యవస్థకుండే పరిమితుల వల్ల కావొచ్చు, చైనా స్థాయిలో దూకుడుగా నిర్ణయాలు తీసుకునే అవకాశం మన దేశానికి లేదు. ఇక ట్రంప్‌ విషయంలో ఎలా స్పందించాలో జపాన్‌కు అర్ధం కావడం లేదు. మిత్ర దేశంతో కరుగ్గా మాట్లాడటం అదింకా నేర్చుకున్నట్టు లేదు. ట్రంప్‌కు ఇలాంటి మొహ మాటాలు లేవు. తాను కోరుకున్నట్టు చేయకపోతే ఏ దేశాధినేతనైనా పబ్లిగ్గా అవహేళన చేయడానికి వెనకాడటం లేదు. లొంగకపోతే చర్యలెలా ఉంటాయో ఇప్పటికే ఆయన చూపిస్తున్నారు. జర్మనీ, ఇతర యూరప్‌ దేశాల హెచ్చరికలకు ట్రంప్‌ గట్టిగానే జవాబిచ్చారు.

‘ప్రపంచీకరణ’కు సారథ్యం వహించి దాన్ని అందరూ ఒప్పుకుని తీరేలా ఒత్తిళ్లు తెచ్చింది అమెరికాయే. ఇందువల్ల ఒక్కో దేశంలోని ఆర్ధిక వ్యవస్థ ఎలా కుదేలైందో, అన్నిచోట్లా జనం ఎన్ని తిప్పలు పడుతున్నారో కనబడుతూనే ఉంది. ప్రభుత్వాలు తమ సామాజిక బాధ్యతలను క్రమేపీ వదుల్చుకోవడం, ప్రతిదీ ప్రైవేటుకు అప్పగించడమనే ధోరణి అన్ని దేశాల్లోనూ పెరిగింది. పెట్టుబడుల ఉప సంహరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయడం వల్ల లక్షలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అయితే ఈ పరిణామాలన్నిటివల్లా ఒక దేశంగా అమెరికా లాభపడలేదు. కార్మికులు కారుచౌకగా దొరికే వేరే దేశాల్లో తయారీ రంగ పరిశ్రమలను నెలకొల్పి అమెరికా కార్పొరేట్‌ రంగం ఎడాపెడా లాభాలు గడిస్తే... అక్కడి కార్మికులు మాత్రం ఉపాధి కోల్పోయారు.

 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, బహుళ దేశాల మధ్య కుదిరే ఒప్పందాలు సారాంశంలో అమెరికా కార్పొరేట్‌ సంస్థల ఖజానాలనే నింపాయి. చైనాతో తమకున్న వాణిజ్య లోటు వల్ల మొత్తంగా 20 లక్షల ఉద్యోగాలు కోల్పోయామని ట్రంప్‌ చెబుతున్న లెక్కల్లో కాస్త అతిశయం ఉంటే ఉండొచ్చుగానీ వాటిని పూర్తిగా కొట్టిపారేయలేం. తాను తీసుకుంటున్న చర్యల వల్ల మందకొడిగా ఉన్న తయారీ రంగంలో పెట్టుబడులు మొదలై ఉపాధి అవకా శాలు పెరుగుతాయని, అది తనకు లాభిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. 

అయితే ట్రంప్‌ తెగే వరకూ లాగుతారా, మధ్యలో దీన్నంతటినీ మరచి వేరేలా ప్రవర్తిస్తారా అన్నది ఎవరూ చెప్పలేరు. నిన్న మొన్నటివరకూ ఆయన ఛోటా దేశం ఉత్తర కొరియాతో నువ్వా నేనా అంటూ తొడగొట్టారు. ఆ దేశాన్నే నామరూపాలు లేకుండా చేస్తానన్నారు. ఇరాన్‌పై కూడా కారాలు, మిరియాలు నూరారు. 2015లో తనతోపాటు మరో అయిదు దేశాలతో ఇరాన్‌ కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని సవరించాలంటూ పేచీకి దిగారు. ఇప్పుడు వాటికి తాత్కాలికంగా విరామం ప్రక టించి వాణిజ్య యుద్ధ సన్నాహాల్లో తలమునకలయ్యారు. సభ్య దేశం ఏదైనా ఇష్టానుసారం ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించి, కొన్ని సందర్భాల్లో వాటిని అమలుచేసిన డబ్ల్యూటీఓ ట్రంప్‌ హెచ్చరికల తర్వాత సన్నాయి నొక్కులు నొక్కుతోంది. 

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనబడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇలాంటి వాణిజ్య వివాదాలు ధ్వంసం చేస్తాయని సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ రాబర్టో అజెవెడో హితవు చెబుతున్నారు. వేరే దేశాలకు ఒక నిబంధన, అమెరికాకు మరొకటన్నమాట! డబ్ల్యూటీఓ పుట్టినప్పుడు సంస్థకు ఇలా రెండు రకాల నిబంధనలుంటాయని చెప్పలేదు. కారణమేదైనా ఈ వివాదం మంచికే వచ్చిందని మన దేశం గ్రహిస్తే మంచిది. ‘ప్రపంచీకరణ’ను తనకనుకూలంగా మలుచుకుని లబ్ధిపొందిన దేశాల్లో చైనా అగ్రగామి. ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థకు దీటుగా అది తయారైంది. కానీ మన దేశం ఆ విషయంలో బాగా వెనకబడి ఉంది. తయారీ రంగాన్ని విస్తరించి, ఉపాధి కల్పనకు వీలుకల్పిస్తే జనంలో కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. ‘ప్రపంచీకరణ’ ఎండమావుల వెంట తీసే పరుగులు ఎలాంటి ఫలితాన్నిస్తాయో తాజా వివాదమే చెబుతుంది. ట్రంప్‌ మోగించిన ‘వాణిజ్య యుద్ధ’భేరి నుంచి నేర్చుకోవాల్సిన పాఠమిదే.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top