ఈ విషాదం ఎవరి పాపం?

boat accident in krishna river - Sakshi

అనూహ్యమైన పరిస్థితుల్లో లేదా అనుకోని మానవ తప్పిదం పర్యవసానంగా సంభవించే దురదృష్టకరమైన ఉదంతాలను ప్రమాదాలంటారు. కానీ కనకదుర్గమ్మ చెంతన కృష్ణమ్మ ఒడిలో ఆదివారం 21 నిండు ప్రాణాలు జలసమాధి అయిన దుర్ఘటన ఈ కోవలోనిది కాదు. వివిధ ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం, పలుకుబడిగల కొందరు రాజకీయ నేతల సంపాదన యావ ఆ ఇరవైఒక్కమంది ప్రాణాలనూ చిదిమేశాయి. ఆ కోణంలో చూస్తే ఇవి దారుణ హత్యలు. గోదావరి జలాలు కృష్ణానదిలోకి ప్రవేశించే ప్రాంతానికి ‘పవిత్ర సంగమం ఘట్‌’గా నామకరణంచేసి, అక్కడ సంధ్యా సమయంలో రోజూ కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందులో పాల్గొంటే పుణ్యం, పురుషార్ధం దక్కుతుందని ప్రచారం చేసిన ప్రభు త్వానికి దాన్ని వీక్షించేందుకు భక్తులొస్తారని, వారిని తిరిగి సురక్షితంగా వెనక్కు పంపాలని తోచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా ఆ క్షణంలోనే తనకు డాష్‌ బోర్డు ద్వారా తెలిసిపోతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తరచు చెప్పేమాట. కానీ తన అధికార సౌధానికి సమీపంలో అక్రమంగా పడవలు సంచరిస్తున్నాయన్న స్పృహే ఆయనకు లేక పోయింది. హారతి కార్యక్రమానికొచ్చే భక్తుల సంరక్షణార్ధం ఘాట్‌ పరిసర ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను గస్తీ బోట్లతో సిద్ధంగా ఉంచాలని, కనీసం ఒకటి రెండు అంబులెన్స్‌లు అక్కడ అందుబాటులో ఉండాలని ఆయనకు తోచలేదు. సమీపం లోని మత్స్యకారులు చొరవ చేసి ప్రమాద ప్రాంతానికి వెనువెంటనే చేరుకోబట్టి మిగిలినవారు ప్రాణాలు దక్కించుకోగలిగారు.    

అనుమతుల్లేని బోట్ల ఆచూకీ తెలుసుకుని వాటిని నిలువరించడానికి పటి ష్టమైన పర్యవేక్షణ అక్కడ లేకపోగా... బోటు కావాలని సంప్రదించినప్పుడు పర్యా టకాభివృద్ధి సంస్థ సిబ్బందే ఈ ప్రైవేటు బోటును సూచించారని ఉదంతంలో ప్రాణాలతో బయటపడినవారు చెప్పిన మాటలు వింటే విస్మయం కలుగుతుంది. ఇదంతా బయటకు రాకుండా ఉండటం కోసం పర్యాటక ఉద్యోగి ఒకరు అక్రమంగా వచ్చిన పడవకు అభ్యంతరం చెబుతున్న వీడియో దృశ్యాన్ని సోమవారం రోజంతా ప్రచారంలో పెట్టారు. అక్రమంగా వచ్చిన పడవకు అభ్యంతరం చెబితే సరిపోతుందా? సంబంధిత అధికారులను రప్పించి, ఆ పడవను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేయించొద్దా? ఉద్యోగి అభ్యంతరం చెప్పాక కూడా  ఆ పడవ ఆ ప్రాంతంలోనే ఎందుకుంది? ప్రయాణికులను ఎలా తీసుకెళ్లగలిగింది? డబ్బులు దండుకోవడానికొచ్చిన ఒకరిద్దరు వ్యక్తుల ముందు ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం నిస్సహాయమైందని... ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటాలాడుతున్నా చేష్టలుడిగి ఉండిపోయిందని ఒప్పుకున్నట్టు కాదా? 

సముద్ర జలాల్లో సంచరించే పడవలతో పోలిస్తే నదుల్లోనూ, సరస్సుల్లోనూ పడవ ప్రయాణం సురక్షితమైనదంటారు. సముద్ర జలాల్లో నిరంతరం కెరటాల ఉధృతి ఉంటుంది. తరచు మారే వాతావరణ పరిస్థితుల ప్రభావం సరేసరి. అందువల్లే మత్స్యకార కుటుంబాలు తమవారు తిరిగొచ్చేవరకూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఉంటాయి. కానీ నదీనదాల్లో ప్రయాణం అలా కాదు. అక్కడ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే పడవ ప్రయాణం ఎంతో సురక్షితమైనది, ఆహ్లాదకరమైనది. అంతర్గత జలమార్గాల్లో పడవ నడిపేవారికి ప్రయాణించే మార్గంపై లోతైన అవగాహన ఉండాలి. ప్రమాదాలు పొంచి ఉండే ప్రాంతాలపై ముందస్తు అంచనా అవసరం. నీటి ఉరవడి ఎక్కువున్న ప్రాంతంలోకి పడవ వెళ్లనీయరాదని తెలియాలి. సామర్ధ్యానికి మించి అదనంగా ఒక్కరు కూడా ఎక్క కూడదని అర్ధంకావాలి. అందరూ లైఫ్‌ జాకెట్లు ధరించేలా చూసుకోవాలి. పడవలో ప్రయాణించడంపై అవగాహన కలిగించి, వారు పాటించాల్సిన నియమాలను చెప్పాలి. అందరూ ఒకపక్కే కూర్చుంటే పడవ ఒరుగుతుందని అర్ధం చేయించాలి. ఇవన్నీ సక్రమంగా అమలవుతున్నాయో లేదో తరచు తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలి. ఈ తరహా జాగ్రత్తలు ఎంతవరకూ పాటిస్తున్నారో ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసు కోవాలి. నిజానికి మాఫియా ముఠాలు తయారై ఎక్కడబడితే అక్కడ యధేచ్ఛగా ఇసుక తవ్వుతుండటంవల్ల నదీ ప్రవాహాన్ని అంచనావేయడం కష్టమై పడవ ప్రయా ణాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి.

దుర్ఘటనపై విచారణ జరిపించి, కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన చేసిన చంద్రబాబుకు రెండేళ్లక్రితం గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఉదంతం గుర్తుందా? ఆ ఉదంతంపై నియమించిన న్యాయ విచారణ కమిటీ  ఏం చెప్పిందో, దానిపై తీసుకున్న తదుపరి చర్యలేమిటో ఆయన వివరించి ఉంటే బాగుండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు సమర్ధవంతంగా పనిచేసిన పర్యాటక శాఖ విడిపోయాక సక్రమంగా పనిచేయలేకపోవడానికి కారణం పాల కులు కాదా? పర్యాటక శాఖ నిమిత్తమాత్రంగా మిగిలేలా, ప్రైవేటుకు సింహభాగం దక్కేలా కుదుర్చుకున్న ఒప్పందాలే దీనికి నిదర్శనం. నిరుడు నవంబర్‌లో ఇదే కృష్ణానదిలో అక్రమంగా సంచరిస్తున్న బోట్లను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుంటే వాటిని 24 గంటలు తిరగకుండానే విడుదల చేయించడం, ప్రైవేటు ఆపరేటర్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైనంపై అధికారులిచ్చిన నివేదికను బుట్ట దాఖలా చేయడం ఇందుకు తార్కాణం. కృష్ణానదిలో బోట్ల నిర్వహణ వ్యవహారం స్థానికులైన ఇద్దరు మంత్రుల కనుసన్నల్లో నడుస్తున్నదని, పర్యాటక సంస్థ నిమిత్తమాత్రంగా మిగిలిందని ఆరోపణలొస్తున్నాయి. ఇన్ని దోషాలు ప్రభుత్వం వద్ద పెట్టుకుని అత్యుత్సాహంతో తొందరపడి ప్రైవేటు బోటు ఎక్కి ప్రాణాలు తీసు కున్నారని తప్పంతా మరణించినవారిపై నెట్టేయడానికి చూస్తున్న తీరు అత్యంత హేయం. ఇలాంటి అమానవీయ ధోరణులను తక్షణం కట్టిపెట్టాలి. ఈ మాదిరి ఉదంతాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అవినీతికి, అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వంలో పైనుంచి కిందివరకూ ప్రక్షాళన జరగాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top