ధర్నాలో ఎవరేమన్నారంటే..


వైఎస్ పంచెకట్టు చూస్తే టీడీపీ నేతల పంచెలు తడుస్తాయ్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనిషి, మట్టి, రైతు విలువ తెలియదు. అచ్చమైన రైతులా పంచెకట్టుతో ఉండే వైఎస్ ఫొటో చూసినా టీడీపీ నేతలకు పంచెలు తడిసిపోతున్నాయి. ఆయన ఫొటోలోని చిరునవ్వు చూసినా టీడీపీ నేతలకు ఏడుపు వస్తోంది. అందుకే ఆయన ఫొటోలను అసెంబ్లీ లాబీలు తీయించివేశారు. వైఎస్ ఫొటో తీయించగలిగినా ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్ ముద్రను ఎవరూ చెరపలేరు. అధికారంకోసం పిల్లనిచ్చిన మామను, నీళ్లు ఇవ్వకుండా సొంత నియోజకవర్గ ప్రజలను, రుణమాఫీ చేయకుండా రైతులను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. ఆడపిల్లలన్నా చంద్రబాబుకు గిట్టదు. అందుకే ప్రత్యేకహోదాపై విలేకరులు ప్రశ్నిస్తే... కోడలు మగబిడ్డను ఇస్తానంటే ఎవరు కాదంటారంటూ లింగవివక్ష వ్యాఖ్యలు చేశారు.  మారాను, మారాను అని చెబితే గత ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓటు వేశారు. బాబు ఎలా మారారంటే... ఆధునిక భూబకాసురుడిలా మారారు.  - ఆర్‌కే రోజా, నగరి ఎమ్మెల్యే



జగన్ చెప్పిందే.. పవన్ చెబితే కరెక్ట్ అంటున్న టీడీపీ నేతలు

రాజధానికి తాము వ్యతిరేకం కాదని, బలవంతంగా భూములు లాక్కుంటే సహించేది అదేని జగన్ ముందు నుంచి చెబుతున్నారు. ఆ మాటలు ప్రభుత్వం చెవికి ఎక్కినట్టు లేదు. అవే మాటలు పవన్‌కళ్యాణ్ నోటి వెంట వస్తే కరెక్టని టీడీపీ నేతలు అంటున్నారు. - కొడాలి నాని, ఎమ్మెల్యే



చంద్రబాబు సీఎం కావడం రాష్ట్ర దౌర్భాగ్యం

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణానికి కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీకి చంద్రబాబు ప్రాధాన్యం లేకుండా చేశారు. ఇక్కడ రాజధాని నిర్మాణానికి కమిటీ ఆమోదం లేదు. అయినప్పటికీ చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. రాజధానికి భూములివ్వని రైతులపై పోలీసులతో ఒత్తిడి చేయిస్తున్నారు. బలవంతంగా సంతకాలు చేయించి భూములు లాక్కుంటున్నారు. రాష్ట్రానికి బాబు సీఎం కావడం దౌర్భాగ్యం.     - ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు



గొప్ప రాజధానిని నిర్మించండి.. మాకేం అభ్యంతరంలేదు

ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చేలా గొప్ప రాజధాని నిర్మించండి. మాకేం అభ్యంతరం లేదు. మూడు పంటలు, నీటి వసతులు ఉన్న భూములు వదిలిపెట్టండి. ఆహార భద్రత ముప్పు రాకుండా చూడండి. ప్రజలకు నచ్చజెప్పి భూములు తీసుకోండి. బలవంతంగా సేకరిస్తే సహించేది లేదు.      - మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీ



ప్రత్యేక హోదా తెచ్చే దమ్ము చంద్రబాబుకు లేదు

రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ కాలం వెళ్లదీశారు. విభజన జరిగాక నిధుల్లేవంటూ మోసపూరిత మాటలు చెబుతున్నారు. విభజన రోజు ఈ వాదన ఏమైంది? రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ప్రధానిని కలిసి వట్టి చేతులతో వెనక్కు వచ్చాడు. ప్రత్యేక హోదా తెచ్చే దమ్ము చంద్రబాబుకు లేదు.     - వరప్రసాద్, ఎంపీ, తిరుపతి



చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన ఉండదు

విభజన తర్వాత కేంద్రం హైదరాబాద్‌ను పదేళ్లు రాజధానిగా అనుమతించింది. బాబు ఈ విషయాన్ని పక్కనబెట్టి హడావిడిగా రాజధాని నిర్మాణానికి పూనుకున్నాడు. మూడు పంటలు పండే భూములను అన్యాయంగా లాక్కుంటున్నాడు. కుటుంబాలతో సహా రాజధానికి తరలి రావాలని అధికారులకు చెబుతూ తాను హైదరాబాద్‌లో భవంతులు నిర్మించుకుంటున్నారు. చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన ఉండదు.    - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top