నోరు నొక్కేశారు

ప్రపంచ బ్యాంక్‌ తనిఖీల విభాగం బృందానికి తమ సమస్యలను వివరిస్తున్న ఓ రైతు కుటుంబ మహిళ - Sakshi


ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ముందు ఎవరూ మాట్లాడొద్దు

రాజధానికి భూములు ఇవ్వనివారికి మాట్లాడే హక్కే లేదు

రైతులను బెదిరించిన టీడీపీ నేతలు

నేలపాడు సదస్సులో మూగబోయిన రైతువాణి




సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్‌ :

అన్నదాతల నోరు నొక్కేశారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన రైతులను అవమానించి పంపేశారు. రాజధానికి భూములివ్వని రైతులకు అసలు మాట్లాడే హక్కే లేదని హుకుం చేశారు. ఎవరైనా రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే హెచ్చరించారు. ప్రపంచ బ్యాంకు తనిఖీ విభాగానికి చెందిన నలుగురు బృంద సభ్యులు తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో బుధవారం ఉదయం రాజధాని ప్రాంత రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు తెలుగు తమ్ముళ్లు వేదిక ఎక్కి ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ముందు రైతులు ఎలా వ్యవహరించాలో పాఠాలు చెప్పారు. భూసమీకరణకు గానీ, రాజధాని నిర్మాణ విషయంలో గానీ వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర విషయాలు ఏ ఒక్కరూ ప్రస్తావించరాదన్నారు. ఎవరికైనా సమస్యలుంటే కలిసి చర్చించుకుందామని, రాజధాని నిర్మాణానికి అనుకూలంగా మాత్రమే మాట్లాడాలని ఆదేశించారు. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన కొద్దిమంది రైతులు కూడా చేసేదేమీలేక మౌనంగా ఉండిపోయారు.



 కూలీల ఆశ.. అడియాసే..

అధికార పార్టీకి చెందిన రైతుల ప్రతినిధులు ప్రపంచబ్యాంకు ముందు తమ వాదనలు వినిపించారు. రాజధాని ఏర్పాటుతో అనేక రకాలుగా లబ్ధి పొందామని చెప్పుకొచ్చారు. కొండవీటి వాగుతో ముంపు ఉన్న మాట వాస్తవమంటూనే 1999లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమస్య పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా వారి నోట పలుమార్లు రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ఇస్తున్న పరిహార భృతి ప్రస్తావనకు వచ్చింది. ఈ సదస్సులో తమ గోడును వెళ్లబోసుకునేందుకు దాదాపు అధిక సంఖ్యలో వ్యవసాయ కూలీలు హాజరయ్యారు. కొందరు ప్రభుత్వం ఇస్తున్న పరిహార భృతి సరిపోవడంలేదంటూ వినతిపత్రాలు తెచ్చారు. వీరెవరూ ప్రపంచబ్యాంకు బృందానికి వినతి పత్రాలు ఇవ్వకుండానే వెనుదిరిగారు. కేవలం ముగ్గురు నాయకులు మాట్లాడటంతోనే సమయం ముగియడం.. తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన వారిని కనీసం ఒక్కరిని కూడా వేదిక సమీపానికి కూడా రానివ్వకపోవడంతో రైతులు, కూలీలు తీవ్ర అసహనంతో వెనుదిరిగారు.



ప్రపంచ బ్యాంక్‌ బృందం చర్చలు

సాక్షి, అమరావతి బ్యూరో : అమరావతి భూసమీకరణ విధానంపై రాజధాని రైతులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు బృందం బుధవారం సీఆర్‌డీఏ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. మొత్తం రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజున సీఆర్‌డీఏ అధికారులతోపాటు రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, నేలపాడు, ఎర్రబాలెం గ్రామాల్లో పర్యటించి రైతులతో భేటీ అయ్యింది.  ఈ సందర్భంగా ఉదయం సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో మౌలిక వసతులు, ల్యాండ్‌పూలింగ్, మాస్టర్‌ప్లానింగ్, నిధుల సమీకరణ, సంస్థాగత స్వరూపం తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.  ఆయా ప్రాజెక్టులు చూపే సాంఘిక, పర్యావరణ ప్రభావాలపై కూడా బృంద సభ్యులు సునిశిత దృష్టి సారిస్తారు.  



పింఛన్ల ఎర

నేలపాడులో జరిగిన సమావేశానికి రైతులు, కూలీలు, మహిళలను పెద్ద ఎత్తున తరలించడానికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో చివరకు బెదిరింపు అస్త్రాన్ని ప్రయోగించారు. రాజధానిలో ఎవరికైతే ఇళ్లు కావాలో వారంతా సమావేశానికి రావాలని, పింఛన్లు కొనసాగాలంటే తప్పనిసరిగా హాజరవ్వాలని బెదిరించడంతో రాక తప్పలేదని సమావేశానికి వచ్చిన కొందరు రైతు కూలీలు, నిరుపేదలు చర్చించుకోవడం కనిపించింది. ఉద్ధండరాయునిపాలేనికి చెందిన పదుల సంఖ్యలో మహిళలను ఇలాగే తీసుకొచ్చారు. కుట్టు శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలకు.. కుట్టు మిషన్లు కావాలంటే సమావేశానికి వచ్చి తీరాల్సిందేనని చెప్పారు.



అమరావతి అభివృద్ధికి సహకరించండి

రాజధానికి భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన ప్రతి రైతుకు, భూములపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీలకు లబ్ధి చేకూరేలా భూసమీకరణ విధానాన్ని అమలు చేశామని స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరాల్లో ఒకటిగా నిలిపేందుకు ఆర్థికంగా చేయూత అందించాలని ప్రపంచ బ్యాంకు బృందాన్ని కోరారు. నిధులు మంజూరుచేస్తే త్వరలోనే మా రాష్ట్రంలోనూ వాషింగ్టన్‌ వంటి నగరాన్ని నిర్మించుకుంటామన్నారు. – శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్యే

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top