మహిళ సజీవ దహనం

మహిళ సజీవ దహనం - Sakshi


మృతిపై అన్నీ అనుమానాలే  

యాచకురాలై ఉంటుందని పోలీసుల భావన  

చంపి పడేసి ఉంటారంటున్న స్థానికులు  

అగనంపూడిలో సంచలనం రేపిన ఘటన  

వివరాలు సేకరించిన సౌత్‌ ఏసీపీ, క్లూస్‌ టీం




అగనంపూడి (గాజువాక) :ఓ మహిళ పూరిపాకలో సజీవ దహనమైంది. అయితే సహజంగా మంటలు అంటకుని మరణించిందా..? లేక ఎవరైనా చంపేసి నిప్పు అంటించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మృతిరాలి వయసు 40 సంవత్సరాలు వరకు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధి అగనంపూడిలో జరిగిన ఈ ఘటన బుధవారం సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  



అగనంపూడి నిర్వాసితకాలనీ గల్లవానిపాలెంకు చెందిన రెడ్డిపల్లి దేముడమ్మ అగనంపూడి ఆంజనేయస్వామి ఆలయంలో సేవ చేస్తూ పక్కనే పాకవేసుకొని అరటిపళ్లు, కొబ్బరికాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది.   ఆమె రోజూ ఉదయం ఆరు గంటలకు ఆలయానికి వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లిపోతుంది. మంగళవారం కూడా అలాగే వెళ్లిపోయింది. బుధవారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో పాక కాలిపోతున్న విషయాన్ని గస్తీ పోలీసులు గుర్తించారు. వెంటనే ఆంజనేయస్వామి ఆలయం అర్చకులు రవికుమార్‌ను నిద్ర లేపారు. అర్చకులు 3గంటలకు దేముడమ్మకు ఫోన్‌చేసి పాక కాలిపోతున్న విషయం చెప్పడంతో ఆమె బంధువులు వచ్చి మంటలను ఆర్పేసి వెళ్లిపోయారు. ఉదయం 6గంటలకు వచ్చి ఆమె సామాగ్రి (స్టీల్‌ బేసిన్లు, డబ్బాలు) లోపల ఏమైనా మిగిలాయా అని వెదుకుతుండగా మహిళ సజీవ దహనమై ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.  



యాచకురాలిగా అనుమానం  

రాత్రి 9గంటల సమయంలో ఒక మతిస్థిమితం లేని మహిళ  అరుస్తూ కేకలు వేయడం చూశానని అక్కడ బీట్‌ కాస్తున్న ట్రాఫిక్‌ పోలీసు చెప్పడంతో మృతురాలు యాచకురాలిగా అనుమానిస్తున్నారు. ఆమె శరీరంపై నైటీ ఉందని కూడా ట్రాఫిక్‌ పోలీస్‌ చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ యాచకురాలే పాకలో చలి కాయడానికి మంట వేసి ఉంటుందని స్థానికులు, పోలీసులు అంటున్నారు. అలా అనుకున్నా పాకను మంటలు వ్యాపిస్తుంటే, యాచకురాలు ఎందుకు పారిపోయే ప్రయత్నం చేయలేదు. నిద్ర మత్తులో ఉన్నా ఆమె ఉన్న పాక పూర్తిగా కాలిబూడిదై పోతున్నా పడుకున్నచోటనే ఎందుకు ఉండిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మతిస్థిమితం లేని వారైనా అగ్గి మంటలు వ్యాపిస్తుంటే ఎందుకు కదలకుండా పడుకున్న చోటే ఉండిపోతారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు 40సంవత్సరాల వయసు ఉండడం, నైటీతో ఉండడాన్ని బట్టి ఎవరో మహిళను చంపేసి పాకలోకి తీసుకొచ్చి పడేసి నిప్పంటించి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల కిందట మిస్సింగ్‌ కేసులేమైనా నమోదయ్యాయా అని విచారిస్తున్నారు.   



అణువణువూ పరిశీలించిన పోలీసులు

సౌత్‌ ఏసీపీ రామ్మోహన్‌రావు, దువ్వాడ, స్టీల్‌ప్లాంట్‌ సీఐలు ఎన్‌.కుమార్, మళ్ల మహేష్, ఎస్‌ఐ జోగారావు, క్లూస్‌ టీం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌టీం సభ్యులు అణువణువూ పరిశీలించారు. సజీవదహనం కేసు మిస్టరీకి ఏమైనా క్లూ దొరుకుతుందోమేనని పరిసరాలన్నీ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహం కింద కాలిపోకుండా ఉన్న దుస్తుల ముక్కల ఆధారంగా మహిళ అని నిర్థారించి, ఆమె నైటీ వేసుకుని ఉన్నట్లు గుర్తించారు. పాక యజమాని, ఆలయ అర్చకులు రవికుమార్, పరిసర ప్రాంతంలోని వారిని విచారించిన పోలీసులు మృత కళేబరాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. పుర్రె, ఎముకులు మాత్రమే మిగిలాయి. కింద భాగం మాత్రం చాలావరకు కాలకుండా ఉండిపోయింది.  

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top