దీక్షా వేదికపై ఎవరేమన్నారు?


 సాక్షి, గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ దీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటిస్తున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులో సోమవారం దీక్షా శిబిరం వద్ద పలువురు మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రాణాలను పణంగా పెట్టి జగన్ దీక్ష చేస్తుంటే సిగ్గులేని టీడీపీ మంత్రులు ఇష్టానుసారంగా మా ట్లాడుతున్నారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. కేంద్రం ఇప్పటికైనా ప్రత్యేక హోదాపై తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జగన్ చేస్తున్న దీక్షపై మంత్రులు అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు.



దీక్షకు పార్టీలకతీతంగా మద్దతు పలకాలన్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. పరిస్థితులు విషమించకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలని మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న ఉద్యమాన్ని ఒక వ్యూహం ప్రకారం అణచి వేయాలని సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజలను మోసగిస్తున్న బీజేపీ, టీడీపీలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు.



ప్రత్యేక హోదా సాధించకపోతే టీడీపీ సర్కారును భావితరాలు క్షమించవని పార్టీ మహిళా నేత జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. జగన్‌పై చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా 67 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తామని లేకుంటే మీరంతా రాజీనామా చేస్తారా అంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంత్రులకు సవాల్ విసిరారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారని, ప్రత్యేక హోదాపై 22వ తేదీలోగా ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top