వరుణ జపాలు

వరుణ జపాలు

మూడురోజుల పాటు ఋష్యశృంగ మహర్షికి పూజలు


ఆదివారం వరుణయాగం


అన్నవరం:

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవాలని  కోరుతూ రత్నగిరి సత్యదేవుని సన్నిధిన శుక్రవారం వరుణ జపాలు ప్రారంభించారు. ఋష్యశృంగ మహర్షి మట్టి విగ్రహాన్ని పుట్టమన్నుతో తయారుచేసి సత్యదేవుని ఆలయం వద్ద  ఉంచి పండితులు తొలుత పూజలు చేశారు. అనంతరం మంగళవాయిద్యాలతో ఆ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి దర్బారు మండపంలోని సత్యదేవుని ఉత్సవమూర్తుల సన్నిధిన ప్రతిషి్ఠంచి పూజలు చేశారు. పండితులు, రుత్విక్కులు ఋష్యశృంగ మహర్షి విగ్రహాన్ని శిరసున దాల్చి ఆలయ ప్రాకారం చుట్టూ వేదమంత్రాలు చదువుతూ, మంగళవాయిద్యాల నడుమ మూడుసార్లు  ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆ విగ్రహాన్ని తిరిగి స్వామి, అమ్మవార్ల  పాదాల వద్ద ఉంచారు. శతానువాక పారాయణలు, వారుణానువాక పారాయణలు, వరుణజపాలు, రుష్యశృంగ ఆవాహనలు, సుబ్రహ్మణ్య ఆహ్వానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు, ఏఈఓ వైఎస్‌ఆర్‌ మూర్తి పాల్గొన్నారు. దేవస్థానం ప్రధాన  వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి మాట్లాడుతూ ఆదివారం వరకూ  ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వరుణ జపాలు నిర్వహిస్తామని తెలిపారు. వరుణ యాగం నిర్వహించి పూర్ణాహుతి  చేస్తామన్నారు. అదేరోజు మధ్యాహ్నం ఋష్యశృంగుని విగ్రహాన్ని పంపా నదిలో నిమజ్జనం చేస్తామని తెలిపారు. వేదపండితులు ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, శ్రీపాద రాజశేఖర్‌ ఘనాపాఠీ, చిట్టి శివ ఘనాపాఠీ, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, 18 మంది రుత్విక్కులు పాల్గొన్నారు.

వెంకన్న ఆలయంలో ..

వాడపల్లి(ఆత్రేయపురం): వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలో శుక్రవారం అర్చకులు వరుణజపం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.  విశ్వక్సేన పూజ, నవగ్రహ మండపారాధన, వరుణ కలశ స్థాపన, వరుణ జపం, వరణ సూక్త పారాయణం, నీరాజనమంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో సీహెచ్‌వీ రమణమూర్తి పర్యవేక్షించారు. పర్యవేక్షక్షులు రాధాకృష్ణా, సాయిరామ్‌ తదితరులు పాల్గొన్నారు. వరుణ జపం నిర్వహించడంతో శుక్రవారం ఒక మోస్తరు వర్షం పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.   
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top