మృత్యు కుంట

మృత్యు కుంట


– ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

– కత్తేవారికొట్టాల గ్రామంలో విషాదం




ధర్మవరం: నీటి నిల్వలు పెంచాలన్న ఉద్దేశంతో నిర్మించిన నీటికుంట రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈతకని వెళ్లిన ఇద్దరు విద్యార్థులు కుంటలోని బురదలో కూరకుపోయి మృత్యువాతపడ్డారు. ధర్మవరం మండలం కత్తేవారికొట్టాల గ్రామంలో చోటు చేసుకున్న



ఘటన వివరాలు ఇలా..

కత్తేవారికొట్టాల గ్రామానికి చెందిన సావిత్రమ్మ, ముత్యాలప్ప దంపతుల కుమారుడు మనోహర్‌ (8) ధర్మవరంలోని లయోలా పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో అదే గ్రామానికి చెందిన మల్లక్క, శ్రీనివాసులు దంపతుల కుమారుడు ప్రభాస్‌(9) కూడా నాల్గో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు రావడంతో ఇంటి పట్టున ఉన్న వీరు స్నేహితులతో కలిసి గ్రామ శివారులో ఉన్న నీటి కుంటలో ఈత కోసం వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత స్నేహితులు ఇంటిదారి పట్టారు. అయితే ఈ ఇద్దరు పిల్లలు సాయంత్రమైనా ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.



గ్రామంలోని పిల్లలను వారు ఆరా తీయడంతో గ్రామ శివారులోని నీటి కుంటకు ఈతకెళ్లిన విషయం తెలిపారు. అక్కడకు వెళ్లి పరిశీలించగా పిల్లల దుస్తులు నీటిపై తేలుతూ ఉన్నాయి. కుంటలో గాలించగా బురదతో ఇరుక్కుపోయిన మృతదేహాలు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న కత్తేవారికొట్టాల, మోటుమర్ల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. విగతజీవులైన పిల్లలను చూస్తూ తల్లిదండ్రులు, కుటుంబపభ్యుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు మాలగుండ్ల మల్లికార్జున, గుర్రం శ్రీనివాసరెడ్డి అక్కడకు చేరుకుని బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఘటనపై ధర్మవరం రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top