తపంచా విక్రయిస్తూ ఇద్దరు అరెస్ట్‌


ఆత్మకూరు: తపంచా విక్రయిస్తూ ఓ వ్యక్తి పట్టుబడగా, కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని ఆత్మకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వినోద్‌ కుమార్‌ మీడియాకు వివరించారు. శ్రీపతిరావుపేట గ్రామ సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులకు సమాచారం రావడంతో సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా తపంచా లభించడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇందిరేశ్వరం గూడెంకు చెందిన చెంచుగల్లి శివ అనే వ్యక్తి గత ఏడాది అడవిలోకి వెళ్లిన సమయంలో తపంచా దొరికింది. దానిని శుక్రవారం తనకు తెలిసిన కరుణాకర్‌కు రూ. వెయ్యికి విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారిని మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చగా రిమాండ్‌కు ఆదేశించారు.   

 
Back to Top