ముగ్గురు కలిసి మట్టుబెట్టారు

ముగ్గురు కలిసి మట్టుబెట్టారు


ఉద్యోగం కోసమే హత్య

భార్య, కుమార్తెలే నిందితులు

నలుగురి అరెస్టు

హత్యకు ఉపయోగించిన వస్తువులు స్వాధీనం

నిందితుల వివరాలు వెల్లడించిన వెస్టు డీఎస్పీ కనకరాజు




 


తిరుపతి క్రైం: అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసిన భార్య, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుళ్లు అతనికి శత్రువులుగా మారారు. ఉద్యోగం రాసివ్వలేదని, ఇల్లు ని ర్మించలేదని కక్ష పెంచుకున్నారు. ముగ్గు రూ కలిసి దాడి చేశారు. దారుణంగా కొట్టి చంపేశారు. ఈ నెల 4న నెహ్రూనగర్‌లో మనోహరయ్య అనుమానాస్పద మృతి కేసులోని చిక్కుముడిని వెస్ట్ పోలీసులు ఛేదించారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాలను గుట్టు రట్టు చేశారు. సోమవారం వారిని అరెస్టు చేశారు. వెస్టు డీఎస్పీ కనకరాజు వివరాలు వెల్లడించారు.



టీటీడీలోని ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్‌లో వైర్‌మెన్‌గా పనిచేస్తున్న మనోహరయ్య (52)కు భార్య శారద(45), కుమార్తెలు పావని (25), శిరీష(23) ఉన్నారు. పెద్ద కుమార్తె పావనికి వివాహమైంది. శిరీష బీటెక్ చదవుకుంది. 10 ఏళ్లుగా మనోహరయ్య, శారద మధ్య మనస్పర్థలున్నాయి. నాలుగేళ్లుగా మనోహరయ్య భార్య శారదకు నెలకు రూ.8 వేలు ఇస్తున్నాడు. శిరీష బీటెక్ పూర్తి చేసినందున ఉద్యోగం రాసి ఇవ్వాలని, నెహ్రూనగర్‌లోని ఇంటిని పూర్తి స్థాయిలో నిర్మించాలని భార్య శారద భర్తను కోరింది. అందుకు అతను నిరాకరించాడు. దీనికితోడు ప్రతి చిన్న విషయానికీ గొడవపడి ఆమెను కొట్టేవాడు. నెలల తరబడి ఇంటికి వెళ్లేవాడు కాదు.


ఈ క్రమంలో అతను విశాఖపట్నంకు బదిలీ అయ్యాడు. అక్కడ ఉద్యోగం నుంచి సస్పెండ్ కావడంతో ఈ నెల 4న తిరుపతిలోని ఇంటికి వచ్చాడు. ఈ సందర్భంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య శారద పెద్ద కుమార్తె పావనిని ఇంటికి పిలిపించుకుంది. అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో మనోహరయ్యను శారద కుక్కర్ మూతతో కొట్టగా, పావని రుబ్బుగుండుతో దాడిచేసింది. శిరీష ఇనుప మచ్చు కత్తె తో తలపై కొట్టి కిందకు తోసింది.



తర్వాత లెగిన్‌జీన్స్ ప్యాంట్‌తో ముక్కు, నోరు మూసి చంపేశారు. ఈ విషయాన్ని శారద తమ్ముడైన బాబు(43)కు చెప్పా రు. అతను అక్కడికి చేరుకుని హత్యకు ఉపయోగించిన వస్తువులు, రక్తపు మరకలు ఉన్న దిండుకవర్లు, కండువా, షర్టు, లెగిన్‌ప్యాంట్‌ను మాయం చేశాడు. 4వ తేదీ సంఘటన జరగగా 5వ తేదీ రాత్రి మనోహరయ్య అన్న మార్కండేయులకు శిరీష పోన్ చేసి నాన్న మెట్లపై నుంచి పడి చనిపోయాడని తెలిపింది. మనోహరయ్య తలపై ఉన్న గాయాలను చూసిన మార్కండేయులు వెస్టు సీఐ అంజుయాదవ్‌కు ఫిర్యాదు చేశారు.



కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజానిజాలు బయటపడ్డాయి. శిరీష, పావని, శారద, బాబును అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన సీఐ అంజుయాదవ్, ఎస్‌ఐ జయశ్యామ్‌ను డీఎస్పీ అభినందించారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top