టైగర్ కాస్తా... ఐటమ్ గర్ల్!

టైగర్ కాస్తా... ఐటమ్ గర్ల్! - Sakshi


కొన్ని నెలల క్రితం ‘‘ఆట మొదలైంది. పులి వేట మొదలైంది. టైగర్ ఈజ్ బ్యాక్’’ అంటూ రాష్ర్టంలోని పలుచోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు హల్‌చల్ చేశాయి. అయితే ఈ ప్రకటనలను ఉద్ధేశించిన సదరు నేత ఇప్పుడు సొంతపార్టీలోనే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నోటిని అదుపులో పెట్టుకోవాలంటూ ఇటీవలే అధినేత అక్షింతలు కూడా పడ్డాయి. ఈ పులికి తమ నేతలే కోరలు పీకేశారని, పులిని కాస్తా కరివేపాకులా తీసి పారేశారంటూ తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవైపు ఓటుకు కోట్లు, మరోవైపు టెలిపోన్ ట్యాపింగ్ కేసులను పక్కన పెట్టి రెండువైపులా అధినేతలే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నపుడు, ఈ నాయకుడు ఎంత ఎగిరితే ఏమి లాభం అని టీడీపీ నాయకులు నిట్టూరుస్తున్నారట.



ప్రస్తుతం పార్టీలో పక్కన పెట్టడంతో పాటు ‘ఐటెంగర్ల్’ అంటూ కూడా ఆయనను ఉద్ధేశించి వ్యాఖ్యానాలు వెలువడడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట. దూకుడు వద్దన్నా అని మొత్తుకున్నా వినకుండా పరిస్థితిని ఇంతదాకా తెచ్చుకున్నారని వారు వాపోతున్నారట. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయన్న ఎన్నో ఏళ్ల పాత నానుడిని తమ నేత మరోసారి నిరూపించారని గొణుక్కుంటున్నారట. ఎరక్కపోయి ఇరుక్కున్నట్లుగా టీఆర్‌ఎస్ పన్నిన ఉచ్చులో చిక్కుకుని, ఇటు పార్టీలో ప్రాధాన్యతను, బయటా గుర్తింపును కోల్పోవడాన్ని బట్టి అతిగా ఆవేశపడే మగవాడు బాగుపడిన సందర్భం చరిత్రలో లేదని ఇది మరోసారి రుజువుచేస్తోందంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top