‘ఈ–ఔషధి’పై నిర్లక్ష్యం

‘ఈ–ఔషధి’పై నిర్లక్ష్యం


ఆస్పత్రి డ్రగ్స్‌ ఇండెంట్‌ నమోదుకే పరిమితం

ఓపీలో రోగి వివరాల నమోదులో వెనుకంజ

రిమ్స్‌తోపాటు ఏరియా ఆస్పత్రులు,     సీహెచ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి

ఓపీ నమోదుతో రోగికి వెసులుబాటు.. మందుల వినియోగంలో స్పష్టత

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ప్రభుత్వానికి ప్రయోజనం


సాక్షి, ఆదిలాబాద్‌: సర్కారు ఆస్పత్రుల్లో ‘ఈ–ఔషధి’ ప్రత్యక సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం అమలు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. గత మార్చి నుంచి అమలు చేస్తున్నా ఇంకా గాడిలో పడలేదు. ఆస్పత్రికి అవసరమయ్యే డ్రగ్స్‌ ఇండెంట్‌ మినహాయించి ఓపీ విభాగంలో రోగి వివరాలను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానించే ప్రక్రియ ఎక్కడా కొనసాగడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను బోధనాస్పత్రులు, ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పీపీ యూనిట్లు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఇలా అన్ని సర్కారు ఆస్పత్రుల్లో అమలు చేస్తున్నారు. ప్రస్తుతం డ్రగ్స్‌ ఇండెంట్‌ ఆస్పత్రి నుంచి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు పంపిస్తుంటారు. రానున్న రోజుల్లో ఈ ఇండెంట్‌ ఆయా ఆస్పత్రులు తమ విభాగాల డైరెక్టర్, కమిషనర్లకే పంపించే విధంగా వచ్చే యేడాది నుంచి మార్పు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ–ఔషధి రానున్నరోజుల్లో కీలకం కానుంది.ఏమిటీ ఈ–ఔషధి..

తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో ఈ–ఔషధి అమలు చేస్తున్నారు. అన్ని ఆస్పత్రుల్లోని కంప్యూటర్లలో ఈ సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్‌ చేశారు. వినియోగంపై ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల వారీగా సర్కారు ఆస్పత్రుల వైద్యులు, ఫార్మాసిస్టులకు గత డిసెంబర్, జనవరిలో అవగాహన సదస్సులు నిర్వహించారు. మొదట ఏరియా ఆస్పత్రుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత మిగతా ఆస్పత్రులకు విస్తరించారు.రిమ్స్‌ బోధనాస్పత్రిలోనూ పూర్తిస్థాయి అమలులో జాప్యం జరుగుతోంది. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు మందుల ఇండెంట్‌ కోసం ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారే గానీ రోగి వివరాలను నమోదు చేయడం లేదు. మంచిర్యాల, భైంసా, ఉట్నూర్‌ ఏరియా ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నిర్మల్‌ ఏరియా ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ(ఎంసీహెచ్‌)లో ఓపీ విభాగాన్ని కూడా కొద్దిరోజులు నమోదు చేసినప్పటికీ ఇంటర్నెట్‌ సమస్యను ఎత్తిచూపుతూ ప్రస్తుతం వివరాలు నమోదు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఓపీ సంఖ్య తక్కువగా ఉండే పీహెచ్‌సీల్లోనూ రోగి వివరాల నమోదులో నిర్లక్ష్యం వహిస్తున్నారు.ఆదిలాబా ద్‌ జిల్లాలో బజార్‌హత్నూర్, కుమురంభీం జిల్లాలోని లోనవెల్లి, బెజ్జూర్‌ పీహెచ్‌సీల్లో అమలు చేస్తున్నట్లు అక్కడి వైద్యాధికారులు చెబుతున్నారు. మిగతా పీహెచ్‌సీల్లో ఇది జరగడం లేదు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించిన పక్షంలో ఈ ప్రక్రియ గాడిలో పడే అవకాశం ఉంది. నిర్మల్‌ జిల్లాలో కలెక్టర్‌ ఇలంబర్ది ఏరియా ఆస్పత్రుల్లో అమలు విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో కొంత ఫలితం కనిపిస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో గతంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌గా పనిచేసిన జ్యోతిబుద్ధ ప్రకాష్‌ కలెక్టర్‌గా ఉన్నారు. ఆయన ప్రత్యేక దృష్టి సారించడంతో రిమ్స్‌లో అమలైనప్పటికీ ఇంకా గాడిలో పడలేదు.  ఈ ఆస్పత్రుల్లో అమలు..

ఆదిలాబాద్‌ జిల్లాలో రిమ్స్‌ వైద్య కళాశాల, ఉట్నూర్‌లో ఏరియా ఆస్పత్రి, 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి.

నిర్మల్‌ జిల్లాలో 17 పీహెచ్‌సీలు, రెండు సీహెచ్‌సీలు, రెండు ఏరియా ఆస్పత్రులు, రెండు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి.

కుమ్రంభీం జిల్లాలో మూడు సీహెచ్‌సీ, సిర్పూర్, ఆసిఫాబాద్‌లలో ఏరియా ఆస్పత్రులు, రెండు అర్బన్‌హెల్త్‌ సెంటర్లు, 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.

మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, లక్షెట్టిపేట్‌లలో సీహెచ్‌సీలు, మంచిర్యాల, బెల్లంపల్లిలో ఏరియా ఆస్పత్రులు, 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. అన్నింటిలో ఈ–ఔషధి సాఫ్ట్‌వేర్‌ అమలు చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో గాడిలో పడడం లేదు.
ఏ ఆస్పత్రుల్లోనైనా రోగి వివరాలు  

రోగి ఆధార్‌కార్డు నంబర్‌ను ఆన్‌లైన్‌లో ఈ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అతడికి సంబంధించిన వ్యాధి వివరాలు(ప్రొఫైల్‌), పరీక్షల సమాచారం, మందుల జాబితా, ఏ రకాల మందులు ఎన్ని అందించారన్నది పొందుపర్చాలి. పీహెచ్‌సీలో డాక్టర్‌ వద్ద చికిత్స పొందిన రోగిని మెరుగైన చికిత్స కోసం పెద్దాస్పత్రికి తీసుకెళ్లాల్సి వస్తే అక్కడ కంప్యూటర్‌లో ఈ–ఔషధి సాఫ్ట్‌వేర్‌లో రోగి ఆధార్‌నంబర్‌ నమోదు ద్వారా చికిత్స వివరాలన్నీ డాక్టర్‌ ముందుంటాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరక్షరాస్యులు బోధనాస్పత్రులకు వెళ్లినప్పుడు తాము ఇదివరకు తీసుకున్న చికిత్సను డాక్టర్లకు వివరించలేని పరిస్థి్థతుల్లో ఉంటారు. అలాంటి రోగులకు ఈ సాఫ్ట్‌వేర్‌ కారణంగా మేలు జరగనుంది. పేషంట్‌ మెడిసిన్‌ రిపోర్టు లేకుండానే నేరుగా వెళ్లి చికిత్స పొందేందుకు అవకాశం కలుగుతుంది.ప్రభుత్వానికి ప్రయోజనాలు..

ఈ–ఔషధి సాఫ్ట్‌వేర్‌ కారణంగా ఎప్పటికప్పుడు మందుల నిల్వ వివరాలు తెలుసుకోవచ్చు. ఏ మందులు ఉన్నాయో, లేవో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆస్పత్రుల్లో ఔట్‌ పేషంట్‌ వివరాలు చూసుకోవచ్చు. మందులు ఎన్ని వినియోగం అయ్యాయి, ఎన్ని మిగిలాయనే లెక్కలు స్పష్టంగా ఉంటాయి. ఒక ఆస్పత్రిలో ఏవైన మందుల వినియోగం లేకపోతే వాటి వినియోగం అధిక ఉన్న మరో ఆస్పత్రిలో ఆ మందుల కొరత ఉన్న పక్షంలో అక్కడికి తరలించే అవకాశం ఉంటుంది. ఒక బటన్‌ నొక్కడం ద్వారా త్వరలోనే గడువు ముగిసే మందులు(ఎక్స్‌పైర్‌ డేట్‌) తెలుసుకోవచ్చు. కింది ఆస్పత్రి నుంచి మొదలుకొని పై ఆస్పత్రి వరకు నేరుగా అవసరమైన మందుల ఇండెంట్‌(జాబితా) పెట్టుకోవచ్చు. ఆ మందులు సరఫరా అయి ఆస్పత్రికి చేరుకున్నవి కూడా తెలుసుకోవచ్చు. చివరికి రోగికి అందినవి కూడా అందులో తెలిసిపోతుంది. ట్రాక్‌ అండ్‌ ట్రాక్‌ మెకానిజం అని పిలువబడే ఈ విధానం ద్వారా మందుల తయారీ కంద్రం నుంచి సరఫరా, రోగికి చేరే వివరాలు కూడా ఈ సాఫ్ట్‌వేర్‌తో తెలుసుకునే వెసులుబాటు ఉంది.అక్రమాలకు అడ్డుపడే అవకాశం

కొందరు సిబ్బంది ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్స్‌కు మందులు అమ్ముకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఔషధి సాఫ్ట్‌వేర్‌లో లెక్క తెలపాల్సి రావడం వల్ల అక్రమాలకు అవకాశం ఉండదు. ఇక ఏరియా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో ప్రభుత్వం సరఫరా చేసిన మందులు సరిపోని పక్షంలో వారి మందుల బడ్జెట్‌లో 20 శాతం బయట నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. మందులు కొనుగోలు చేయకుండానే పెద్ద ఎత్తున బిల్లులు పొంది ప్రభుత్వ ఖజానాకు ఆస్పత్రి వర్గాలు బొక్క పెడుతున్నాయి. ప్రభుత్వానికి యూటిలైజేషన్‌ సర్టిఫికెట్‌(యూసీ) సమర్పించకుండానే ఆస్పత్రి వర్గాలు అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. కాగా, ఈ–ఔషధి ప్రోగ్రాంను అమలు చేసే బాధ్యత వైద్యులు, ఫార్మాసిస్టులపైనే ప్రభుత్వం ఉంచింది. అన్ని ఆస్పత్రులకు కంప్యూటర్లు, ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు, యూపీఎస్‌లు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇతర సదుపాయాలు కల్పించారు.. మారుమూల గ్రామాల్లో నెట్‌ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యవర్గాలు తెలుపుతున్నాయి.. ఆస్పత్రికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కేటాయించారు. అయితే రోగుల తాకిడి అధికంగా ఉండే ఆస్పత్రుల్లో ఈ ప్రోగ్రాంను నిర్వహించడం వైద్యులు, ఫార్మాసిస్టులు తమకు భారవుతుందని చెబుతున్నారు.ఓపీ నమోదు కష్టంతో కూడుకున్నది..

రిమ్స్‌లో ఈ–ఔషధి సాఫ్ట్‌వేర్‌ పరంగా డ్రగ్స్‌ ఇండెంట్‌ పూర్తిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరుగుతుంది. ఔట్‌ పేషెంట్‌(ఓపీ) వివరాలు నమోదు చేయడం కష్టంతో కూడుకున్న పని. ప్రతి ఓపీ వద్ద ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున కంప్యూటర్లు అవసరం పడతాయి. రిమ్స్‌లో వందలాది మంది రోగులతో ఓపీ విభాగం రద్దీగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రోగి వివరాలను నమోదు చేయడం కష్టమైన పని. పూర్తిస్థాయిలో కంప్యూటర్లు, ఆపరేటర్లను నియమించిన తర్వాత ఈ ప్రక్రియను చేపడతాం.

– డాక్టర్‌ అశోక్, రిమ్స్‌ డైరెక్టర్‌

Back to Top