బాలుడి హత్య కేసులో నలుగురికి జీవితఖైదు


► రూ. 2వేల చొప్పున జరిమానా

► నాలుగు సెక్షన్లలో జైలుశిక్ష

► భీమిలి పాఠశాల విద్యార్థి హత్య కేసులో న్యాయమూర్తి సంచలన తీర్పు




విశాఖ లీగల్‌ : సంచలనం సృష్టించిన భీమిలి పాఠశాల విద్యార్థి హత్యకేసులో నలుగురికి యావజ్జీవ జైలుశిక్ష, రూ.2వేల చొప్పున జరిమానా విధిస్తూ నగరంలోని రెండవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి యు.సత్యారావు సోమవారం సాయంత్రం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.


ప్రత్యేక పబ్లిక్‌  ప్రాసిక్యూటర్, ప్రాసిక్యూషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కె.పృధ్వీరాజ్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులు చిల్లా రాజేంద్రరెడ్డి అలియాస్‌ వెంకటేష్‌(21), రెండవ నిందితుడు మైనరు, మూడోనిందితుడు రెంటపల్లి జాన్‌ అబ్రహం(22), నాల్గవ నిందితుడు వీరభద్ర అంజిరెడ్డి (22), ఐదోనిందితుడు కోల వెంకటరమణ(27)లు విశాఖ జిల్లా, భీమిలి మండలంలోని చిల్లపేటలో నివసిస్తున్నారు. ఫిర్యాది గణేష్‌రె డ్డి కూడా అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు.



 పూర్వాపరాలు

నిందితుల్లో ఒకడైన రాజేంద్రరెడ్డి విద్యార్థి తండ్రి గణేష్‌రెడ్డికి మేనత్తకొడుకు.రాజేంద్రరెడ్డి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించడం, ఇతర వ్యసనాలకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో గణేష్‌రెడ్డిని పలుమార్లు డబ్బు అడిగినా ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్నాడు.దీంతో భీమిలిలోని సన్‌స్కూల్‌లో చదువుతున్న గణేష్‌రెడ్డి చిన్న కుమారుడు జాన్‌ ప్రవీణ్‌కుమార్‌(7)ని అపహరించాలని పలుమార్లు ప్రయత్నించాడు. స్కూల్‌ దగ్గర మరో నలుగురితో కలిసి రెక్కి నిర్వహించాడు.


ఈ నేపథ్యంలో 2005 నవంబరు 22వ తేదీ సాయంత్రం ప్రవీణ్‌కుమార్‌ పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా నలుగురు వ్యక్తులు అపహరించి గణేష్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడు నిందితులను గుర్తించాడు. దీంతో భయపడిన నిందితులు బాలుడి కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకుని, ముక్కు,నోరు మూయడంతో ప్రవీణ్‌కుమార్‌ ఊపిరాడక మృతిచెందాడు. మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి గంభీరం గెడ్డలో పడేశారు. తన కుమారుడు కనిపించటం లేదని గణేష్‌రెడ్డి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. వారం రోజుల తర్వాత గంభీరంలో బాలుడి శవం ఒడ్డుకు కొట్టుకొచ్చింది.


దీంతో కేసును హత్య కేసుగా మార్చారు.  హత్య కేసులో సరైన ఆధారాలు దొరకక పోవడంతో పోలీసులు చేతులెత్తేశారు. ఈ పరిణామాన్ని ప్రతిష్టాత్మకంగా భావించిన రూరల్‌ ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గణేష్‌రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి వివరాలను పరిశీలించి కేసును సీఐడీకి అప్పగించారు. సీఐడీ అధికారులు విచారణ బాధ్యతను ఎంఆర్‌కే రాజుకు అప్పగించారు. అతను కేసును దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి కోర్టులో నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు.


సాక్ష్యాదారాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితులపై హత్య కేసు నిరూపణ కావడంతో భారతీయ శిక్షా స్మృతి 302(హత్యానేరం), 363 (అపహరణ నేరం) 120బి 9(కుట్ర), 201 (సాక్ష్యాలు కనుమరుగుచేయడం, దాచిపెట్టడం) వంటి నేరాల కింద కేసు రుజువు కావటంతో 1,3,4,5 నిందితులకు 7ఏళ్లు జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. ఈ శిక్షలు ఏకకాలంలో అమలు జరగాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. అప్పట్లో ఈ కేసు భీమిలిలో సంచలనం సృíష్టించింది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top