బావుల తవ్వకాలు.. నవ్వుల పాలు!

బావుల తవ్వకాలు.. నవ్వుల పాలు!


ఇందూరు : నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కలిపి మూడేళ్లలో 420 నూతన బావుల తవ్వకానికి రూ.8.70 కోట్లు మంజూరయ్యాయి. కానీ.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాల్లో ఒక్క బావి మాత్రమే తవ్వకం పూర్తయింది.70 నూతన బావుల తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇంకా 349 బావుల తవ్వకం ప్రారంభించలేదు. కామారెడ్డి జిల్లాలో ఏడాదికి 60 చొప్పున బావులు మంజూరైనా ఇప్పటివరకు ఒక్కటి మాత్రమే పూర్తయింది. అలాగే నిజామాబాద్‌ జిల్లాలో ఏడాదికి 80 నూతన బావుల తవ్వకం కోసం నిధులు ఖర్చుకాలేదు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో బావుల తవ్వకం, సేంద్రియ ఎరువుల తయారీ, రైతుల జల సౌధలు(ఫారం ఫాండ్స్‌), పశువుల పాకలు మొదలైనవి రైతులకు ఉపయోగపడే పనులు ముందుకు సాగడం లేదు.ఒక్క బావిలో పూడిక తీయలేదు..

ఉమ్మడి జిల్లాల్లో 30 శాతం పంటలకు నీటి సరఫరా బావుల ద్వారానే కొనసాగుతోంది. 2014–15 సంవత్సరంలో కొత్త బావుల తవ్వకానికి, పూడిక తీతకు నూతన మార్గదర్శకాలు రూపొందించిన అధికారులు అటకెక్కించారు. అలాగే ఆ ఏడాది తవ్విన బావులకు సకాలంలో కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతోపాటు బావుల తవ్వకం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించడంలో విఫలమవుతున్నారు. తద్వారా రైతులు ఆసక్తి చూపడం లేదు. అలాగే ఉమ్మడి జిల్లాల్లో మూడు దశాబ్దాలలో తవ్విన పాత బావులు 49,500 వరకు ఉన్నాయి. అధికారులు రైతులకు అవగాహన కల్పించి గత వేసవిలో పూడికతీత పనులు చేయించి ఉంటే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు బావుల్లోకి నీళ్లు చేరి భూగర్భ జలాలు బాగా పెరిగి వ్యవసాయానికి లాభసాటిగా ఉండేది. అధికారుల పనితీరు కారణంగా ఈ ఏడాది ఉమ్మడి జిల్లాల్లోని 49 మండలాల్లో ఒక్క బావిలో కూడా పూడికతీత పనులు చేపట్టకపోవడం గమనార్హం. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు బావుల తవ్వకం కంటే గొట్టపు బావుల తవ్వకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు తీయించడం, పారే నీటిని నిలువరించేందుకు వీలుగా అడ్డంగా రాతికట్టు కట్టించడం వంటివి చేపడితే బాగుండేది. వర్షం నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నీటి నిల్వ కుంటలు, పాత బావుల్లో పూడికతీత పనులు చేపడితే సమృద్ధిగా నీటి సంరక్షణ జరిగేది.ప్రమాదకర బావులను పూడ్చడం లేదు..

జిల్లాలో చాలా గ్రామాల్లో ఇంటికి ఆనుకుని, రోడ్ల పక్కన, వ్యవసాయ గట్ల పక్కన వృధాగా ఉండి ప్రమాదకంగా ఉన్న బావులను పూడ్చడానికి ఉపాధిహామీ పథకం ద్వారా అవకాశం ఉంది. ప్రమాదకర బావుల వల్ల చాలా మందితోపాటు పశువులు కూడా పడి మృతి చెందిన సంఘటనలున్నాయి. ఇలాంటి బావులను పూడ్చివేయడం రైతులకు, స్థానికులకు ఆర్థికంగా ఇబ్బందే. ముఖ్యంగా జక్రాన్‌పల్లి, ఆర్మూర్, గాంధారి, జుక్కల్‌ మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కావునా.. ఉపాధిహామీ పథకం కింద పాడుబడ్డ పాత బావులను పూడ్చి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంపీడీఓల సహాయంతో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులతో ఇలాంటి బావులను గుర్తించి పూడ్చివేయిస్తే బాగుంటుంది.

Back to Top