BREAKING NEWS
  • హైదరాబాద్‌: మిషన్‌ భగీరథపై సీఎం కేసీఆర్‌ సమీక్ష, త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
  • పీఎంఎల్‌ఏ కేసు: వేర్పాటువాద నేత షబీర్‌ షాపై చార్జిషీటును ఢిల్లీ కోర్టుకు సమర్పించిన ఈడీ

కెమెరా కన్ను భయపెడుతోంది!

కెమెరా కన్ను  భయపెడుతోంది!


వరుస ఘటనలతో ఆందోళన

సొంత మీడియాను సైతం దూరం పెట్టిన వైనం

కార్యక్రమాల్లో సొంత మనుషులతో నిఘా

టీడీపీ నేతల వ్యాఖ్యలపై ప్రజల్లో వ్యతిరేకత
నా పెన్షన్‌ తింటున్నారు.. నేనిచ్చే రేషన్‌ తీసుకుంటున్నారు..మేం వేసిన రోడ్లపై తిరుగుతున్నారు.. మేం వేసిన వీధి దీపాల కింద నడుస్తున్నారు..నాకు ఓటు వేయకపోతే ఎలా? లేదంటే పెన్షన్లు, రేషన్‌ తీసుకోవద్దు..నాకు వ్యతిరేకంగా ఉన్న గ్రామాలను పక్కన పెట్టాల్సి వస్తుంది.– నంద్యాల పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలు⇒  టీడీపీని గెలిపిస్తే రౌడీషీట్‌ ఎత్తివేస్తాం.. – టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టిఒక అబ్బ, అమ్మకు పుట్టిన వారైతే టీడీపీకి ఓటు వేయాలి. – ఓ టీడీపీ నేత అనుచిత వ్యాఖ్య⇒  రేయ్‌..ఉండ్రా నేను చెప్పేది విను.. – నిరుద్యోగులపై మంత్రి లోకేష్‌ మండిపాటు..ఇవే కాదు అధికార పార్టీ నేతల దురుసుతనానికి ఇంకా ఎన్నో సాక్షాలు. ఇవన్నీ వీడియోల రూపంలో బయటకు వచ్చాయి. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఎంతగా అంటే తమ కార్యక్రమాలకు కెమెరాలను నిషేధించేంతగా.. ఆఖరికి సొంత మీడియాను సైతం వీరు నియంత్రణలో పెట్టాల్సి వచ్చింది.కర్నూలు: అధికార పార్టీ వీడియో కెమెరా అంటేనే హడలెత్తుతోంది. వీడియోగ్రాఫర్‌ కనపడితే వెంటనే వెళ్లిపోవాలంటూ అధికార పార్టీ నేతలు ఆదేశిస్తున్నారు. సొంత పార్టీ అభ్యర్థి ప్రచార తీరును సైతం వీడియోలో బంధించేందుకు ఎవ్వరూ ప్రయత్నించవద్దంటూ ఆదేశాలు జారీచేసింది. ఇది కేవలం మీడియా సంస్థలకు చెందిన వారినే కాదు... ఏకంగా సొంత పార్టీకి చెందిన లోకల్‌ చానల్‌ వారిని కూడా అనుమతించకపోవడం ఇప్పుడు నంద్యాలలో చర్చనీయాంశమవుతోంది.లోకల్‌ చానల్‌కు చెందిన వీడియోగ్రాఫర్‌ తాజాగా వీడియో తీసేందుకు ప్రయత్నించగా... వద్దు వద్దు అని వారించడమే కాకుండా వీడియో కెమెరాను తీసి బ్యాగులో పెట్టుకునేదాకా వదిలిపెట్టకపోవడం గమనార్హం. వరుసగా అధికార పార్టీ నేతల వ్యవహారశైలి విమర్శల పాలవుతోంది. అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్న అంతులేని అహంభావానికి తోడు వారి వ్యవహారాలు వీడియో ఆధారాలతో సహా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుండటంతో భయాందోళనకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా నిబంధనలు విధించడం చర్చనీయాంశమవుతోంది.అనుక్షణం నిఘా...!.. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి అంతులేని అహంభావంతో వ్యవహరిస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి... ‘‘నేను వేసిన రోడ్లపై నడుస్తూ, నేను ఇచ్చిన పింఛన్‌ తీసుకుంటూ మాకు కాక వేరేవరికి ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా మాకు ఓటు వేయకపోతే అవన్నీ తీసుకోవద్దు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఉప ఎన్నికల్లో ఓటు వేస్తే రౌడీషీట్లు ఎత్తివేస్తామని కూడా అధికార పార్టీ నేతలు హామీనిచ్చారు. ఇక అధికారపార్టీ అభ్యర్థి ప్రచారంతో ఎవరికి ఓటు వేస్తావంటే... శిల్పా మోహన్‌రెడ్డికి అని ఒక అవ్వ బదులిచ్చింది. ఇవన్నీ కూడా మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో భారీగా ప్రచారం జరిగాయి. అంతేకాకుండా మంత్రి లోకేష్‌ కూడా రేయ్‌... అని నంద్యాలకు చెందిన యువకులను సంబోధించి అడ్డంగా దొరికిపోయారు. దీంతో అనుక్షణం నిఘా ఉంచి వీడియో తీయకుండా అడ్డుకోవాలని అధికార పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మీడియాకు మంత్రుల పర్యటన వివరాలను కూడా వెల్లడించడం లేదు. అదేవిధంగా ఎవ్వరూ వీడియో తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.సొంత పార్టీ కార్యకర్తలను సైతం...!

కేవలం మీడియానే కాకుండా సొంత పార్టీ కార్యకర్తలను సైతం అధికారపార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఎక్కడ కెమెరాలతో వీడియో తీస్తారేమోనని అనుక్షణం నిఘా ఉంచుతున్నారు. ఎవరూ వీడియో తీయకుండా చూసేందుకు ప్రత్యేకంగా కొద్ది మంది నిరంతరం గమనిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత భయాందోళనలతో అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలు బయటపడకూడదనే ఉద్దేశంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

Back to Top