ఆడేదెలా?


అయోమయంలో క్రీడారంగం

►  జిల్లాల విభజనతో సమస్య జఠిలం

► ‘ఉమ్మడి’గానా.. కొత్తజిల్లాల్లో ఎంపికలా..?

► సందిగ్ధంలో క్రీడాపండితులు

► జాతీయస్థాయి పోటీల షెడ్యూల్‌ ఖరారు

► 7న రాష్ట్ర పాఠశాలల క్రీడాసమాఖ్య     సమావేశం

► తెరపైకి జోన్‌ల వ్యవస్థ?




కరీంనగర్‌ స్పోర్ట్స్‌: రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగి 10 నెలలు దాటుతోంది. అన్నిరంగాలు, శాఖలు వాటిపని అవి చేసుకుంటూ వెళ్తున్నాయి. చిన్నజిల్లాల ఏర్పాటు మంచిదేనన్న భావన ప్రజల్లో వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే క్రీడారంగం స్థితిగతులపై మాత్రం ఇప్పటికీ నోరుమెదపడం లేదు. ఫలితంగా క్రీడాకారులు నిరాశాకు గురవుతున్నారు. జిల్లాల విభజనకు ముందే పాఠశాల, కళాశాల, క్రీడాసంఘాలు రాష్ట్రస్థాయి పోటీల తేదీలను ఖరారు చేశాయి.


ఆ సమయంలో ఉమ్మడి జిల్లాగానే పోటీలు నిర్వహించారు. జాతీయస్థాయి పోటీల షెడ్యూల్‌ కూడా సమీపంచడంతో జిల్లాలో క్రీడాకారుల ఎంపిక, పోటీల నిర్వహణ గందరగోళంగా తయారవుతుందనే భావనతో ఉమ్మడి జిల్లా పోటీలను నిర్వహించారు. అసలు సమస్య ఇప్పుడు మొదలైంది. ఓవైపు ఆల్‌ఇండియా క్రీడా సంఘాలు, స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అన్ని క్రీడలకు సంబంధించి జాతీయస్థాయి పోటీల షెడ్యూల్‌ ఖరారు చేసింది.. మరికొన్ని సంఘాలు షెడ్యూల్‌ విడదల చేసే పనిలో పడ్డాయి.


రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పోటీల నిర్వహణపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్రం విషయం ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉందన్న చందంగా తయారైంది. అసలు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు పాతజిల్లాలతో జరుపాలా...? లేక కొత్తగా ఏర్పడిన జిల్లాలతో నిర్వహించాలా..? అన్న తర్జనభర్జన ఇంకా కొనసాగుతోంది. దీనిపై ప్రభుత్వమే ఒక నిర్ణయానికి రావాలని క్రీడాపండితలు అభిప్రాయపడుతున్నారు.



అందరిలోనూ అయోమయమే..

జిల్లాల విభజన అందరిలో సంతోషం వ్యక్తంకాగా.. క్రీడాకారుల్లో మాత్రం అయోమయం నెలకొంది. కొన్ని క్రీడాసంఘాలు చేపట్టిన జిల్లాస్థాయి ఎంపికకు హాజరుకావాలా..? లేదా..? అనే సందేహం చాలామంది క్రీడాకారుల్లో ఏర్పడింది. దీంతో పలు క్రీడా సంఘాలు నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలకు స్పందన కరువైంది. 2017–18 సంవత్సరానికి క్రీడాక్యాలండర్‌ ఎలాగోలా ముగిసింది. ఇప్పుడు 2018–19 క్రీడా క్యాలండర్‌ వచ్చింది. ఇప్పుడు అధికారులు ఏంచేస్తారో ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. దీంతో అసలు ఎంపిక పోటీలు ఉమ్మడి జిల్లాగానా..? కొత్తగా ఏర్పడిన ఆయా జిల్లాల పరిధిలోనా..? అనే అనుమానం వ్యక్తమవుతోంది.



కొత్త జిల్లాలతో ముచ్చెమటలే...?

గతంలో తెలంగాణలోని పది జిల్లాలను ప్రభుత్వం 31 జిల్లాలుగా విభజించింది. ఇది అన్ని శాఖలకు అనుకూలంగా మారినా.. క్రీడారంగానికి మాత్రం పెద్ద సమస్యేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పది జిల్లాలుగా ఉన్నప్పుడు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. ఇప్పుడు 31జిల్లాలుగా మారడంతో రాష్ట్రపోటీల నిర్వహణ గగనతరం అవుతుందనే భావన వ్యక్తమవుతోంది.


రాష్ట్రస్థాయి పోటీలకు 31 జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించాలంటే సాధ్యమయ్యే పనేనా..? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. క్రీడాకారులకు భోజనం, వసతి కల్పించాలంటే ఏ జిల్లా సౌలభ్యంగా ఉందో ముందే చెప్పాలంటున్నారు. కరీంనగర్‌ను చూసుకున్నా.. పది జిల్లాల క్రీడాకారులకు వసతి కల్పించేందుకు గతంలో నిర్వాహకులు ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు 31 జిల్లాల నుంచి క్రీడాకారులు వస్తే పరిస్థితి ఏంటని ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారు.



ఏటూ తేల్చని క్రీడాశాఖ

ఓవైపు ఆయా క్రీడా సంఘాలు జాతీయస్థాయి పోటీల తేదీలను ఖరారు చేసింది. జిల్లాల విభజన తర్వాత కేంద్రం ఖేలోఇండియా పేరుతో పోటీలు నిర్వహించింది. అప్పుడు కేంద్రం 31 జిల్లాలకుగాను పదిజిల్లాలకే బడ్జెట్‌ను విడుదల చేసింది. ఆ బడ్జెట్‌లోనే పోటీలను నామమాత్రంగా పోటీలు నిర్వహించి మమ అనిపించారు నిర్వాహకులు. కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలకు స్పందనే కనిపించలేదు. ఇప్పటికైన క్రీడా శాఖ తేరుకుని పరిష్కారమార్గం చూపాలని కోరుతున్నారు.



తెరపైకి జోన్‌ల వ్యవస్థ?

31 జిల్లాలతో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణ  భారంగా భావిస్తున్న క్రీడా సమాఖ్య జోన్‌ ల వ్యవస్థను ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. కాగా ఇప్పటికే సోషల్‌ మీడియాలో జోన్‌ల వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం హల్‌చల్‌ చేస్తోంది. జోన్‌ ల వ్యవస్థపై ఈనెల 7న హైదరాబాద్‌లో జరిగే క్రీడా సమాఖ్య సమావేశంలో ఫైనల్‌ చేయనున్నట్లు సమాచారం. జోన్‌ వ్యవస్థలో పాత ఉమ్మడి జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీలు జరుగనున్నాయి. తొలుత పాత జిల్లాల నుంచి కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో తొలుత జిల్లాస్థాయి పోటీలను నిర్వహించి ఆ తరువాత పాతజిల్లాలో జోన్‌ స్థాయి పోటీలను నిర్వహించడానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. దీంతో పాత పదిజిల్లాలతోనే రాష్ట్ర స్థాయి పోటీలు జరుగనున్నాయి. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top