బాబు బంగారం

బాబు బంగారం

- అనాథ యువతిని పెళ్లి చేసుకోనున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

- అమలాపురం కామాక్షి పీఠం ప్రేమ మందిరంలో పెరిగిన అనాథ‌

 

‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని.. ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని.. నేనున్నానని.. నీ తోడవుతానని, నేనున్నానని.. నిను మనువాడతానని’’ అంటూ ఓ అనాథ యువతితో ఏడడుగులు నడిచేందుకు.. మూడుముళ్ల బంధంతో జీవిత పయనం సాగించేందుకు సిద్ధమయ్యాడు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. దీంతో అమలాపురం కామాక్షీ పీఠంలోని ప్రేమమందిరంలో ‘పెళ్లి’సందడి నెలకొంది. 

 

అమలాపురంలోని కామాక్షీ పీఠంలో అనాథ పిల్లలు పెరిగే ప్రేమమందిరానికి చెందిన అనాథ యువతి దాక్షాయణిని పెద్దాపురానికి చెందిన, చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పేరి ఉమామహేశ్వరరావు వివాహం చేసుకునేందుకు నిశ్చయించాడు. వీరికి శనివారం రాత్రి 5.10 గంటలకు (తెల్లవారితే ఆదివారం) వివాహం జరిపేందుకు పీఠాధిపతి కామేశ మహర్షి ముహూర్తం నిర్ణయించారు. దాక్షాయణికి రక్తసంబంధీకులు ఎవరూ లేకపోయినా పీఠం ఉన్న వీధికి చెందిన పెమ్మరాజు ప్రసాదరావు, సుజాత దంపతులు కన్యాదానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ప్రేమ మందిరంలో పెళ్లి సందడి నెలకొంది. తమ అక్క పెళ్లికూతరు కాబోతోందనే ఆనందంలో మిగతా అనాథపిల్లలు ఆనందంలో ఉన్నారు. కామాక్షీదేవి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ ఆదర్శ వివాహం జరగనుంది.ఆ ఆలోచన వచ్చిందిలా..

గత ఏడాది పీఠం ప్రేమ మందిరంలోని జరిగిన ఓ అనాథ యువతి వివాహ కార్యక్రమానికి ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఆ వివాహ సమయంలో దాక్షాయణిని చూసిన ఆయన తానూ అనాథను పెళ్లిచేసుకోవాలన్న ఆదర్శమైన ఆలోచనకు వచ్చారు. దాని ఫలితమే వారి వివాహం నేడు కార్యరూపం దాల్చుతోంది.ఎక్కడో పుట్టి.. ప్రేమ మందిరంలో పెరిగి..

ఐదేళ్ల ప్రాయంలో దాక్షాయణి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం వచ్చే ఆర్టీసీ బస్సులో రాజమహేంద్రవరం చేరుకుంది. అక్కడ బస్‌ స్టేషన్‌లో ఏడుస్తున్న ఆ చిన్నారిని కొందరు చేరదీసి పోలీసుల సహకారంతో అమలాపురం కామాక్షీపీఠంలోని ప్రేమ మందిరంలో చేర్చారు. సుమారు ఇరవై ఏళ్ల నుంచి  పీఠంలోనే పెరిగింది. ఇంటర్మీడియట్‌ వరకూ చదివింది. సంగీతం నేర్చుకుంది. గాయకురాలిగా ఎన్నో మధుర గీతాలు ఆలపించి మరెన్నో బహుమతులు పొందింది. అమలాపురంలోని పలు పాఠశాలల్లో సంగీతం ఉపాధ్యాయినిగా పనిచేసి తన వంతు ఉపాధికి బాటలు వేసుకుంది.వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది 

నా అన్న వాళ్లు లేకపోయినా అమ్మ, నాన్న కమ్మని పిలుపులకు దూరమైనా ఆ లోటు ప్రేమమందిరంలో ఏనాడు అనిపించలేదు, కనిపించలేదు. 60 మంది పిల్లల మధ్య తానూ ఓ అనాథగా పెరిగినా ఆ భావన ఏ రోజూ కలగకుండా పీఠాధిపతి కామేశ మహర్షి, ప్రేమ మందిరం అమ్మ వాణి తమను పెంచారు. తమ ప్రేమ మందిరం కుటుంబం నుంచి వెళ్లిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. 

- దాక్షాయణి 
Back to Top