అణు ప్రకంపనలు


 


సాక్షి  ప్రతినిధి, నెల్లూరు :


కావలి సమీపంలో అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన వ్యవహారం అంతా రహస్యంగా సాగుతోంది. ఈ ప్రతిపాదన బయటకు పొక్కితే ప్రాథమిక దశలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని గుర్తించిన ప్రభుత్వం దీనిపై జిల్లా స్థాయి అధికారులెవరూ మాట్లాడరాదని ఆదేశించింది. కింది స్థాయి అధికారులకు కూడా అసలు విషయం పూర్తిగా తెలియకుండానే భూముల గుర్తింపు, ఇందుకు సంబంధించి ప్రాథమిక సర్వే పూర్తి చేయించారు. అణువిద్యుత్‌ కేంద్రం నిర్మాణం కోసం రహస్యంగా సాగుతున్న చర్యలపై ‘సాక్షి’ శనివారం ‘కావలిపై అణుబాంబు’  శీర్షికన ప్రచురించిన కథనం అటు ప్రజల్లోను, ఇటు అధికారుల్లోను తీవ్ర చర్చనీయాంశమైంది.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్సాహంతో రాష్ట్రంలో ఆరు అణువిద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి దారులు తెరుచుకున్నాయి. కావలి సమీపంలో ఒక కేంద్రం నిర్మించడానికి అనువైన ప్రాంతంగా గుర్తించారు. రెండు నెలల కిందటే రాష్ట్ర ప్రభుత్వం భూమి గుర్తించడం కోసం జిల్లా కలెక్టర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెవిన్యూ అధికారులు కావలి సమీపంలోని చెన్నాయపాలెం, రుద్రకోట అణువిద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి అనువైన గ్రామాలుగా గుర్తించారని విశ్వసనీయంగా తెలిసింది. తహసీల్దార్‌ స్థాయి అధికారులు కూడా భూమి అయితే చూశారు కానీ ఇది ఎందుకు?  ఏమిటి? అనేది తమకు తెలియదని చెబుతుండటం గమనార్హం.


ఈ వ్యవహారం మొత్తం అత్యంత రహస్యంగా నడిచి ఒక రూపు వచ్చాకే ఇటీవలి రష్యా పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు ఆ దేశ ప్రధానితో ఈ విషయం గురించి చర్చించినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ, రష్యాలోని అణువిద్యుత్‌ కంపెనీ ప్రతినిధులు వచ్చి ఈ భూమిని చూసి ఇక్కడ అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేయొచ్చని నిర్ణయిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 


అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన సమాచారం అడిగితే రెవిన్యూ శాఖలోని  జిల్లా  స్థాయి అధికారులు సైతం మాకు తెలియదని చెబుతుండటం గమనార్హం. ఒక అధికారి మాత్రం ప్రాథమికంగా భూమిని గుర్తించారని, తనకు ఇంత వరకే తెలుసునని ఆఫ్‌ ది రికార్డ్‌గా ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు.


 ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయాలనుకుంటున్నారు–రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే


కావలిలో అణువిద్యుత్‌ కేంద్రం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయాలని చూస్తోంది. చంద్రబాబు నాయుడు చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రపంచంలోని దేశాలన్నీ అణువిద్యుత్‌ కేంద్రాలను మూసి వేస్తుంటే ఆ పరికరాలను తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేయాలనుకోవడం దారుణం. ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేంగా పోరాటం చేస్తాం. 


అణువిద్యుత్‌కు వ్యతిరేకంగా పోరాడుతాం    –  మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి


 కావలిలో అణువిద్యుత్‌ కేంద్రం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వే కూడా చేయించింది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వమే చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు ఎందుకు దాచి పెడుతున్నారో అర్థం కావడం లేదు. ప్రజలను నాశనం చేసే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజల తరఫున సీపీఎం పోరాడుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల స్థానికులకు చెత్త ఊడ్చే పనులు తప్ప ఒక్క మంచి ఉద్యోగం కూడా రాదు. అన్ని రాజకీయ పార్టీలు పోరాటానికి సిద్ధం కావాలి.       


అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు ప్రమాదకరం –  పనబాక కృష్ణయ్య, డీసీసీ అధ్యక్షుడు  


కావలిలో నెలకొల్పనున్న అణువిద్యుత్‌ కేంద్రం అత్యంత ప్రమాదకరం. దీనివల్ల పరిసర ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఇది సరైన నిర్ణయం కాదు. రానున్న రోజుల్లో అన్నిపార్టీలతో కలసి ప్రజాపోరాటం చేసేందుకు సిద్ధం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top