ఏదైనా.. ఏమైనా.. జరిగింది ఘోరం | No justice to Sexually harrassed minors | Sakshi
Sakshi News home page

ఏదైనా.. ఏమైనా.. జరిగింది ఘోరం

Aug 14 2016 9:41 AM | Updated on Jul 23 2018 9:13 PM

ఏదైనా.. ఏమైనా.. జరిగింది ఘోరం - Sakshi

ఏదైనా.. ఏమైనా.. జరిగింది ఘోరం

2012 ఫోక్సా చట్టం ప్రకారం మైనర్‌లు లైంగిక దాడులకు గురైనప్పడు అత్యవసర సాయం కింద రూ.1.50 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

మా మీద మీకేల కోపం!
- గాయపడిన హృదయాలకు దక్కని పరిహారం
- లైంగిక దాడి బాధితులకు నేటికీ అందని సాయం
- జిల్లాలో 100 మందికిపైగా మైనర్లపై లైంగిక దాడి కేసులు
- బాధితులు, వారి కుటుంబాలకు కొరవడిన అవగాహన
- పట్టించుకోని అధికారులు, దళిత, ప్రజాసంఘాల నాయకులు

 
2012 ఫోక్సా చట్టం ప్రకారం మైనర్‌లు లైంగిక దాడులకు గురైనప్పడు అత్యవసర సాయం కింద రూ.1.50 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. లైంగిక దాడులకు గురైనప్పడు ఆరోగ్యపరంగా, మానసికంగా బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమాజంలో చిన్నచూపు చూడకుండా ఉండటంతో పాటు వారి పోషణకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.1.50 లక్షలు చొప్పున పరిహారం అందించేలా చర్యలు తీసుకుంది.  సంఘటన జరిగిన 15 రోజుల్లో 25 శాతం, చార్జిషీటు కోర్టుకు సమర్పించిన తర్వాత 25 శాతం, కేసు ముగింపునకు వచ్చినప్పుడు 25 శాతం,  కేసు నిర్ధారణ జరిగినప్పుడు మిగిలిన 25 శాతం మొత్తం అంటే రూ.1.50 లక్షలు లైంగిక దాడికి గురైన బాలికకు అందించాలి. జిల్లాలో ఆ విధంగా జరగడం లేదు. ఆరుగురికి మాత్రమే పరిహారం దక్కింది. మిగిలిన వారికి దక్కలేదు.

 చివరకు లైంగిక దాడి రుజువై కోర్టు నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించిన కేసుల్లో కూడా బాధితులకు పైసా దక్కకపోవడం చూస్తే ప్రభుత్వం అత్యవసర సాయం ఏ విధంగా అందిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన నిధులు కేటారుుంచకుండా ప్రభుత్వం మీనమీషాలు లెక్కిస్తోంది.
 
కొరవడిన ప్రజాస్వామ్యవాదుల సహకారం

అత్యవసర పరిహారంపై బాధిత కుటుంబాలకు ఎటువంటి అవగాహన ఉండదు. అసలు ఇటువంటి ఆర్థికసాయం ఒకటుందని తెలిసిన వారు చాలా తక్కువే. ఈ కారణంతోనే బాధితులు పరిహారాన్ని పొందలేకపోతున్నారు. దీనికి తోడు సంబంధిత అధికారులు, సిబ్బంది అలసత్వం కారణంగా పరిహారాన్ని కోల్పోతున్న బాధితులు అనేక మంది ఉన్నారు. దళిత, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాస్వామ్యకవాదులు కూడా వీరి గురించి పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. మైన ర్లపై లైంగిక దాడి కేసు నమోదైన వారం రోజుల్లోనే ఆ ప్రాంత ఆంగన్‌వాడీ కార్యకర్త పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కాపీ తీసుకుని సీడీపీఓ ద్వారా ఐసీడీఎస్ పీడీకి పంపాల్సి ఉంటుంది.

పడీ.. కలెక్టర్‌కు నివేదించాలి. అవగాహన ఉన్న బాధిత కుటుంబాల వారు నేరుగా పీడీ లే దా కలెక్టర్‌కు ఎఫ్‌ఐఆర్ కాపీ ఇస్తే న్యాయం త్వరగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా జరిగితే కలెక్టర్ ప్రభుత్వానికి సమాచారం అందించి పరిహారానికి సంబంధించిన నిధులు మంజూరయ్యేలా చేస్తారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ఇందులో జోక్యం చేసుకోవడం లేదు. ఫలితంగా బాధిత బాలికలకు నష్టం జరుగుతోంది.
 
♦ చినగంజాం మండలం చింతగుంపలలో కనురెప్ప కాటేసింది. సొంత తండ్రే మదమెక్కిన మృగంలా మారి కుమార్తెపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఐదు నెలల ఆరు రోజుల్లో జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చి నిందితునికి జీవితఖైదు విధించింది. లైంగిక దాడికి గురైన బాలికలకు ఫోక్సా చట్టం కింద ప్రభుత్వం రూ.1.50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉండగా నేటికీ ఇవ్వలేదు.
 
♦ ఏదుబాడులో మాటలురాని, అంగవైకల్యం ఉన్న బాలికపై పక్కింటి యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో కూడా న్యాయస్థానం త్వరగానే తీర్పు ఇచ్చింది. నిందితుడికి శిక్ష విధించింది. కానీ భాదితురాలికి నేటికీ నయా పైసా ప్రభుత్వ సాయం అందలేదు.
 
 ♦ గుడ్లూరులో ఓ ఆటో డ్రైవర్.. బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ఒడిగట్డాడు. ఈ కేసులో నిందితునికి జిల్లా న్యాయస్థానం 3 నెలల్లోనే జీవిత ఖైదు విధించింది. సంఘటన జరిగిన మూడు నెలల్లోనే నిందితునికి జీవిత ఖైదు విధించడం దేశంలోనే సంచలనం కలిగించింది. ఈ బాలికకూ పైసా సాయం అందలేదు.
 
♦ చీరాల సబ్ డివిజన్‌తో పాటు వేటపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో 15 మంది మైనర్‌లపై లైంగిక దాడులు జరిగాయి. జిల్లాలోని 56 మండలాల్లో 100 మందికిపైగా బాలికలపై లైంగిక దాడులు జరిగినా నేటికీ ఎవరికీ నష్ట పరిహారం ఇవ్వలేదు.
 - చీరాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement