ఏ నోట విన్నా.. ప్రళయ జ్ఞాపకమే...

ఏ నోట విన్నా.. ప్రళయ జ్ఞాపకమే... - Sakshi


కలలో కూడా ఊహించని దుర్ఘటన. మరిచిపోదామన్నా వెంటాడుతున్న సంఘటన. ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి కళ్లు తెరిచేలోగా విరుచుకు పడింది. అంతవరకూ తమతో ఉన్న బంధువులు జల ప్రళయానికి ఎవరు ఏమయ్యారో.. ఎవరు ఎటువైపు వెళ్లారో... తేరుకునేలోపే అంతా జరిగిపోయింది. ఆనందంగా ఉత్తరాఖండ్‌లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుందామని నగరం నుంచి వెళ్లినవారిలో ఎంతమంది క్షేమంగా ఉన్నారో తెలియని పరిస్థితి. ఓ పక్క కన్న బిడ్డలు చేజారిపోయిన తల్లిదండ్రుల వేదన.. మరోపక్క తమవారు ఏమైపోయారోనని ఇక్కడివారు పడుతున్న ఆందోళన.. ‘భగవంతుడా..! ఇంతటి కడుపు కోత పగవాడికి కూడా వద్దు’ అంటూ విలపిస్తున్నారు. అష్టకష్టాలు పడి నగరానికి  చేరినవారి కళ్లల్లో సుడులు తిరుగుతున్న నీరు ప్రళయ విలాపాన్ని చెబుతోంది.

 

ఆ భవనంలోనే బస చేయాలనుకున్నాం

కుత్బుల్లాపూర్: ‘ప్రతి గంటకు వాతావరణం మారిపోయేది. ఎటు చూసినా నీరే. మా డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్లే ఇంటికి చేరాం..’ అంటూ తమని పరామర్శించేందుకు వచ్చిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌కు యాత్రలో తాము పడ్డ కష్టాలు గురించి వివరించారు అయోధ్యనగర్ వాసి వెంకటయ్య గౌడ్. ‘ఈ నెల 10న 25 మంది సభ్యుల బృందం నగరం నుంచి బయల్దేరి వెళ్లాం. పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తూ ముందుకు సాగుతున్నాం. ఉన్నట్టుండి భారీ వర్షం. మరో 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే కేదారినాథ్‌కు చేరుకుంటాం. ఇంతలోనే వరద బీభత్సం. మేం కేదారినాథ్‌లో బస చేయాలనుకున్న భవనం పేకమేడలా కూలి వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన సంగతి మాకు తెలిసి.. భగవంతుడా..! అని ఊపిరి పీల్చుకున్నాం. వెంటనే వెనుదిరిగాం. రెండురోజులు పాటు తిండీ నిద్రా లేదు. అంతా నడకే. కొండలు, గుట్టలు దాటుకుంటూ సురక్షిత ప్రదేశానికి చేరుకున్నాం. ప్రభుత్వం ఎన్నో విధాలుగా సాయం చేస్తున్నామని ప్రకటిస్తున్నా మాకు ఎటువంటి సాయం అందలేదు. మా బృందం అంతా క్షేమంగా మంగళవారం రాత్రికి నగరానికి చేరుకున్నాం. మాలాగే ఎంతోమంది ఇప్పటికీ కొండల్లో చిక్కుకున్నారు’.

 

గౌలిగూడ యాత్రికులు  క్షేమం..

అఫ్జల్‌గంజ్ : కేదారినాథ్ యాత్రకు వెళ్లిన గౌలిగూడ ఉస్మాన్‌షాహికి చెందిన వ్యాపారి బొడ్ల నర్సింగరావు, ఆయన కుటుంబ సభ్యులు 13 మంది క్షేమంగా నగరానికి చేరుకున్నారు. దీంతో బం ధువులు ఊపిరి పీల్చుకున్నారు. తాము అనుభవించిన దుర్ఘటన వివరాలను నర్సిగరావు విలేకరులతో పంచుకున్నారు. కేదారినాథ్ వెళదామనుకుంటే అక్కడ డోలీ, టాంగా నిర్వాహకుల సమ్మె కారణంగా ముందుకు వెళ్లలేక పోయామన్నారు. దీంతో 15వ తేదీన యమునోత్రికి వెళుతుండగా భారీవర్షం మొదలైందన్నారు. ముందుకు వెళ్లలేక సమీప గ్రామంలో నిలిచిపోయామని, మూడు రోజుల పాటు అక్కడే ఉన్నామన్నారు. కరెంటు లేక.. సెల్‌ఫోన్ చార్జింగ్ అయిపోయి, సిగ్నళ్లు అందక.. తమవారితో మాట్లాడే అవకాశం లేక భయపడ్డామన్నారు.

 

ఎవరు ఏమయ్యారో తెలియడం లేదు..

బేగంపేట : తనతో పాటు చార్‌ధామ్ యాత్రకు వచ్చిన 60 మంది ఎవరు ఏమయ్యారో తెలియడం లేదని యాత్ర నుంచి క్షేమంగా తిరిగి వచ్చిన బేగంపేటకు చెందిన మస్టిపల్లి మాధవి(55) ఆవేదన వ్యక్తం చేశారు. ఆనందంగా రైలులో వెళ్లినవారు వరదలకు చెల్లాచెదురయ్యారని కన్నీరు పెట్టుకున్నారు. ఈనెల 14న గంగోత్రి దర్శనం పూర్తిచేసుకొని సమీపంలోని సకిటాప్ దగ్గర బసచేసామన్నారు. అక్కడ నుంచి ఉత్తరకాశీకి వెళుతుండగా కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. ‘వరదల్లో మర ణం అంచుల వరకు వెళ్లి వచ్చాము. భాషరాని ప్రాం తంలో మేము పడ్డ బాధలు వర్ణణాతీతం. బోరున వర్షం.. చిమ్మచీకటి.. వణికించే చలిలో బతికిబట్ట కడతామని కలలో కూడా ఊహించలేదు. మొత్తం గ్రూపు లో 60 మంది బయలుదేరగా వరదల్లో చిక్కుకొని అంతా చెల్లాచెదురైయ్యారు. మమ్మల్ని తీసుకెళ్లిన టూర్ ఆపరేటర్ మధ్యలోనే జారుకున్నాడు. తిరిగి ఎంతమంది స్వస్థలానికి చేరుకున్నారో తెలియడం లేదు’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

 

ఇంతటి ఘోరం జరిగిందని తెలియదు...

చిలకలగూడ : బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో... ఇంతటి ఘోరం జరిగిందనే విషయం తనకు తెలియదని ఇంటికి వచ్చిన తరువాత పేపర్లు, టీవీల్లో వస్తున్న వార్తల్ని చూసి తాము ఇలాంటి భయంకర పరిస్థితుల నుంచి బయటపడ్డామా..! అని ఆశ్చర్యానికి లోనయ్యానని చార్‌ధామ్ యాత్ర నుంచి మంగళవారం రాత్రి సురక్షితంగా నగరానికి చేరిన చిలకలగూడ వాసి దానమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తన యాత్ర అనుభవాల్ని వివరించారు. ‘ఈ నెల 6న 12 మంది బంధుమిత్రులతో కలిసి చార్‌ధామ్ యాత్రకు బయల్దేరి వెళ్లాం. హరిద్వార్, బద్రీనాథ్, ఉత్తరకాశీ, విష్ణుకాశీలను దర్శించుకుని 13వ తేదీన కేదారినాథ్‌కు చేరుకున్నాం.


15న గంగోత్రిని దర్శించుకుని తిరిగివస్తుంటే ట్రాఫిక్‌జామ్ అయ్యిందని తెలిసింది. సుఖీటాప్ కైలాససత్రంలో తలదాచుకున్నాం. వరదలు ముంచెత్తాయని, రోడ్లు కొట్టుకుపోయాయని తెలిసింది. ఐపీఎస్ అధికారిణి అరుణ బహుగుణ సహకారంతో దగ్గర్లోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ స్థావరానికి చేరాం. అక్కడ ఐదురోజులున్నాం. అక్కడ్నుంచి కొండలు గుట్టలు దాటుకుంటూ పదికిలోమీటర్లు నడిచి ఆర్సిలా బేస్‌క్యాంప్ చేరుకున్నాం. అక్కడ కూడా తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. అక్కడ్నుంచి హరిద్వార్ మీదుగా ఢిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకున్నాం. విమానంలో నగరానికి వచ్చాం.’

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top