ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దాం

ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దాం

– రాజకీయ పార్టీల ప్రతినిధులకు జేసీ పిలుపు

 

కర్నూలు(అగ్రికల్చర్‌): స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ సి.హరికిరణ్‌ కోరారు. శుక్రవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్‌, ముసాయిదా ఓటర్ల వివరాలను ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మూడు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లోని ఆర్‌డీఓ కార్యాలయాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించామని.. పోలింగ్‌ కేంద్రాలు, ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈ నెల 28న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు.

 

ఓటరు నమోదు అధికారిగా, రిటర్నింగ్‌ అధికారిగా తానే వ్యవహరిస్తానని.. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏ సమయంలోనైన సూచనలు, క్లారిఫికేషన్‌లు కోరవచ్చన్నారు. స్థానిక ఓటర్లందరికీ సంబంధిత అధికారులు ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల కోడ్‌ ఈ ఎన్నికలకు వర్తిస్తుందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూచా పాటించాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, క్యాంపులకు తరలించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. అలాంటి వారిపై ఎన్నికల చట్టం ప్రకారం చర్యలు తప్పవన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, వైఎస్‌ఆర్‌సీపీ ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నేత ఆకెపోగు వెంకటస్వామి, టీడీపీ ప్రతినిధి కేఇ జగదీష్, బీజేపీ ప్రతినిధి రమేష్‌బాబు, సీపీఐ నగర కార్యదర్శి రసూల్, సమాజ్‌వాదీ పార్టీ నేత శేషుయాదవ్, ఎన్నికల సెల్‌ సూపరింటెండెంట్‌ ఎలిజబెత్‌ తదితరులు పాల్గొన్నారు. 

 
Back to Top