మహాత్మా.. మా కలెక్టర్‌ను జిల్లా నుంచి సాగనంపవా?

మహాత్మా.. మా కలెక్టర్‌ను జిల్లా నుంచి సాగనంపవా? - Sakshi


తన బినామీ కనుకే బదిలీకి వెనుకాడుతున్న సీఎం

కలెక్టర్‌ చట్ట ఉల్లంఘనలను ఆధారాలతో కోర్టు ముందు ఉంచుతాంబదిలీ చేయకపోతే పోరాటం ఉధృతం

మహాత్మునికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి




తిరుపతి రూరల్‌: ‘మీరు తీసుకొచ్చిన ప్రజాస్వామ్యాన్ని జిల్లాలో  కలెక్టర్‌ అపహాస్యం చేస్తున్నారు. పరిపాలనను అస్తవ్యస్తం చేసి,  బ్రిటీష్‌ కాలంనాటి కలెక్టర్లను తలదన్నేలా తనకు తానే ఓ నియంతగా భావిస్తూ పాలన చేస్తున్న మా కలెక్టర్‌ను జిల్లా నుంచి బదిలీ చేయించు మహాత్మా...’ అంటూ గాంధీజీని వైఎస్‌ఆర్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షులు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వేడుకున్నారు. బుధవారం సాయంత్రం తిరుపతిలోని మహాత్మగాంధీ విగ్రహానికి ఈ మేరకు ఆయన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌ కింద వేలాది ఫైళ్లు పెండింగ్‌లో నలుగుతున్నాయన్నారు. వేళాపాళా లేని వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు, అనవసర సమావేశాల దెబ్బకు ఏ అధికారి తమ సీట్లలో కూర్చుని, ప్రజలకు మేలు చేసే పరిస్థితి లేదన్నారు. కలెక్టర్‌  ఏ అధికారిని రోజువారీ పనులు చేయనీయక పోవడంతో జిల్లా, మండల, పంచాయతీ స్థాయి అధికారుల వద్ద కొన్ని లక్షల ఫైళ్లు పరిష్కారానికి నోచుకోక పెండింగ్‌లో ఉన్నా యన్నారు. ఫైళ్లు క్లియర్‌ కాకపోవడంతో జిల్లా నుంచి పంచాయతీ స్థాయి వరకు సకాలంలో అర్హులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీ చేయమని సీఎంకు వినతిపత్రం సమర్పించినా మా కలెక్టర్‌ ఆయన బినామీ కనుకే బదిలీ చేయలేకున్నారని తెలిపారు.



సీఎం వ్యక్తిగత ప్రయోజనాల కోసం బదిలీ చేయలేదు కనుకే స్వాతంత్య్రం తెచ్చిన మహాత్ముడికి విన్నవించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడా వ్యాపారులు, భారీ పారిశ్రామిక వేత్తలకు కలెక్టర్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలను, జరిపిన క్విడ్‌ప్రోకో పనులను ఆధారాలతో సహా త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలు, చట్టాలను కలెక్టర్‌ ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ఎలా ధిక్కరించి, దుర్వినియోగం చేసి ఈ రెండేళ్ల పాలన కొనసాగించారో ఆధారాలతో సహా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జిల్లాలో పాలనను అస్తవ్యస్తం చేస్తున్న కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయాలని, లేకుంటే పండుగ తర్వాత వివిధ ఆందోళన కార్యక్రమాలు సైతం చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు మునీశ్వర్‌రెడ్డి, మాధవరెడ్డి, మునస్వామియాదవ్, మూలం బాబు, చెన్నకేశవరెడ్డి, పిపాసి, యుగంధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, ఒంటి శివ, లక్ష్మయ్య, వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top