‘స్పీడ్‌గన్స్’తో యాక్సిడెంట్లకు అడ్డుకట్ట: ఆనంద్‌కుమార్


సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్‌రోడ్డుపై వరుస ప్రమాదాల నేపథ్యంలో హెచ్‌ఎండీఏ రంగంలోకి దిగింది. ‘స్పీడ్‌గన్స్’తో యాక్సిడెంట్లకు అడ్డుకట్ట వేయాలని తాజాగా నిర్ణయించింది. 120 కిలోమీటర్ల నిర్ణీత వేగానికి మించి ప్రయాణించే వాహనాలకు కళ్లెం వేయనుంది. మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాలను స్పీడ్‌గన్స్ ద్వారా గుర్తించి జరిమానా (చలానా) విధించనున్నారు. ఈ జరిమానాను ఎగ్జిట్ పాయింట్ (కిందకు దిగేచోట)లోని టోల్‌బూత్ వద్ద వసూలు చేస్తారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఈ స్పీడ్‌గన్స్‌ను టోల్‌ప్లాజాలోని సిస్టంతో అనుసంధానించనున్నారు.ఒకవేళ, ఇది సాధ్యం కాకపోతే, ఆయా వాహనాల వివరాలను పోలీసులకు పంపి జరిమానా వసూలు చేయాలని నిర్ణయించారు. జూలై మొదటి వారంలో స్పీడ్‌గన్స్‌ను బిగించాలని ఓఆర్‌ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పటాన్‌చెరు నుంచి శంషాబాద్ మీదుగా పెద్దఅంబర్‌పేట, అలాగే పటాన్‌చెరు నుంచి శామీర్‌పేట వరకు మొత్తం 120 కి.మీ. మేర ఔటర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. అయితే, పలు జం క్షన్ల నుంచి ఔటర్‌పైకి చేరే వాహనాలు మెరుపువేగం తో ప్రయాణిస్తూ మూలమలుపుల వద్ద ప్రమాదాల కు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పీడ్ గన్స్ ద్వా రా కళ్లెం వేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.10 చోట్ల స్పీడ్ గన్స్..ఔటర్‌లోని 10 రీచ్‌ల్లో స్పీడ్ గన్స్ ఏర్పాటు కానున్నాయి. ఇప్పటివరకు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను ‘యాక్సిటెండ్ ప్రోన్ ఏరియా’గా గుర్తించిన అధికారులు అక్కడి మూల మలుపుల వద్ద స్పీడ్ గన్స్‌ను బిగించాలని నిర్ణయించారు. అనేకచోట్ల ఇప్పటికే సూచిక (సైనేజెస్) బోర్డులు ఉన్నా.. మూల మలుపులు, జంక్షన్లకు సమీపంలో వేగ నియంత్రణను తె లియజేసే విధంగా మరికొన్ని చోట్ల కొత్తగా సూచికలు ఏర్పాటు చేయనున్నారు.రేపటి నుంచి ‘పెట్రోలింగ్’ఔటర్‌పై 24 గంటలూ నిఘా ఉండేలా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కొత్తగా రెండు పెట్రోలింగ్ టీంలను ఏర్పాటు చేశారు. శంషాబాద్-గచ్చిబౌలి, పటాన్‌చెరు-శామీర్‌పేట్ మార్గంలో శుక్రవారం నుంచి ఈ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ఒక్కో టీంలో ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారు. హెచ్‌ఎండీఏ భద్రతా విభాగంలో సిబ్బంది కొరత కారణంగా పోలీసు విభాగం నుంచి వారిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాయనున్నారు. శుక్రవారం నుంచి హెచ్‌ఎండీఏకు చెందిన భద్రతా సిబ్బందిని రంగంలోకి దించి పెట్రోలింగ్ ప్రారంభించాలని నిర్ణయించారు.అతివేగం వల్లే ప్రమాదాలు‘ఔటర్‌పై మూల మలుపుల వద్దే ప్రమాదాలు జరుగుతున్నాయి. మితిమీరిన వేగమే ఇందుకు కారణం. ఇటీవల పెద్దఅంబర్‌పేట వద్ద జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనం. మలుపుల వద్ద క్రాష్ బ్యారియర్స్‌ను మరింత పటిష్టం చేస్తాం. 120 కి.మీ. వేగానికి మించి వెళ్లే వాహనాలను గుర్తించేందుకు స్పీడ్‌గన్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా ఆయా వాహనాలకు ఎగ్జిట్ వద్ద చలాన్ ఇస్తాం. లేదంటే పోలీసులకు పంపి జరిమానా విధిస్తాం. శుక్రవారం నుంచి పెట్రోలింగ్‌ను కూడా ప్రారంభిస్తున్నాం. ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడమే మా ముందున్న లక్ష్యం’

- ఐ. శామ్యూల్ ఆనంద్ కుమార్, ఓఆర్‌ఆర్ పీడీ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top