కన్ను పడితే కన్నమే

కన్ను పడితే కన్నమే - Sakshi

– అంతరాష్ట్ర దొంగ అరెస్టు

– రూ.6.4లక్షల విలువ చేసే సొమ్ము రికవరీ

కర్నూలు: అతని కన్ను పడితే చాలు... ఆ ఇంటికి కన్నం పడాల్సిందే... ఉన్న పల్లెల్లో ఉపాధి లేక పట్టణానికి వలస వెళ్లి అనతి కాలంలోనే డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో నేరాల బాటపట్టి కటకటాల పాలయ్యాడు. తుగ్గలి  మండలం రాంపల్లి గ్రామానికి చెందిన అగ్రహారం రంగస్వామిని అనుమానంపై అదుపులోకి తీసుకొని విచారించగా అతని నేరాల చిట్ట బయటపడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసు విచారణలో బయటపడింది. పత్తికొండ సీఐ విక్రమసింహ ఆధ్వర్యంలో తుగ్గలి ఎస్‌ఐ కేశవ తన సిబ్బందితో రాబడిన సమాచారం మేరకు రాంపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద రంగస్వామి అనుమానస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద నుంచి రూ.6.4 లక్షలు విలువ చేసే 21 తులాల బంగారు, రెండు కిలోల వెండి స్వాధీనం చేసుకొని మంగళవారం మధ్యాహ్నం ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు.

 

ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో డోన్‌ డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌తో కలిసి మంగళవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. స్వగ్రామం రాంపల్లెలో ఉపాధి లేకపోవడంతో నిందితుడు రంగస్వామి హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. భార్యభర్తలు వీధుల్లో చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే వారు. అనతి కాలంలోనే డబ్బు సంపాదించాలన్న ఆశతో నేరాలబాట పట్టాడు. తాళాలు వేసిన ఇళ్లను ఎంపిక చేసుకొని చోరీలకు పాల్పడ్డాడు.

 

నెల క్రితం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అతిథిగృహంలో టీవీ చోరీ చేశాడు. సీసీ కెమెరాల పుటేజి ద్వారా తెలంగాణ పోలీసులు గుర్తించి కటకటాలకు పంపారు. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయి, మరిన్ని చోరీలకు పాల్పడ్డాడు. చోరీ సొత్తు మొత్తం రాంపల్లి గ్రామంలోని తన గుడిసెలో దాచిపెట్టినట్లు విచారణలో అంగీకరించాడు. దొంగను అరెస్టు చేసి భారీ మొత్తంలో సొమ్మును రికవరీ చేసినందుకు పత్తికొండ సీఐ విక్రమసింహా, తుగ్గలి ఎస్‌ఐ కేశవ, కానిస్టేబుళ్లు సురేష్, హోంగార్డు లక్ష్మినాయక్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులను అందజేశారు.

 

పాత నేరస్తులపై నిఘా ఉంచండి: ఎస్పీ ఆకె రవికృష్ణ

జైలు నుంచి బెయిల్‌పై బయటికి వచ్చిన పాత నేరస్తులపై నిఘా ఉంచాలని ఎస్పీ ఆకె రవికృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పోలీసు సర్కిళ్ల వారీగా పాత నేరస్తులు ఎంత మంది ఉన్నారు, వారి దిన చర్య ఏమిటనే దానిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. వేసవి సెలవులు అయినందున పట్టణాల్లో నివాసం ఉంటున్నవారు ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్తుంటారని, ఇళ్లకు తాళాలు వేసి కొంతమంది మిద్దెలపై పడుకుంటుంటారని ఇది దొంగలకు అవకాశంగా మారి చోరీలకు పాల్పడుతున్నారని, ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రికెట్‌ బెట్టింగ్‌లపై పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో ష్పెషల్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి బెట్టింగ్‌ రాయుళ్లపై దాడులు నిర్వహిస్తున్నామని, అయినప్పటికీ అనేక చోట్ల యువకులు బృందాలుగా ఏర్పడి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. డయల్‌ 100కు కానీ, స్థానిక పోలీసులకు కానీ సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.

 రంగస్వామి నేరాల చిట్ట –

– 2016 మార్చిలో మద్దికెర గ్రామానికి చెందిన ఎంకమ్మ ఇంటిలో 3గ్రాముల బంగారం, 20 తులాల వెండి అపహరణ.

–2016 అక్టోబరులో రాంపల్లి గ్రామానికి చెందిన తలారి పెద్ద లాలప్ప ఇంట్లో 19 తులాల వెండి చోరీ.

– హోసూరు గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డి ఇంట్లో 8 గ్రాముల బంగారం, 10 తులాల వెండి అపహరణ.

– 2017 మార్చిలో బొందిమడుగుల గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ ఇంట్లో 8 తులాల బంగారు, 78 తులాల వెండి చోరీ.

– 2017 ఏప్రిల్‌లో రాంపల్లి గ్రామంలో గంగన్నగారి అరుణమ్మ ఇంట్లో 2తులాల బంగారు, 40 తులాల వెండి అపహరణ.

– పుచ్చకాయలమాడ శ్రీరాములు ఇంట్లో 5తులాల బంగారు, 21 తులాల వెండి చోరీ.

– బుచ్చి సుంకులమ్మ – రామాంజనేయులు ఇంట్లో 2.8 తులాల బంగారు.

– మల్యాల పార్వతి ఇంట్లో 4 తులాల బంగారు, 20 తులాల వెండి చోరీ.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top