కుయ్యో.. మొర్రో..

కుయ్యో.. మొర్రో.. - Sakshi

108 అంబులెన్సులకు నిర్వహణా లోపాలు

 డీజిల్‌ కూడా సరఫరా కాని వైనం

 బాధితులకు సకాలంలో అందని వైద్యం

 

రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని నిమిషాల్లో ఆస్పత్రులకు చేర్చి వారి ప్రాణాలు కాపాడే 108 వాహనాలు మూలనపడుతున్నాయి. కాలం చెల్లిన వాహనాలు.. డీజిల్‌ కూడా పోయించని పరిస్థితి... సిబ్బందికి జీతాలు సైతం అందని దుస్థితి... కిలోమీటరు నడిస్తే చాలు ఆగిపోతున్న వైనం. ఫోన్‌ చేసిన పది నుంచి 20 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రులకు తరలించాల్సిన 108 వాహనానికి నేడు ఎన్నిసార్లు కాల్‌ చేసినా స్పందించని దుస్థితి పట్టింది.

 

సాక్షి, గుంటూరు: దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానస పుత్రికగా చెప్పుకునే 108 వాహనాలను దేశంలో ఎక్కడా లేని విధంగా 2005లో మొట్టమొదటిసారిగా ఆంధ్రాలో  ఏర్పాటుచేసి ఎందరి ప్రాణాలనో నిలబెట్టారు. మొదట్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా  36 వాహనాలను ఏర్పాటుచేసి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు  జాగ్రత్త పడ్డారు.  ఆయన హయాంలో 108 వాహన సేవలు ఎంతో మెరుగ్గా ఉండేవి. ఫోన్‌ చేస్తే చాలు కుయ్‌... కుయ్‌మంటూ ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నిమిషాల్లో ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలకు రక్షణగా నిలిచేవి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మహానేత వైఎస్‌ హయాంలో 108 వాహనం అద్భుతంగా పనిచేసిందని.. స్వయంగా తాను పరీక్షించానంటూ అసెంబ్లీ సాక్షిగా కొనియాడారంటే  పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధమవుతోంది. అయితే ప్రభుత్వాలు మారేకొద్దీ 108 వాహనాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 108 వాహనాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అత్యవసర స్థితిలో ఉన్న రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణీలను  వైద్యశాలలకు చేర్చే 108 వాహనాలు తుప్పుపట్టి  శిథిలావస్థకు చేరాయి.

 

మరమ్మతులకు గురై మూలన..

గుంటూరు జిల్లాకు కేటాయించిన 36 వాహనాలు 2005లో కేటాయించినవి కావడం, పదేళ్లు దాటుతుండటంతో కాలం చెల్లి తరచూ రిపేర్లు రావడం, బాడీ మొత్తం తుప్పుపట్టి పెచ్చులూడిపోతున్నాయి. దీనికితోడు 108 సిబ్బందికి వాహనాన్ని పెట్టేందుకు గాను, తాము ఉండేందుకు గాను షెల్టర్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  గత నెల 30వ తేదీకి 108 వాహనాల నిర్వహణ బాధ్యత వహిస్తున్న జీఎంఆర్‌ కంపెనీ కాలపరిమితి పూర్తికాగా, టెండర్లలో బీవీజీ కంపెనీ దక్కించుకుంది. అయితే టెండర్లు అప్పగించేవరకు నిర్వహణ బాధ్యతను చూడాలంటూ ప్రభుత్వం జీవీఆర్‌ కంపెనీకి తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. దీంతో ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వక, కనీసం వాహనాలకు డీజిల్‌ సైతం పోయించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు.   దీంతో ప్రమాదం జరిగిందని ఫోన్‌ వచ్చినా డీజిల్‌ లేక వాహనం కదలని దుస్థితి దాపురించింది. నిధుల లేమి, కాలం చెల్లిన వాహనాలతో 108 సిబ్బంది ఆలస్యంగా స్పందించడం, అసలు సంఘటనా ప్రాంతాలకే వెళ్లకపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 108 వాహనాల నిర్వహణ బాధ్యతను ఏదో ఒక  కంపెనీకి అప్పగించి కాలం చెల్లిన  వాహనాల స్థానంలో కొత్తవాహనాలు ఏర్పాటు చేయాలని, సిబ్బందికి జీతాలు సకాలంలో చెల్లించి నిధులు మంజూరులో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. 108 వాహనాలు సక్రమంగా నడిచేలా చర్యలు తీసుకుని గర్భిణీలు, రోడ్డుప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. 

 

వాహనాలు బ్రేక్‌డౌన్‌ అవుతున్నాయి..

పదేళ్ల కిందట కేటాయించిన వాహనాలు కావడంతో మరమ్మతులకు గురై బ్రేక్‌డౌన్‌ అవుతున్నాయి. 20 రోజులకు సరిపడా డీజిల్‌æమాత్రమే ఇస్తుండడంతో కొన్నిచోట్ల  సంఘటన స్థలాలకు వెళ్లలేకపోతున్నాం. సిబ్బందికి, వాహనాలకు షెల్టర్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సెప్టెంబరు నెలకు సంబంధించి 50 శాతం జీతాలు చెల్లించాం. మిగతావి త్వరలో చెల్లిస్తాం. 

– రాజేంద్ర, 108 జిల్లా మేనేజర్‌
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top