కాలం మారింది..

కాలం మారింది..

వేసవిని తలపిస్తున్న ఎండలు

 జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితి

 వారం రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు

 జ్వరాల భారిన జనం

 కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

తణుకు: 

జోరుగా వానలు కురవాల్సిన కాలమిది. దీనికి భిన్నంగా వేసవిని తలపించే విధంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 7 గంటలకే ఇంటిలో ఉక్కబోత.. రోడ్డెక్కితే ఎండ వేడిమి.. వాహనంపై వెళితే వడగాలుల తాకిడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకొచ్చేందుకు సాహసించలేకపోతున్నారు. 

పెరిగిన ఉష్ణోగ్రతలు

గత వారం రోజులుగా జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, కొవ్వూరు, నరసాపురం, భీమవరం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు నమోదు అవుతుంటుంది. అయితే ప్రస్తుతం వారం రోజులుగా 30 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెలలో విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉంది. కానీ ఆశించన స్థాయిలో వర్షాలు పడడంలేదు. రోజురోజుకూ తీవ్రమవుతున్న వేడి గాలులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అక్కడక్కడా ఒక మోస్తరు వర్షం పడినా ఆ మేరకు ఎండ తీవ్రత ఉంటుంది. 

 

ప్రబలుతున్న విషజ్వరాలు

వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాల్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం వీస్తున్న వడగాలుల్లో తేమశాతం లేకపోవడంతో ఉక్కబోత ప్రభావం అధికంగా ఉంటోంది. వాతావరణ మార్పులకు విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వాసుపత్రులతోపాటు జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. టైఫాయిడ్, మలేరియా, లోఫీవర్, కీళ్లనొప్పులు వంటి రోగాల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఎండల «దాటికి ఉపశమనం పొందడానికి ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు.

నిర్మానుష్యంగా రోడ్లు

జిల్లాలో మెట్ట ప్రాంతంలో గురువారం భారీవర్షం కురవగా డెల్టా ప్రాంతంలో మాత్రం 32 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి సమయాల్లో వాతావరణం చల్లబడటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నా తెల్లారే సమయానికి ఎండ తీవ్రత ఎక్కువవుతోంది. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో చెప్పుకోదగిన వర్షం ఒకట్రెండు సార్లు మాత్రమే కురిసింది. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. శుక్ర, శనివారాల్లో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో 32 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం సమయంలో ఎండలు మే నెలను తలపింపజేస్తున్నాయి. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. 

 

జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు సాధారణం కంటే భిన్నంగా ఉన్నాయి. వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలు ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులకు మంచిది కాదు. సాధ్యమైనంత వరకు వీరికి ఎండ తగలకుండా జాగ్రత్త పడాలి. వాతావరణంలో సమతుల్యత లేని కారణంగా విషజ్వరాలు ముఖ్యంగా టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మేలు.

 డాక్టర్‌ పి.కరుణ, వైద్యురాలు, తణుకు 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top