అరకొరగానే అమ్మహస్తం


సాక్షి, రాజమండ్రి :

 అమ్మహస్తం సరుకుల పంపిణీ జిల్లాలో నేటికీ ప్రహసనంగానే సాగుతోంది. పథకం ప్రవేశ పెట్టి రెండు నెలలు పూర్తయినా పంపిణీ సకాలంలో సాగడంలేదు. ప్రభుత్వ ఆదేశం ప్రకారం అన్ని సరుకులూ ఒకేసారి పంపిణీ చేయాలి. అయితే జూలై మొదటివారం పూర్తయినా అన్ని సరుకులూ డిపోలకు చేరలేదు. దీంతో రేషన్‌షాపుల నిర్వాహకులు ఏ సరుకు వస్తే దాన్నే కార్డుదారులకు ఇచ్చేస్తున్నారు. దీనివల్ల పథకంలోని తొమ్మిది సరుకులు తీసుకోవాలంటే నాలుగైదుసార్లు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వినియోగదారులు నిట్టూరుస్తుండగా 18వ తేదీలోగా సరుకుల పంపిణీ కష్టసాధ్యమవుతోందని రేషన్‌షాపుల నిర్వాహకులు అంటున్నారు.

 గోదాముల్లో ఉన్నా డిపోలకు రాని సరుకులు

 జిల్లాలో జూలై నెలకు కావల్సిన కోటా ప్రకారం ఉప్పు, పామాయిల్, కారం, కందిపప్పు, గోధుమ పిండి, గోధుమలు, చింతపండు, పసుపు, పంచదార మొత్తం తొమ్మిది సరుకులు కలిపి 74,99,083 ప్యాకెట్లు అవసరం ఉండగా ఇప్పటికే పౌరసరఫరాల శాఖ గోదాముల్లో 70,02,692 ప్యాకెట్లు ఉన్నాయి. మిగిలిన సరుకు గోదాములకు చేరాల్సి ఉంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా సరుకు గోదాముల నుంచి రేషన్‌డిపోలకు చేరడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. పౌరసరఫరాల శాఖ ముందు నెలలోనే సరుకులను తమ గోదాముల్లో చేరుస్తుంది. వాస్తవంగా డీలరు ఒకటో తేదీ నుంచే సరుకు పంపిణీ ప్రారంభించాల్సి ఉంటుంది. కనీసం ఒకటి నుంచి ఐదో తేదీలోగా సరుకులు రేషన్ డీలర్ల వద్దకు చేరుకుంటే 18వ తేదీ వరకూ కార్డుదారులకు పంపిణీ చేస్తారు. కానీ జిల్లాలోని మెజారిటీ గ్రామీణ డిపోలకు సోమవారం నుంచే సరుకు రవాణా

 

 ప్రారంభించారు. జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, ప్రధాన ప్రాంతాల్లో మాత్రం ఐదో తేదీ నుంచి సరుకు రవాణా ప్రారంభించినా పూర్తిస్థాయిలో అన్ని సరుకులూ అందలేదు.

 డీడీలు కట్టినా పూర్తిగా అందని సరుకులు

 ముందుగా రేషన్ డీలర్ సరుకుకు డీడీ కడితేనే వస్తువులు పంపిణీ చేస్తారు. సోమవారం ఉదయం వరకూ డీలర్ల నుంచి సుమారు 30 లక్షల ప్యాకెట్లకు మాత్రమే డీడీలు అందాయి. పోనీ డీడీలు కట్టిన డిపోలకైనా సరుకులు పూర్తిస్థాయిలో సరఫరా అయ్యాయా అంటే అదీలేదు. అధికారులు అందించిన వివరాల ప్రకారం 75 శాతం సాల్టు,  కందిపప్పు, 85 శాతం పామాయిల్, పంచదార ప్యాకెట్లు, మిగిలిన సరుకులు 50 నుంచి 70 శాతం లోపు ఆ డిపోలకు చేరాయి. సగటున అన్ని సరుకులు 76 శాతం చౌక దుకాణాలకు చేరాయని చెపుతున్నారు. అంటే జిల్లా మొత్తమ్మీద కార్డుదారులకు పంపిణీ చేయాల్సిన సరుకుల్లో 40 శాతానికి మాత్రమే ఇప్పటికి డీలర్లు డీడీలు తీశారు. ఇక డిపోలకు చేరిన సరుకు చూస్తే మొత్తం కార్డుదారులకు అందాల్సిన  కేవలం 30 శాతం మాత్రమే.

 

  అవి కూడా అన్ని సరుకులూ సమానంగా చేరలేదు. జిల్లా అంతటా తొమ్మిది సరుకులూ పూర్తిస్థాయిలో చేరేందుకు ఇంకా వారం రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం సరుకులు విడివిడిగా పంపిణీ చేస్తున్నారు. కొన్ని డిపోల్లో అన్ని సరుకులూ వచ్చాక ఇద్దామని ఆగుతుంటే, చాలా డిపోల్లో వచ్చిన సరుకు వచ్చినట్టే కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. దీంతో కార్డుదారులు నాలుగైదుసార్లు డిపోల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దాంతో అన్ని సరుకులూ ఒకేసారి ఇవ్వాలన్న పథకం లక్ష్యం నీరుగారినట్టవుతోంది. దీనిపై పలువురు డీలర్లను ప్రశ్నించగా ‘మేము సరుకు కోసం వడ్డీలకు అప్పులు తెచ్చి అడ్వాన్సు చెల్లిస్తున్నాం. వచ్చిన సరుకు అమ్ముకుని రావాల్సిన వాటిపై పెట్టుబడి పెట్టాలికదా!’ అన్నారు.

 గతం కన్నా నయమేనట..

 అమ్మహస్తం సరుకుల పంపిణీలో జాప్యం వాస్తవమే అయినా గతంతో పోలిస్తే పరిస్థితి చక్కబడిందని రాజమండ్రి డివిజన్ పౌరసరఫరాల శాఖ అధికారి సత్యనారాయణరాజు అన్నారు. రెండు మూడు రోజుల్లో సరఫరా పూర్తవుతుందన్నారు. లభ్యతలో ఇబ్బందుల వల్లే అన్ని సరుకులూ ఒకేసారి డిపోలకు చేరవేయలేక పోతున్నట్టు చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top