'డబ్బుల్’ దండుకునే స్కీం..

'డబ్బుల్’ దండుకునే స్కీం.. - Sakshi


పైసలిచ్చే వారికే అవకాశం

కార్డు, ఇళ్లు ఉన్నవారికే మంజూరీ ప్రతిపాదనలు

గుడిసె ఉన్నవారు అనర్హులట...!


పుల్‌కల్ : నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ ప్రధానోద్దేశం.  అయితే స్థానిక నాయకులకు మాత్రం ఇది డబ్బులు దండుకునే స్కీంగా మారింది.  20 ఎకరాల భూమి, రెండు ట్రాక్టర్లు, ఒక విలువైన కారు ఉన్న లబ్ధిదారునికి డబుల్‌బెడ్రూం కింద ఎంపిక చేశారు.  కానీ గుంట భూమి లేని వారు.. ఇల్లు, భూమిలేని దళితులను ఎంపిక చేయలేదు.  ఈ విషయంలో నాయకులు, అధికారులు లబ్ధిదారుల  ఏ మాత్రం పారదర్శకంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మండల పరిధిలోని సింగూర్ గ్రామాన్ని డబుల్ బెడ్రూం స్కీం కింద ఎంపిక చేశారు. 


అందుకు 250 ఇళ్ల వరకు ప్రభుత్వమే నిర్మించి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.  గత అక్టోబర్‌లో జేసీ వెంకట్రాంరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అనంతరం కలెక్టర్ సైతం గ్రామాన్ని సందర్శించి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని పరిశీలించి స్థానిక తహసీల్దార్ శివరాంను లబ్ధిదారుల వివరాలు అందజేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని, అనర్హులుంటే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.


  కానీ స్థానిక తహసీల్దార్ గ్రామానికి చెందిన నాయకులతో పాటు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా చెప్పుకుంటున్న ఓ నాయకుడి సూచనల మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారుల జాబితాను తయారుచేసి కలెక్టర్‌కు అందజేశారు.  అందులో కేవలం నాయకులు సూచించిన వారి పేర్లు మాత్రమే ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.


 కావాల్సిన వారి పేర్లే ఎంపిక..

గ్రామంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు.  వారిని ఎంపిక చేయకుండా కేవలం డబ్బులు ఇచ్చిన వారితో పాటు వారికి అనుకూలమైన వ్యక్తులను మాత్రమే ఎంపిక చేశారనేందుకు గ్రామానికి చెందిన గౌండ్ల అంజమ్మ భర్త విఠల్ గౌడే నిదర్శనం. విఠల్‌గౌడ్ పేరున డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరైంది.  ఆయన భార్య అంజమ్మ పేరున రెండు ట్రాక్టర్లతో పాటు ఒక స్విఫ్ట్ కారు, 20 ఎకరాల భూమి ఉంది.   మల్ప మంజుల భర్త విఠల్ రెడ్డికి ఎనిమిదెకరాల భూమి ఉంది.  ఇంతకంటే తక్కువగా భూమి ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రం ఎంపికచేయలేదు. 


ఎర్ర మరియమ్మ, ఎర్ర ఇందిర, ఎర్ర లక్ష్మి, ఎర్ర అనిత, ఎర్ర దీవెన ఒకే కటుంబానికి చెందిన వారు.   వీరందరికీ డబుల్‌బెడ్రూం  కింద ఇళ్లు మంజూరు చేసేందుకు అధికారులు ఎంపిక చేశారు.   ఇళ్లు లేని వారు ఎంతో మంది ఉన్నా కేవలం పైరవీకారులు, అధికార పార్టీ నేతల సూచనల మేరకే లబ్ధిదారుల ఎంపిక జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.  మరోవైపు స్థానిక నాయకులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి లబ్ధిదారులను ఎంపికచేసినట్లు ఎంపీపీ రూపారెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.  ఈ విషయం పై తహసీల్దార్ శివరాంను వివరణ కోరగా  గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top