‘ఉమ్మడి’గానే కొత్వాల్!


 అందరి చర్చల్లో ‘పోలీస్’..

      పోలీస్ కమిషనర్‌గా ఎవరుంటారు?

      ఉమ్మడి రాజధానిలో మారనున్న ఎంపిక విధానం

      రెండో స్థానంలో మరో ప్రాంత అధికారి!

      వివాదం రేగితే పరిష్కారానికి ప్రత్యేక కమిటీ

      కార్యాలయాల అంతర్గత భద్రత బాధ్యత ఎవరికి వారిదే

 సాక్షి, సిటీబ్యూరో:

 శాంతిభద్రతలు.. ‘ఉమ్మడి రాజధాని హైదరాబాద్’లో కీలకం కానున్న నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో నగర పోలీసు విభాగం తీరుతెన్నులెలా ఉండనున్నాయి? నగర పోలీస్ కమిషనర్‌గా ఎవరు ఉంటారు? ఎవరు నియమిస్తారనే దానిపై భిన్న ప్రచారాలు సాగుతున్నాయి. నగర పోలీసు కమిషనర్ (కొత్వాల్)ను ఇరు ప్రభుత్వాల అంగీకారంతోనే నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. ఆయన ఎవరి ఆధీనంలో పనిచేయాలనే విషయంలో మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వం నియమించే ప్రత్యేక అధికారి లేదా పూర్తిగా గవర్నర్ అధీనంలోనో ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని సైతం స్వస్థలాలకు పంపే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ కార్యాలయాల అంతర్గత భద్రత ఆయా ప్రభుత్వాలకే ఉంటుందని అంటున్నారు.

 

 అందరి అంగీకారంతోనే..

 

 హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల రీత్యా పోలీసు కమిషనర్ పోస్టు కీలకమైంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వమే ఐచ్ఛికంగా ఈ పోస్టులో అధికారులను నియమిస్తూ వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత హైదరాబాద్ భౌగోళికంగా తెలంగాణలో భాగమవుతుంది. దాంతో నిబంధనల ప్రకారం అక్కడి డీజీపీ, హోం మంత్రి, ముఖ్యమంత్రి తదితరుల నిర్ణయం మేరకే పోలీస్ కమిషనర్ నియామకం జరగాలి. కానీ, ఉమ్మడి రాజధానిగా ఉండనుండడంతో పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు, కార్యకలాపాలు, పరిపాలన అంతా హైదరాబాద్ కేంద్రంగానే కొనసాగనున్నాయి. దాంతో నగర పోలీసు కమిషనర్ ఎంపికలో ఆ ప్రభుత్వ సూచనలనూ ఇక్కడి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ మేరకు ఇరు ప్రభుత్వాలు సమ్మతించిన వారినే కొత్వాల్‌గా నియమిస్తారు. ఒకవేళ అంగీకారం కుదరకపోతే.. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారు. రెండు ప్రభుత్వాలు సూచించిన వ్యక్తుల అనుభవం, పూర్వ చరిత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం కాక ముందు హర్యానా, పంజాబ్‌లకు ఉమ్మడి రాజధానిగా ఉండగా.. పోలీసు కమిషనర్ ని యామకంలో ఇలాంటి విధానాన్నే అవలంబించారు.

 

‘సెకండ్ పోస్ట్’ ఆంధ్రప్రదేశ్ వ్యక్తికే!

సీనియారిటీ, అనుభవం తదితర అంశాల ఆధారంగా పోలీసు కమిషనర్‌గా తెలంగాణకు చెందిన వ్యక్తి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐపీఎస్ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలో 30 శాతానికి మిం చి స్థానిక అధికారులు ఉండటానికి వీలులేదు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో స్థానికులతో పాటు ఆం ధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల వారూ పని చేయాల్సి ఉం టుంది. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరిని కమిషనర్ తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు)గా నియమించవచ్చని అధికారులు చెబుతున్నారు. అనివార్య కారణాలతో పోలీసు కమిషనర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెం ది న అధికారి నియమితులైతే అదనపు పోలీసు కమిషనర్‌గా తెలంగాణ ప్రాంత వ్యక్తిని నియమిస్తారు. మరోవైపు నగర కమిషనరేట్‌లో పని చేస్తున్న స్థానికేతరులను గుర్తించి.. వారిని సొంత రేంజ్‌లకు పంపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐచ్ఛికంగా వెళ్లని వారిని రోస్టర్ పద్ధతిలో పంపాల్సిన అవసరం వస్తుందని అధికారులు చెబుతున్నారు.

 

 అంతర్గత భద్రత బాధ్యత వారిదే..

ఉమ్మడి రాజధాని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సచివాలయం, సీఎం, మంత్రుల, అధికారుల నివాసా లు సైతం హైదరాబాద్‌లోనే కొనసాగనున్నాయి. వీటి అంతర్గత భద్రత మాత్రం ఏపీ అధికారులే చూసుకోవాలి. ఆ విధుల్లో ఉండే సిబ్బంది రొటేషన్ పద్ధతిన అక్కడి నుంచి వచ్చి వెళ్తుంటారు. కేవలం బయటి అంశాలతో పాటు నిర్దిష్టమైన ఫిర్యాదు వచ్చినప్పుడే ఆ కార్యాలయం ఏ ఠాణా పరిధిలో ఉంటే వారు కలుగజేసుకుంటారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఇదే విధానం కొనసాగుతోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top