అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య


కర్నూలు: వ్యాపారం కోసం చేసిన అప్పులు చెల్లించలేక లక్ష్మినగర్‌లో నివాసం ఉంటున్న వెంకటరమణ(35) ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఫుట్‌పాత్‌పై పాన్‌ బంకు నిర్వహిస్తున్నాడు. వ్యాపారం, కుటుంబ అవసరాలకు కర్నూలులో తెలిసిన వారి వద్ద సుమారు రూ.20 లక్షలు అప్పు చేశాడు. తిరిగి చెల్లించలేక కొన్నాళ్లుగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పుదారుడు శ్రీనివాసరెడ్డి, అక్బర్, రామకృష్ణ, వెంకటేశ్వరమ్మ తదితరులు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి పెంచారు. పాన్‌దుకాణాన్ని రామకృష్ణ తన పేరిట రాయించుకున్నాడు. దీంతో వెంకటరమణ కలత చెంది శుక్రవారం మధ్యాహ్నం భార్య రాజేశ్వరిని దుకాణం వద్ద కూర్చోబెట్టి పిల్లలను స్కూలు వద్ద వదిలివస్తానంటూ ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. భర్త దుకాణం వద్దకు ఎంత సేపటికి రాకపోవడంతో రాజేశ్వరి ఇంటికి వెళ్లింది. అప్పటికే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. చుట్టుపక్క నివాసితులతో కలిసి తలుపులు తెరిచి కిందకు దించగా అతను అప్పటికే మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు అప్పు ఇచ్చిన రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి, అక్బర్, వెంకటేశ్వరమ్మ తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావు తెలిపారు. మృతునికి ఒక కూతురు, ఒక కొడుకు సంతానం.

 
Back to Top