బతకలేను భయ్యా

brother suicide attempt  - Sakshi

సోదరుడి మృతి తట్టుకోలేక అన్న ఆత్మహత్యాయత్నం

పరిస్థితి విషమం

అమ్మగోరు ముద్దలు, నాన్న ప్రేమ ముద్దులూ ఇద్దరికీ సమానమే. అన్నమీద తమ్ముడు అలిగినా, తమ్ముడి చిలిపితనాన్ని అన్న ఆలకించినా అది అణువణువూ పెనవేసుకున్న రక్త సంబంధమే. అవును ఆటపాటల్లో, అల్లరిచేష్టల్లో ఆ అన్నదమ్ములు స్నేహితుల్లా కలిసిమెలిసి పెరిగారు. మంగళవారం విధి ఆడిన వింత నాటకంలో తమ్ముడు తనువు చాలించాడు. భరించలేని దుఃఖంతో 24 గంటలు తిరగకముందే  అన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృత్యువుతో పోరాడుతున్నాడు. ఒకబిడ్డ అనంతలోకాల్లో కలిసిపోగా, మరో బిడ్డ ఆసుపత్రిలో అచేతనంగా పడి ఉండటాన్ని చూసిన ఆ తల్లిదండ్రులకు కన్నీటి ధార ఆగడం లేదు. వారి గుండె వేదనను చల్లార్చడం ఎవరితరమూ కావడం లేదు.   

నరసరావుపేట టౌన్‌: రక్తం పంచుకున్న సోదరుడే లేనప్పుడు నాకెందుకు ఈ జీవితం అనుకున్నాడో ఏమో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తమ్ముడ్ని చూసి అన్న కూడా తనువు చాలించాలనుకున్నాడు. పురుగుమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడి మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ విషాద ఘటన నరసరావుపేటలో ప్రతి హృదయాన్నీ కదిలించి వేసింది. గుంటూరు రోడ్డు నాయబ్‌బజార్‌కు చెందిన సయ్యద్‌ మహబూబ్‌ బాషా(22) మల్లమ్మ సెంటర్‌ ఓవర్‌బ్రిడ్జిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. మహబూబ్‌బాషా ప్రకాష్‌నగర్‌లోని జిమ్‌లో పని చేస్తుంటాడు. ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.

మృతదేహాన్ని బుధవారం పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం స్వగృహానికి తరలించారు. సోదరుడి మృతదేహాన్ని చూసి చలించిన అన్న సయ్యద్‌నవాజ్‌ దిక్కులు పిక్కటిల్లేలా రోదించాడు. సోదరుడిపై ఉన్న అమితమైన ప్రేమతో మనస్థాపం చెంది ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకొని పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుని సమీపంలోని ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు నవాజ్‌ పరిస్థితి విషమంగా ఉందని, మరో 24 గంటలు గడిస్తేగానీ చెప్పలేమని తెలిపారు.

నాయక్‌బజార్‌లో విషాదఛాయలు...
అందరితో కలివిడిగా ఉండే మహబూబ్‌బాషా మృతితో నాయబ్‌ బజార్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఓ కుమారుడు దుర్మరణం చెందగా, మరో కుమారుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడటంతో తల్లిదండ్రులు సయ్యద్‌ కరిముల్లా, షాహెదాలు తల్లడిల్లిపోతున్నారు. మృతి వార్త తెలుసుకున్న బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంత్యక్రియల్లో పాల్గొని మృతుడి తండ్రి కరిముల్లాను ఓదార్చారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top