ముడుపులపై పత్రం విడుదల చేయాలి..!

ముడుపులపై పత్రం విడుదల చేయాలి..! - Sakshi


సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాక్సైట్ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయడం సరేనని, ఇందులో ఆయన తీసుకున్న ముడుపులపై కూడా ఒక పత్రం విడుదల చేస్తే బాగుంటుందని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బాక్సైట్ తవ్వకాలపై జీవో జారీ విషయం తనకు తెలియదని చంద్రబాబు చెబుతున్నవి పచ్చి అబద్ధాలని, ఒక సీఎంగా ఉండి ఇంత బరితెగించి అబద్ధాలు చెప్పడానికి మనసెలా వచ్చిందని ప్రశ్నించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. బాక్సైట్ విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాన్నే కొనసాగించామని శ్వేతపత్రంలో చెప్పడం పూర్తిగా అర్థం లేనిదని, గతంలో తీసుకున్న ఎన్నో అంశాలను ఇపుడు రద్దు చేశారు కదా! అన్నారు. ‘గతంలో జరిగిన నిర్ణయాలపై కమిటీలు వేసి సంప్రదింపులు జరిపి డబ్బులు వసూలు చేసుకున్న తరువాత వాటిని ఖరారు చేయలేదా? బాక్సైట్‌లో ఎంత ముడుపులు తీసుకున్నారు? వాటిపై కూడా పత్రం విడుదల చేయాలి’ అని బొత్స డిమాండ్ చేశారు.  



 టీడీపీకి చిత్తశుద్ధి లేదు..

 గురువారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న అంశంపై గానీ, ‘విభజన’ హామీల అమల్లో గానీ, రైతులకు గిట్టుబాటు ధర, ధాన్యం సేకరణ వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే చిత్తశుద్ధే టీడీపీకి లేదని విమర్శించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ అంశాలేవీ చర్చకు రాకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా సాధనతోపాటూ, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై పార్లమెంటులో గళమెత్తుతామని తమ అధినేత జగన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలు నిర్ణయం తీసుకున్నారని.. కనీసం తమతో టీడీపీ ఎంపీలు కలిసి రావాలని డిమాండ్ చేశారు.బాబుకు రాజకీయ స్వార్థం, స్వప్రయోజనాలున్నాయి కనుకనే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలపై కేంద్రాన్ని గట్టిగా అడగట్లేదని బొత్స అన్నారు. రాష్ట్రంలో తాను పాల్పడుతున్న అవినీతి అక్రమాలపై దర్యాప్తు జరపకూడదనే బాబు మిన్నకుండి పోతున్నారన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top