పౌల్ట్రీ బతికేనా?

పౌల్ట్రీ బతికేనా? - Sakshi

  • వ్యవసాయ హోదా దక్కేనా?

  • నిలకడలేని రంగం తరచూ హెచ్చుతగ్గులు

  • తెలుగు రాష్ట్రాల్లో 50శాతం ఉత్పత్తులు ఇక్కడి నుంచే

  • ఏటా మార్కెట్‌లో మాయజాలం

  • జిల్లాలో పరిస్థితి దయనీయం

  • నష్టాల తీవ్రతతో రైతన్న విలవిల



  • పౌల్ట్రీ రంగానికి మెతుకుసీమ హబ్‌గా మారింది. బ్రాయిలర్‌ కోళ్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉండగా అందులో 50శాతం ఉత్పత్తులు ఈ జిల్లా నుంచే వస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యత గత జిల్లాలో పౌల్ట్రీ రంగం డీలా పడింది. ఇంటిగ్రేటెడ్‌ సంస్థల భాగస్వామ్యంతో కోళ్లను ఉత్పత్తి చేస్తున్న రైతులకు కూడా పెద్దగా కలిసిరావడం లేదు.


    సొంతంగా పరిశ్రమను నిర్వహించే వారి పరిస్థితీ మరింత దయనీయంగా మారింది. ఏళ్ల తరబడి మార్కెట్‌ మాయజాలంలో ధర కలిసిరాక లక్షల్లో నష్టాలు చవిచూసిన రైతులు అప్పుల బాధ తాళలేక గ్రామాలను వదిలి వెళ్తున్నారు. గతేడాది ప్రకటించిన విధంగా పౌల్ట్రీ రంగానికి ‘వ్యవసాయ హోదా’ కల్పిస్తే తప్ప... ఈ దుస్థితి నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు.

    - గజ్వేల్‌



    జిల్లాలో వ్యవసాయ రంగం తర్వాత రెండో అతిపెద్ద పరిశ్రమగా పౌల్ట్రీ వెలుగొందుతోంది. దశాబ్దాలుగా ఈ పరిశ్రమతో రైతులకు అవినాభావ సంబంధం ఉంది. కాలం కలిసొస్తే స్వల్ప వ్యవధిలో రైతులను స్థితిమంతులుగా తీర్చిదిద్దడమో లేదా నష్టాల పాలు చేయడమో ఈ పరిశ్రమ ప్రత్యేకత. ప్రస్తుతం రెండోరకమైన పరిస్థితి జిల్లాలో నెలకొంది.


    కొంతకాలంగా చికెన్‌ ధర నిలకడగా ఉండకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. పౌల్ట్రీ రంగానికి కేంద్ర బిందువుగా ఉంటూ తెలుగు రాష్ట్రాల ఉత్పత్తుల్లో 50శాతం మేరకు వాటాను అందిస్తున్న ఈ జిల్లాలో ఈ పరిశ్రమను నమ్ముకున్న రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు.



    జిల్లాలో వేలాది మంది రైతులు సుగుణ, వెంకటేశ్వర, డైమండ్, జానకీ, ఎస్‌ఆర్, స్నేహా తదితర ఇంటిగ్రేటెడ్‌ సంస్థల భాగస్వామ్యంతో పౌల్ట్రీ పరిశ్రమ నడుపుతున్నారు. ఈ సంస్థలతో పరిశ్రమను నడుపుకోవాలనుకుంటే రైతులు షెడ్, లేబర్, కరెంట్, నీరువంటి మౌలిక వసతులను కల్పించాల్సి ఉంటుంది. ఆ సంస్థల నుంచి చిక్స్‌ అందించి వాటికి 45రోజుల వ్యవధి కోసం మందులు, దాణా అందుతుంది. ఒక్కో బర్డ్‌ సగటున రెండు కిలోలకుపైగా తూకం వస్తుంది.


    ఈ స్థాయికి వచ్చేవరకు సంస్థలు ఒక్కో కిలో కోడిపై రూ.60వరకు ఉత్పత్తి వ్యయం కింద ఖర్చుచేస్తున్నాయి. మార్కెట్‌లో చికెన్‌ ధరతో సంబంధం లేకుండా రైతులకు ఒక్కో కోడిపై కిలోకు రూ.2.5 పైసలు నుంచి రూ.4వరకు చెల్లిస్తున్నాయి. నిర్వహణ బాగుంటే మరో 25పైసలు అదనంగా చెల్లిస్తాయి. ఇదిలాఉంటే ఇంటిగ్రేటెడ్‌ సంస్థల ఒప్పందం ప్రకారం ఉత్పాదక వ్యయం రూ.60 దాటితే రూపాయికి 30పైసల చొప్పున రైతులు భరించాల్సి ఉంటుంది.


    5శాతం కోళ్లకంటే ఎక్కువగా మృత్యువాతపడితే నష్టాలను రైతులే భరించాలి. విద్యుత్‌ చార్జీల రూపేణా 5వేల కోడిపిల్లల సామర్థ్యం కలిగిన షెడ్డుకు 45రోజులకు రూ.5వేలపైనే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ మినహాయిస్తే ఈ సంస్థల భాగస్వామ్యంతో కోళ్లను పెంచుతున్న రైతులకు మిగులుతున్నది అంతంతమాత్రమే.

    గతేడాది పూర్తిగా నష్టాలే....

    గతేడాది పౌల్ట్రీ పరిశ్రమను ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టాయి. ఒక్కో కోడి ఉత్పత్తి చేయడానికి అన్ని కలుపుకొని రూ.120 వరకు ఖర్చవుతున్నది. సుమారు రెండు కిలోలకుపైగా బరువుండే బర్డ్స్‌ చికెన్‌ ధర రూ.70కిపైగా పలికితే నష్టాలు ఉండేవి కావు. కానీ గతేడాది ఎప్పుడో కొద్దిరోజులు మినహా సరాసరిన చికెన్‌ ధర రూ.38 నుంచి 40వరకే పలికింది. ఈ పరిస్థితి వల్ల ఇంటిగ్రేటెడ్‌ సంస్థలతో పరిశ్రమలను నిర్వహిస్తున్న రైతులను పక్కనబెడితే సొంతంగా కోళ్లను ఉత్పత్తి చేస్తున్న రైతులు అథోగతి పాలయ్యారు.


    ఏడాది కాలంగా రూ.లక్షల్లో నష్టాలను చవిచూసి అప్పులపాలై పిల్లాపాపలతో కలిసి గ్రామాలను వదిలి వెళ్లారు. ఇక్కడి పొలాలు, ఇల్లు, పౌల్ట్రీ ఫారమ్‌ కోసం వేసిన షెడ్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కిలో ధర రూ.75 నుంచి రూ.82 వరకు పలుకుతుండగా పరిస్థితి కొంత నిలకడగా ఉంది. కానీ ఎప్పుడు... ఏ విధంగా ఉంటుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.



    ‘వ్యవసాయ హోదా’ ఎప్పుడో?

    వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద పరిశ్రమగా ఉన్న పౌల్ట్రీకి సైతం వ్యవసాయ హోదా కల్పిస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి వ్యవసాయ హోదా కల్పిస్తే పౌల్ట్రీ రైతులకు ఉచిత కరెంటుతోపాటు 50శాతం సబ్సిడీపై దాణా అందించాలి. అది అమలుకు నోచుకోలేదు. కానీ విద్యుత్‌ విషయంలో గతంలో ఉన్న యూనిట్‌ రేటు రూ.8ని రూ.4కు తగ్గించి చేతులు దులుపుకున్నారు. పూర్తి స్థాయిలో ఈ హామీ అమలైతేనే తమకు మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు.



    ప్రభుత్వం ఆదుకోవాలి..

    నేను పద్దెనిమిది ఏళ్ల క్రితం పౌల్ట్రీ రంగంలోకి వచ్చా. ప్రస్తుతం 20 వేల షెడ్డు నడుపుతున్నా. ఇంటిగ్రేటెడ్‌ సంస్థలతో ప్రమేయం లేకుండా నడుపుతున్నా. ఎన్నో సార్లు నష్టాలను చూశా. ఇష్టమైన రంగమైనందున నష్టాలను తట్టుకుంటూ వస్తున్నా. ప్రభుత్వం  హామీ ఇచ్చిన విధంగా ఈ రంగానికి వ్యవసాయ హోదా కల్పించాలి. దాని ద్వారానే పౌల్ట్రీ రైతుల బతుకులు బాగుపడుతాయి.

    - స్టీవెన్‌రెడ్డి, పౌల్ట్రీఫారమ్‌ నిర్వాహకుడు, శౌరీపూర్, మం: దౌల్తాబాద్‌



     

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top