'నాపేరు దొంగ రవి.. నన్నెవరూ పట్టుకోలేరు'

'నాపేరు దొంగ రవి.. నన్నెవరూ పట్టుకోలేరు'


షాద్‌నగర్‌ క్రైం(రంగారెడ్డి): చిల్లర దొంగతనాలు చేయడం అతని వృత్తి.. తననెవరూ పట్టుకోలేరంటూ డైరీలో రాసి పోలీసులకే సవాల్‌ విసిరిన ఘనుడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని పట్టుకుని విచారణ నిమిత్తం ఠాణాలో ఉంచారు. అయితే ఇక్కడ కూడా దొంగ రవి తన తెలివిని ప్రదర్శించి బేడీలతో సహా పరారై మరోమారు పోలీసులకు చుక్కలు చూపించాడు. వివరాలు..షాబాద్‌ మండలం చెర్లగూడెం గ్రామానికి చెందిన బాసుపల్లి ప్రవీణ్‌ (22) అలియాస్‌ దొంగ రవి పట్టణంలోని పరిగి రోడ్డులో గల వాషింగ్‌ సెంటర్‌లో పగలంతా పనిచేసేవాడు. రాత్రి వేళల్లో చిల్లర దొంగతనాలకు పాల్పడేవాడు.ఆరు నెలలుగా పరిగి రోడ్డులోని కిరాణా దుకాణాలతో పాటు ఎలక్ర్టికల్‌, సిమెంటు దుకాణాల్లో వరుస చోరీలు జరిగాయి.సిమెంటు దుకాణంలో చోరీకి పాల్పడ్డ రవి రూ. 4 వేలతో పాటు బ్యాంకు చెక్కులను దొంగిలించాడు. అంతటితో ఆగక దుకాణంలో ఉన్న డైరీలో ‘నాపేరు దొంగ రవి.. నన్నెవరూ పట్టుకోలేరంటూ’ రాసి పెట్టి పోలీసులకు సవాల్‌ విసిరాడు. అనంతరం ఆ చెక్కును నగదుగా మార్చుకున్నాడు. దీంతో చెక్కుకు సంబంధించిన ఖాతాదారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నాలుగు రోజుల క్రితం రవిని అదుపులోకి తీసుకున్నారు. రవి మంగళవారం మూత్రం వస్తుందని చెప్పడంతో కానిస్టేబుల్‌ బయటకు తీసుకెళ్లాడు. ఇదే అదనుగా కానిస్టేబుల్‌ను పక్కకు తోసి బేడీలతో సహా అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Back to Top