ప్రాణం తీసిన ప్రభుత్వ నిర్వాకం

నాయుడు(ఫైల్‌)


సబ్బవరంలో యువకుడికి మంగళవారం అర్థరాత్రి కడుపునొప్పి

అత్యవసరంగా రావాలంటూ 108కు సమాచారమిచ్చిన బంధువులు

108 వాహనానికి డీజీల్‌ లేదు... ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పిన నిర్వాహకులు   

ఆటోలో కేజీహెచ్‌కు తరలించినా దక్కని యువకుడి ప్రాణం

ప్రభుత్వం తీరుపై సర్వత్రా వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలు




‘హలో 108 అండీ... మా గ్రామంలో ఓ కుర్రాడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అర్జంటుగా వాహనాన్ని పంపండి. ఆలస్యమైతే పరిస్థితి చేజారిపోయేలా ఉంది’... సబ్బవరం నుంచి బుధవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో ఓ యువకుడి బంధువుల విన్నపం.



‘108 వాహనానికి రెండు రోజుల నుంచి డీజిల్‌ సరఫరా లేదు. ఇప్పుడు బండి రావాలంటే కష్టమే. ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిది. తప్పదు అనుకుంటే మరో 2 – 3 మూడు గంటల్లో వేరే బండి పంపిస్తాం’ ఇదీ 108 సిబ్బంది నుంచి సమాదానం.



కానీ అప్పటికే జరగాల్సిన ఆలస్యం, నష్టం జరిగిపోయాయి. 108 వాహనం వస్తుందని ఆశించినా రాకపోవడంతో ఆ యువకుడిని ఆటోలో కేజీహెచ్‌కు తరలిస్తుండగానే మృతి చెందాడు. ఓ కుటుంబం రోడ్డున పడింది. అత్యంత విషాదకరమైన ఈ ఘటన సబ్బవరంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది.



పెందుర్తి/సబ్బవరం :

సబ్బవరం మండల కేంద్రం సాయినగర్‌ సమీపంలోని దుర్గానగర్లో కుమారుడు నాయుడు(21), కుమార్తె మౌనికలతో కలిసి పాల శాంతి నివాసం ఉంటున్నారు. నాయుడు పెందుర్తిలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదుతున్నాడు. దీంతోపాటు స్థానికంగా పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి నాయుడుకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానికుల సహాయంతో కుటుంబసభ్యులు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని కేజీహెచ్‌కు తరలించాలని పీహెచ్‌సీ జూనియర్‌ డాక్టర్‌ సూచించారు. దీంతో ఆక్సిజన్‌ కూడా అవసరం ఉండడంతో బంధువులు వెంటనే 108కు సమాచారం అందించారు.



అయితే డీజిల్‌ సరఫరా లేని కారణంగా వాహనం రాకపోవచ్చని, మరో వాహనం రావాలంటే 2 – 3 గంటల సమయం పడుతుందని సమాధానం వచ్చింది. ప్రత్యామ్నాయం చూసుకోమవని చెప్పడంతో చేసేది లేక నాయుడును ఆటోలో కేజీహెచ్‌కు తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునేటప్పటికే నాయుడు మృతి చెందినట్లు కేజీహెచ్‌ వైద్యులు నిర్థారించారు. అదే 108 వాహనం సకాలం లో వచ్చి ఉంటే ఆక్సిజన్‌ అందుబాటులో ఉండి నాయుడు ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు రోదిస్తూ చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్లే ఓ యువకుడి నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విమర్శిస్తున్నారు.



పేద కుటుంబంలో పెను విషాదం

మృతి చెందిన నాయుడుది నిరుపేద కుటుంబం. 30 ఏళ్ల క్రితం తండ్రి దానయ్యరెడ్డి కుటుంబంతో సహా ఇక్కడకు వలస వచ్చి స్థానికంగా మెకానిక్‌గా పనిచేసి కటుంబాన్ని పోషించుకునేవాడు. ఐదేళ్ల క్రితం ఆయన మరణించడంతో నాయుడు తల్లి శాంతిపై కుటుంబ భారం పడింది. ఆమె స్థానికంగా ఉన్న ఓ హాస్టల్‌లో పని చేస్తూ పిల్లలను చదివించుకుంటుంది. తల్లికి చేదోడుగా ఉండాలన్న తలంపుతో నాయుడు సెలవు దినాల్లో స్థానికంగా చిన్నచిన్న పనులు చేస్తుండేవాడు. తాజా ఘటనతో నాయుడు మృత్యువాత పడడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. కుమారుడి మృతదేహం వద్ద తల్లి, చెల్లి రోదన స్థానికులను కంటతడి పెట్టించింది.



ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట: అదీప్‌రాజ్‌

ప్రజల ప్రాణాలు నిలబెట్టాలన్న తలంపుతో మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టిన 108వాహనాల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఆరోపించారు. మృతి చెందిన నాయుడు కుటుంబాన్ని ఆయన బుధవారం పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సకాలంలో 108 వాహనం వచ్చి ఉంటే నాయుడు బతికేవాడన్నారు. 108 వాహనాలకు డీజీల్‌ కూడా సరఫరా చేయకుండా ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పరోక్షంగా తీస్తోందని ఆరోపించారు. ఇది ప్రజల భద్రత పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top