ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి శ్రీకారం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి శ్రీకారం


- రాయలసీమ ఐజీ ఎన్‌.శ్రీధర్‌రావు

కడప అర్బన్‌ : రాష్ట్రంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మొదటిసారిగా జిల్లాలో టెక్నికల్‌ అనాలసిస్‌ వింగ్‌ను ప్రారంభించామని, ఇది చాలా శుభపరిణామమని రాయలసీమ ఐజీ ఎన్‌.శ్రీధర్‌రావు అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాయలసీమ ఐజీ ఎన్‌.శ్రీధర్‌రావు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం వరకు ఎన్నికలు, శాంతిభద్రతలపై డీఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ బంగ్లా, క్యాంపు కార్యాలయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘టా’ (టెక్నికల్‌ అనాలసిస్‌ వింగ్‌) కార్యాలయాన్ని  ప్రారంభించారు. ఈ విధానం ద్వారా నేర పరిశోధనలో, కేసుల దర్యాప్తుల్లో ఎలా ముందడుగు వేయాలో తెలుసుకోవచ్చన్నారు.  అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరు లక్షల మంది వివిధ నేరాల ప్రవృత్తి కలిగిన వారిని గుర్తించామని, వారు ఎక్కడైనా సరే తనిఖీల సమయంలో తారసపడినా, తమకు అనుమానం వచ్చినా వెంటనే వారి వివరాలను, వేలిముద్రలను నమోదు చేయడం ద్వారా తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. చోరీలు, దోపిడీలను తద్వారా అరికట్టవచ్చన్నారు. నేరాల సమయంలో వివిధ సెల్‌ఫోన్లను ఉపయోగిస్తూ తాము తెరవెనుక ఉంటూ తప్పించుకుంటూ తిరిగే వారని కూడా టెక్నికల్‌ అనాలసిస్‌ వింగ్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు  సీడీఆర్‌తోపాటు వారి వెనుకగల సాంకేతిక ప్రమాణాలతో కూడిన లోపాలను కూడా కనిపెట్టవచ్చన్నారు. ప్రతి పోలీసు వాహనానికి ఇప్పటికే జీపీఎస్‌ సిస్టమ్‌ ఉన్నందున వీఎంఎస్‌ ద్వారా ఆయా పోలీసు అధికారులను నేరాలు జరిగినపుడు గుర్తించి వెంటనే ఆయా ప్రదేశాలకు సకాలంలో చేరుకుని నేరాలను నిరోధించే విధంగా కృషి చేయవచ్చన్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ రాష్ట్రంలోనే మొదటిసారిగా డీజీపీ చెప్పిన నెలరోజుల్లోపే టెక్నికల్‌ అనాలసిస్‌ వింగ్‌ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయించడం అభినందించదగ్గ విషయమన్నారు.  

పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికలు:

రాయలసీమలో జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎన్నికలను నిర్వహించేందుకు ఇప్పటికే పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఒక్కొ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష జరిపి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నామన్నారు. పొలిటికల్, ఇతర అనుమానించదగ్గ, గతంలో కేసులు ఉన్న వారిపైన, వారి కదలికలపైన ఇప్పటికే నిఘా ఉంచామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, ఓఎస్‌డీ (ఆపరేషన్స్‌) సత్య ఏసుబాబు, పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

 

 

 







 





















 











 

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top