హత్యకేసులో పదిమంది నిందితుల అరెస్టు

మాట్లాడుతున్న అడిషనల్‌ ఎస్పీ సుబ్బారాయుడు - Sakshi

గుంటూరు (నగరంపాలెం) : నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏ ప్లస్‌ రౌడీషీటర్‌ వల్లెపు గోపినాథ్‌ హత్య చేసిన కేసులో పదిమంది నిందితులను నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. అర్బన్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను అడిషనల్‌ ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఎప్పటికైనా తమను చంపేస్తానని గోపినాథ్‌ బెదిరించే వాడని తెలిపారు. ప్రమాదం ఉందని బావించి పథకం ప్రకారం నగరంపాలెం ఎస్‌బీఐ వద్ద గోపినాథ్‌ను కిడ్నాప్‌ చేశారు. ఆ రోజు రాత్రి 10.30 గంటలకు బుడంపాడు లోని గుంటూరు చానల్‌ వద్ద హత్య చేశారు.  పోలీసులకు అందిన కచ్చితమైన సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4.30గంటల సమయంలో నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి  రూరల్‌ మండలం పరిధిలోని లాల్‌పురం గ్రామం లావణ్యకోల్డ్‌ స్టోరేజీ  దగ్గర  నిందితులను అరెస్టు చేశామని సుబ్బారాయుడు చెప్పారు. అరెస్టు చేసిన వారిలో వికలాంగుల కాలనీకి చెందిన బండి దుర్గారావు, పెనుమాల అనిల్‌కుమార్, కెవీపీ కాలనీకి చెందిన కుంచాల మణికంట, కోలా దీలిప్,కోనంకి నాగబాబు, నల్లగోటి బాజి, ఎతిరాజుల కాలనీకి చెందిన షేక్‌ నాగుల్‌మీరా, నల్లచెరువుకు చెందిన మహంకాళి దుర్గారావు, కన్నావారితోటకు చెందిన షేక్‌ జమీర్, చంద్రబాబు నాయుడు కాలనీ షేక్‌ జమీర్‌ ఉన్నారు. వీరు అందరూ నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పలుకేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. నిందితులను అరెస్టు చేసే విషయంలో ప్రతిభ కనబర్చిన నల్లపాడు సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ రాంబాబులను ఏఎస్పీ సుబ్బారాయుడు అభినందించారు. సమావేశంలో డీఎస్పీ బి శ్రీనివాస్, సిఐ కె శ్రీనివాస్, ఎస్‌ఐ రాంబాబు, కానిస్టేబుల్స్‌ తదితరులు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top