వైఎస్సార్‌సీపీ నేత ఆత్మహత్యాయత్నం

YSRCP Leader Commits Suicide Attempt Infront Of Police Station - Sakshi

పోలీస్‌స్టేషన్‌  ఆవరణలో ఘటన.. 

ఊటుకూరు చెరువు విషయంలో వేధింపులు తట్టుకోలేకే.. 

తిరగబడిన వారిని టార్గెట్‌ చేస్తున్న టీడీపీ నాయకులు 

ఎమ్మెల్యే బీకే అండతోనే     పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణ 

అనంతపురం, పరిగి: పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఊటుకూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సంతోష్‌ సోమవారం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఊటుకూరు చెరువు మునక ప్రాంతంలో కియా సంస్థ అనుబంధ పరిశ్రమ నిర్మాణం చేపట్టడంతో గ్రామస్తులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిశ్రమ నిర్మాణంలో ఎమ్మెల్యే బీకే పార్థసారథి కీలకంగా వ్యవహరించారని, చెన్నైకి చెందిన కేఐఎల్‌ఎం ఫ్యాక్టరీ యాజమాన్యంతో భారీగా ముడుపులు తీసుకుని ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్మాణానికి పూనుకున్నారని ఆరోపిస్తున్నారు. పరిశ్రమను వ్యతిరేకిస్తున్న వారిలో ప్రముఖులను టార్గెట్‌ చేసకుని పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం సంతోష్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.  

ఫిర్యాదుపై స్పందించని పోలీసులు 
తనను హత మార్చేందుకు టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ ఈశ్వరప్ప అతని అల్లుడు ఎమ్మెల్యే అండతో కుట్ర పన్నారని సంతోష్‌తోపాటు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా సంతోష్‌కే ఫోన్‌ చేసి ఇబ్బందులు పెట్టేవారు. ఎమ్మెల్యే అండ చూసుకుని టీడీపీ నాయకులు తనను హతమార్చడం ఖాయమని, ఇక తాను బతికి ప్రయోజనం లేదని భావించిన సంతోష్‌ సోమవారం పోలీస్‌స్టేషన్‌కు పెట్రోలు బాటిల్‌తో వచ్చాడు. అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోలు పోసుకోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు నిలువరించి, బాటిల్‌ను లాగి పడేశారు. అనంతరం అతడిని హిందూపురంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.  

స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత 
విషయం తెలుసుకున్న ఊటుకూరు గ్రామస్తులు భారీ సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో టూటౌన్‌ సీఐ తమీమ్‌ అహ్మద్‌ నేతృత్వంలో పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమయ్యారు. తమకు రక్షణ కరువైందని, పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఎదురు తిరుగుతున్న వారిపై ఎమ్మెల్యే బీకే దాడులు చేయిస్తున్నారని సీఐ ఎదుట ఆరోపించారు. పోలీసులే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తే ఇక తమకు దిక్కెవరని వాపోయారు. తగు చర్యలు తీసుకుంటామని తెలపడంతో గ్రామస్తులు శాంతించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top