హోదా కోసం మరొకరు ప్రాణత్యాగం

You Commits Suicide Special Status to AP In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు : ప్రత్యేక హోదా కోసం మరొకరు ప్రాణత్యాగం చేశారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి సుధాకర్‌(26) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లె రామరావు కాలనీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు రామచంద్ర, సరోజమ్మల కుమారుడు సుధాకర్ శనివారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హోదా కోసం బలిదానం చేసుకోవడం చిత్తూరు జిల్లాలో ఇది రెండో సంఘటన కాగా.. గతంలో మునుకోటి అనే వ్యక్తి తిరుపతిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక సుధాకర్‌ ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేవాడని స్థానికులు తెలిపారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన చేనేత కార్మికుల సమావేశంలో కూడా సుధాకర్‌ తన గళాన్ని వినిపించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

సేవా గుణం కలిగిన సుధాకర్‌ తాను నివాసం ఉంటున్న కాలనీ సమీపంలోని ఓ అనాథశ్రమానికి ఇటీవల రూ. 5 వేల రూపాయలు విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిరుపేద అయినప్పటికి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడని స్థానికులు తెలిపారు. హోదా కోసం సుధాకర్‌ ఆత్మహత్య చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హోదా కోసం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

చిత్తూరు ప్రభుత్వాస్పతి వద్ద ఉద్రిక్తత..
సుధాకర్‌ మృతి పట్ల ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆందోళనకు దిగడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రికత్త నెలకొంది. సుధాకర్‌ మృతితోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున నాయకులు, విద్యార్థులు పాల్గొనడంతో రవాణ స్థంభించింది. ప్రత్యేక హోదా కోసం అసువులు బాసిన సుధాకర్ కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి పరామర్శించారు. సుధాకర్‌ కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున రెండు లక్షలు సహాయం అందించారు.

రేపు మదనపల్లె బంద్‌
ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన సుధాకర్‌ మృతికి సంతాపంగా రేపు(ఆదివారం) మదనపల్లె బంద్‌కు వైఎస్సార్‌ సీపీ, సీపీఎం, సీపీఐ పార్టీలు పిలుపునిచ్చాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top