కారుతో ఢీకొట్టి... వేటకొడవళ్లతో నరికి.. 

Young man Murder in hyderbad - Sakshi

నగరశివార్లలో పట్టపగలే యువకుడి హత్య

హైదరాబాద్‌: ప్రతీకారేచ్ఛకు మరో ప్రాణం బలైంది. పట్టపగలు, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపిన ఘటన హైదరాబాద్‌ శివార్లలోని మీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తిమ్మరాసుపల్లి గ్రామానికి చెందిన గిరి శ్రీనివాస్‌గౌడ్‌ (38) జేసీబీ వాహనాన్ని నిర్వహిస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్న అతనికి కల్వకుర్తికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా చివరకు వివాహేతర సంబంధానికి దారితీయడంతో శ్రీనివాస్‌గౌడ్‌పై యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాచకొండ సీసీఎస్‌ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై 3 నెలల కిందట బయటకు వచ్చిన శ్రీనివాస్‌గౌడ్‌ తనకు ప్రాణహాని ఉందంటూ హైదరాబాద్‌ బడంగ్‌పేటలో నివసిస్తున్న తన సోదరుని కుమారుడు ప్రశాంత్‌ వద్ద ఉంటున్నాడు.

గురువారం ఉదయం ఓ ప్లాట్‌ అగ్రిమెంట్‌ చేసుకునేందుకు బాబాయ్‌ తిరుపతయ్యగౌడ్‌తో కలసి ద్విచక్ర వాహనంపై బీఎన్‌రెడ్డి నగర్‌ చౌరస్తా సమీపంలోని టీచర్స్‌కాలనీకి వెళ్లాడు. అప్పటికే కారులో మాటు వేసిన ఇద్దరు దుండగులు బైకును కారుతో ఢీకొట్టి కిందపడిన శ్రీనివాస్‌గౌడ్‌ తల, కుడి చేయి, నుదుటిపై వేటకొడవళ్లతో నరికారు.  తిరుపతయ్యగౌడ్‌ ప్రాణభయంతో పారిపోగా హంతకులు వేటకొడవళ్లు, కారును వదిలి పరారయ్యారు. కారులో లభించిన కారం ప్యాకెట్,  వేట కొడవళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్వకుర్తికి చెందిన యువతి బంధువైన శ్రీధర్‌రెడ్డి అనుచరులే హతమార్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ తిరుపతయ్యగౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top