‘చనిపోవాలని ఉంది.. మిస్‌ యూ ఫ్రెండ్స్‌’

Young Man Committed Suicide Because His Girlfriend Was Disassociated - Sakshi

వాట్సాప్‌ స్టేటస్‌లో మెసేజ్‌లు పెట్టి ఆత్మహత్య

ప్రేమ వ్యవహారమే కారణమా?

సాక్షి, ఇచ్ఛాపురం రూరల్‌: ఫొటో తీయాలంటే శివ... డాన్స్‌ వేయాలంటే శివ... ఈ రెండు రంగాల్లో మంచి పేరు సంపాదించిన పైలా శివ(22) తనువు చాలించాడు. ‘చనిపోవాలని ఉంది’‘ ఐ మిస్‌ యూ ఫ్రెండ్స్‌’ అంటూ వాట్సాప్‌ స్టేటస్‌లో మెసెజ్‌లు పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన పైలా పురుషోత్తం, భవానీ దంపతుల మూడో సంతానం పైలా శివ(22) ఇచ్ఛాపురంలో ఇంటర్‌ వరకు చదువుకున్నాడు. తాను ఎంచుకున్న రంగాల్లో రాణిస్తూ ‘శివ రాక్స్‌’గా పేరు పెట్టుకుంటూ స్నేహితులతో గడిపేవాడు. కొన్ని రోజులుగా ఆందోళనగా ఉన్న ఈయన రెండ్రోజుల క్రితం ఒడిశా బెర్హాంపూర్‌ తాతగారింటికి వెళ్లినట్లు బంధువులు తెలిపారు. బుధవారం రాత్రి 9 గంటల 48 నిమిషాలకు ‘సో శాడ్‌’ అంటూ తన వాట్సాప్‌ స్టేటస్‌లో మెసేజ్‌ పెట్టాడు. మరో నిమిషంలో చనిపోతున్నట్టు మెసేజ్‌ పెట్టడంతో స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి 10.05 నిమిషాలకు ‘లాస్ట్‌ వీడియో’ మెసేజ్, రాత్రి 10.57 నిమిషాలకు ‘ఆర్‌ఐపీ శివ రాక్స్‌’తో మరో మెసేజ్‌ పెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బంధువులు శివ దగ్గరకు వెళ్లేసరికి అప్పటికే అపస్మారక స్థితిలో ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

ఫిట్స్‌ వచ్చిందని దహన సంస్కారాలు...
గురువారం ఉదయం 7 గంటలకు బెర్హెంపూర్‌ నుంచి ధర్మపురం గ్రామానికి శివ మృతదేహాన్ని తీసుకొచ్చి ఫిట్స్‌తో చనిపోయినట్లు చెప్పి దహన సంస్కారాలు చేసేశారు. అయితే సోషల్‌ మీడియాలో శివ పెట్టుకున్న మెసెజ్‌లు గురించి తెలియడంతో గ్రామస్తులు బిత్తరపోయారు. ఈ విషయమై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని రూరల్‌ ఎస్సై కే లక్ష్మి తెలిపారు.

ప్రేయసి దూరమైందనే?
శివ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేమ వ్యవహారమే కారణంగా వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఇచ్ఛాపురం మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ప్రేమించాడు. బంధువులు, పెద్దలు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో కొన్ని రోజుల వరకు ప్రేమ జోలికి పోలేదు. ఇటీవల మరలా అమ్మాయిని కలవడానికి ప్రయత్నించగా, కుదరకపోవడంతో మానసికంగా కుంగిపోయిన శివ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భోగట్టా. ప్రస్తుతం శివ తండ్రి పురుషోత్తం సింగపూర్‌లో వలస కూలిగా ఉన్నాడు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top