ప్రాణం తీసిన ఎస్‌ఐ ఓవర్‌ యాక్షన్‌

young man commit to suicide with SI pressure - Sakshi

భార్యాభర్తల వివాదం పరిష్కారంలో నిర్వాకం

మనస్తాపంతో భర్త ఆత్మహత్య

కోసూరు శివారు తురకపాలెంలో ఉద్రిక్తత

భారీగా పోలీసుల మోహరింపు

అమరావతి, కోసూరు(తురకపాలెం)కూచిపూడి : భార్యాభర్తల వివాదం పరిష్కారంలో కృష్ణాజిల్లా కూచిపూడి ఎస్‌ఐ చేసిన ఓవర్‌ యాక్షన్‌తో  ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మొవ్వ మండలం కోసూరు శివారు తురకపాలెంలో బుధవారం రాత్రి వీరంకి శ్రీహరి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గ్రామస్తులు, మృతుడి బంధువులు కలిసి శ్రీహరి మృతదేహంతో ధర్నా చేసేందకు ప్రయత్నించగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసు ఉన్నతాధికారులు గ్రామానికి వెళ్లి  గ్రామస్తులు, మృతుడి కుటుంబసభ్యులతో చర్చించి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. తన కుమారుడు మృతికి కారకులైన భార్య శ్రీలక్ష్మి, ఆమె తరఫు బంధువులు, కూచిపూడి ఎస్‌ఐ గుడివాడ అనిల్‌పై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి వీరంకి నీలవేణి పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

కాపురం చేయాలని ఒత్తిడి..
కూచిపూడి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ అనిల్‌ వీరంకి శ్రీహరిని స్టేషన్‌కు పిలిపించి కాపురం చేసుకోమని బెదిరించారు. ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రోజూ ఉదయం స్టేషన్‌కు పిలిపించి రాత్రి పొద్దుపోయేవరకు నిర్బంధించి తగువు పరిష్కరించుకోమని ఎస్‌ఐ ఒత్తిడి చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. రూ. 2లక్షలు  భరణంగా ఇస్తావా తేల్చుకోమని ఎస్‌ఐ ఈ నెల 10వ తేదీ రాత్రి చివరి సారిగా శ్రీహరికి   అల్టిమేటం జారీ చేశారు. తనకు ఏవిధమైన ఆస్తిపాస్తులు లేవని, తాను  అంత డబ్బు కట్టలేనని శ్రీహరి చెప్పాడు. బెదిరింపు చర్యల్లో భాగంగా ఎస్‌ఐ బుధవారం రాత్రి శ్రీహరి పోలీస్‌ స్టేషన్‌లో ఉండగానే అతని భార్య శ్రీలక్ష్మిని ఒక కానిస్టేబుల్‌ను ఇచ్చి తురకపాలెం గ్రామానికి పంపి ఇంటికి వేసిన తాళం బద్దలు కొట్టి ఆమెను లోపల కూర్చోబెట్టారు. శ్రీహరిని సైతం ఇంటికి పంపించివేశాడు. ఇటు భార్య, అటు ఎస్‌ఐ వేధింపులతో మనస్తాపానికి గురైన శ్రీహరి మార్గమధ్యలో పురుగు మందు కొనుగోలు చేసుకుని తాగి ఇంటికి వచ్చి కుప్పకూలి చనిపోయాడు. సమాచారం తెలియడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అవనిగడ్డ  డీఎస్పీ పోతురాజు, చల్లపల్లి సీఐ జనార్ధనరావు, అవనిగడ్డ సీఐ మణికుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు తురకపాలెం వెళ్లారు. శ్రీహరి ఇంట్లో ఉన్న శ్రీలక్ష్మిని వేరొక చోటకు పంపివేశారు. గ్రామస్తులు, మృతుని బంధువులతో చర్చించి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.

అసలేం జరిగింది..
మొవ్వ మండలం కోసూరు శివారు తుకపాలెం గ్రామానికి చెందిన వీరంకి శ్రీహరికి, పామర్రు మండలం జుజ్జవరం గ్రామానికి చెందిన లక్ష్మీతో ఏడాది కిందట వివాహమైంది. శ్రీలక్ష్మికి గతంలో వేరొక వ్యక్తితో  వివాహం జరిగింది. వారికి ఒక మగపిల్లవాడు ఉన్నాడు. మొదటి భర్త చనిపోయాడు. మృతుడు  శ్రీహరికి  కూడా గతంలో వేరొక విహహం జరిగింది. ఒక ఆడపిల్ల కూడా ఉంది. మొదటి భార్యతో విడాకులు ఇచ్చిన శ్రీహరి కుమార్తెను తన వద్దే ఉంచుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరికి రెండో వివాహాలు అయినా వారి మధ్య అన్యోన్యత కుదరలేదు. పెళ్లయిన నాటి నుంచి తరచూ గొడవలు జరగటం, పెద్దల పంచాయితీలు, చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో కొంతకాలంగా శ్రీలక్ష్మి తన పుట్టింటికి వెళ్లి పోయింది. ఈ నెల 6న శ్రీలక్ష్మి కూచిపూడి వెళ్లి భర్త, అత్త, భర్త సోదరునిపై కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top