ఫేస్‌బుక్‌ ప్రేమికుడి కోసం కన్నతల్లిని..

Young Girl Killed Mother For Facebook Lover - Sakshi

తిరువళ్లూరు: ఫేస్‌బుక్‌ ప్రేమ వ్యవహరానికి అడ్డుచెప్పిన తల్లిని ప్రియుడి స్నేహితులతో కలిసి తల్లిని హత్య చేసిన కేసులో ఊహించని నిజాలు బయటపడడంతో పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. హత్య కేసులో ప్రధాన నిందితురాలు దేవీప్రియ గంటగంటకు ఒక్కో విధంగా సమాచారం ఇవ్వడంతో  కేసు విచారణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న సందిగ్ధం పోలీసులకు ఎదురైంది. అర్ధరాత్రి వరకు దేవీప్రియ చెప్పిన సమాచారాన్ని సేకరించి ఆదిశగా విచారణ చేపట్టిన పోలీసులు, ఆ తరువాత రూట్‌ మార్చి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఫోన్‌లో చాటింగ్‌కు, యువతి  ఇచ్చిన సమాచారానికి మధ్య పొంతన లేకపోవడంతో అసలు ట్రీట్‌మెంట్‌ రుచి చూపించిన పోలీసులు మంగళవారం సాయంత్రానికి కేసును కొలిక్కి తెచ్చారు.

తిరువళ్లూరు జిల్లా కాకలూరు ఆంజనేయపురం 8వ వార్డుకు చెందిన తిరుముగన్‌నాథన్‌ (65). ఇతని భార్య భానుమతి. వీరికి  చాముండేశ్వరి (24), దేవీప్రియ (19) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దేవీప్రియ పట్టాభిరామ్‌ సమీపంలోని ప్రయివేటు కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో దేవిప్రియ ఫేస్‌బుక్‌లో పరిచమైన వ్యక్తితో ప్రేమాయాణం నడపడం, సోమవారం నగదు నగలతో ఉడాయిచడానికి యత్నించడం చకచక జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో దేవిప్రియ పరారు కావడానికి యత్నించగా అడ్డుకున్న తల్లిని ప్రియుడి స్నేహితులతో కలిసి  దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. 

పోలీసుల విచారణ: ఫేస్‌బుక్‌ ప్రేమకు తల్లి అడ్డుచెప్పిందన్న అక్కసుతో ప్రియుడి స్నేహితుడితో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న దేవీప్రియను అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో దేవీప్రియ పొంతన లేని సమాచారాన్ని ఇవ్వడంతో పోలీసులు ఖంగుతిన్నారు.  చాటింగ్‌ వివరాలకు, యువతి ఇస్తున్న సమాచారానికి పొంతన లేకపోవడంతో పోలీసుల విచారణకు ప్రధాన అడ్డంకిగా మారింది. మొదట తిరుప్పావణం ప్రాంతానికి చెందిన వివేక్‌ను ప్రేమిస్తున్నట్టు చెప్పింది. దీంతో పోలీసులు వివేక్‌ నంబర్‌ను చేదించి విచారణ చేయగా అతనితో చాలా తక్కువ సమయం మాట్లాడినట్టు గుర్తించారు. దీంతో అనుమానించిన పోలీసులు, తమదైన శైలిలో విచారణ చేపట్టి అసలు విషయాన్ని రాబట్టారు.

అసలు ప్రేమికుడు శ్రీసిటీ ఉద్యోగి. రెడ్‌హిల్స్‌ ప్రాంతానికి చెందిన సురేష్‌ గతంలో ఆవడిలో పని చేసేవాడు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటిలోని నిప్పాన్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచమైన సురేష్‌తో ఆరు నెలల నుంచి ప్రేమాయాణం సాగించా. ఇప్పటి వరకు మూడు సార్లు అతనిని కలిశా. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు వారించారు. అయినా నేను సురేష్‌నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించా. అందుకే సురేష్‌ స్నేహితుడైన వివేక్‌ సాయం తీసుకున్నాం. సోమవారం సాయంత్రం బంగారు నగలు, నగదుతో ఉడాయించాలని నిర్ణయించుకుని వెళ్లాలనుకున్నా, తల్లి అడ్డుకోవడంతో హత్య చేసినట్టు దేవీప్రియ నేరం అంగీకరించినట్టు పోలీసులు వివరించారు. అసలు ప్రేమికుడు సురేష్‌ కావడంతో మంగళవారం వేకువజామున శ్రీసిటీకి వెళ్లిన  పోలీసులు అక్కడ అతన్ని అరెస్టు చేసి విచారణ నిమిత్తం తిరువళ్లూరుకు తీసుకెళ్లారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top