చనిపోతున్నా.. క్షమించండి

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
సూసైడ్ లెటర్లో అప్పుల వివరాలు
జే పంగులూరులో విషాదం
అమ్మా నాన్నా.. నన్ను క్షమించండి.. వ్యవసాయంలో అప్పుల పాలయ్యాను. సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోతున్నా. అప్పిచ్చిన వారికి ముఖం చూపించ లేకపోతున్నా. అందుకే చనిపోతున్నా.. పిల్లలను వదిలి వెళ్లి పోతున్నా. కోల్డ్ స్టోరేజీలో శనగలు ఉన్నాయి. వాటితోపాటు ట్రాక్టర్ కూడా అమ్మేసి వడ్డీతో సహా అప్పులు తీర్చేయండి. అంటూ తన బాధను తల్లిదండ్రులకు విన్నవించుకుంటూ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవవరికి ఎంతెంత సొమ్ము చెల్లించాలో జాబితా రాసి మరీ ప్రాణాలు విడిచాడు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని సూసైడ్ లెటర్లో పేర్కొన్నాడు. మండల కేంద్రం పంగులూరులో మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
సాక్షి, జె.పంగులూరు(ప్రకాశం) : సాగుకు తెచ్చిన అప్పులు భారంగా మారాయని మనస్తాపం చెందిన ఓ రైతు పురుగు మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని సూసైడ్ లెటర్ రాశాడు. ఈ ఘటనకు సంబంధించి సేకరించిన వివరాల ప్రకారం.. పంగులూరు గ్రామానికి చెందిన బాచిన బుల్లిబాబు (35), నాగప్రసన్న దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. బుల్లిబాబు తన రెండు ఎకరాల పొలంతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు పండిస్తుండేవాడు. ఏటా తను పండించే పంటలు దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక నష్టాలు చవి చూస్తున్నాడు. కనీసం ఈ సంవత్సరం అయినా పంటలు బాగా పండితే అప్పులు తీర్చవచ్చని భావించాడు. పర్చూరు మండలం వీరన్నపాలెంలో ఏడెకరాల కౌలు భూమిలో శనగ పంట వేశాడు. అకాల వర్షాలతో శనగ పంట దిగుబడి రాలేదు. గత సంవత్సరం పండిన శనగలు ఏసీ (కోల్డ్ స్టోరీజీ)లోనే వున్నాయి. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి.
దీంతో బుల్లిబాబు మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి 9 గంటల వరకు తన పిల్లలతో సమయం గడిపిన బుల్లిబాబు ఆ తర్వాత కనిపించకుండా వెళ్లిపోయాడు. అర్ధరాత్రి దాటినా ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు అన్ని చోట్లా వాకబు చేశారు. ఉదయం వస్తాడులే అనుకొని నిద్రించారు. మంగళవారం ఉదయానే మల్లవరం రోడ్డు సమీపంలోనే ముళ్ళ చెట్లల్లో బుల్లిబాబు విగతజీవిగా కనిపించాడనే వార్త విని గుండెలు బాదుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. రేణింగవరం ఎస్ఐ మహేష్ మృతదేహం సమీపంలో లభించిన సూసైట్ నోట్, శీతలపానీయం, పురుగుమందు డబ్బా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్డం నిమిత్త అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్ నోట్లో అప్పుల వివరాలు..
అప్పుల వాళ్లకు తన ముఖం చూపించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారని బుల్లిబాబు సూసైట్ నోట్లో పేర్కొన్నాడు. తాను గ్రామంలో ఒకరి నుంచి రూ.2 లక్షలు, మరొకరి వద్ద రూ.1.50 లక్షలు, ఇంకొకరికి దగ్గర రూ.15 వేలు అప్పులు చేశానని, వడ్డీతో పాటు అప్పు చెల్లిచమంటూ తల్లిదండ్రులను కోరాడు. ఏసీలో శనగలు, తన ట్రాక్టర్ అమ్మేసి వడ్డీతోపాటు అప్పులు కట్టేయమని సూచించాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి