ఎలుకలను చంపబోతే.. పాము కాటేసింది

women die with snake bite - Sakshi

సాక్షి, ఖమ్మం: ఎలుకలను చంపేందుకని విషపూరిత అట్టను అమరుస్తున్న ఆమెను పాము కాటేసింది. తనను ఎలుక కరిచిందేమోనని అనుకుంది. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మండలంలోని బూడిదంపాడులో గురువారం ఇది జరిగింది. ఆమె కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. నల్లమోతు పద్మ(46). ఇంట్లో ఎలుక కన్నం ఉంది. అక్కడి నుంచి తరచూ ఎలుకలు వస్తున్నాయి.

 వీటిని చంపేందుకని విషపూరిత పదార్థంతో కూడిన బంక (గమ్‌) అట్టను కన్నం లోపల ఉంచింది. ఆ అట్ట మీదనున్న బంక అంటుకుని ఒక ఎలుక చనిపోయింది. దానిని బయటకు తీసి దూరంగా పడేసింది. ఆ తరువాత, అదే అట్టను యథాస్థానంలో పెట్టేందుకని కన్నంలో చేయి పెట్టింది. ఆ వెంటనే ఏదో కరిచింది. ఎలుకే కరిచిందని అనుకుంది. ఆమెను భర్త నరసింహారావు వెంటనే మంచుకొండ ప్రాథమిక వైద్యశాలలో చేర్పించారు. పరిస్థితి విషమించిందని, ఖమ్మం తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు. ఆటోలో ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళుతుండగా శివాయిగూడెం సమీపంలో మృతిచెందింది. పద్మ–నర్సింహారావు దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది. పాము కాటుతోనే మృతిచెంది ఉంటుందని ఆమె కుటుంబీకులు భావిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top