అమ్మాయని లిఫ్టిస్తే.. కొంపముంచింది

Woman Stolen A Bike After Asking For Lift In Kadapa - Sakshi

లిఫ్ట్‌ అడిగి.. ఆపై బైకుతో ఉడాయించి..

మహిళా దొంగను అరెస్టు చేసిన పోలీసులు

సాక్షి, కడప : బైకుపై వెళుతున్న ఓ యువకుడిని లిఫ్ట్‌ అడిగి కొంత దూరం వెళ్లాక.. అదును చూసి రూ.లక్షా 29వేలు విలువ చేసే బైకుతో ఉడాయించిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు సీఐ సత్యబాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 17వ తేదీన శివ అనే యువకుడు అపాచీ (ఏపీ39 ఎల్‌ 1643) మోటారు బైకుపై పనిమీద రిమ్స్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన బసిరెడ్డి లీలావతి (21) అనే యువతి బైకును ఆపింది. రిమ్స్‌లో తమ బంధువులు ఉన్నారని, అర్జెంటుగా వెళ్లాలని చెప్పి లిఫ్ట్‌ అడిగింది. దీంతో అతను ఆమెను బైకుపై ఎక్కించుకుని రిమ్స్‌కు బయలుదేరాడు. రిమ్స్‌లోని దంతవైద్య కళాశాల వద్దకు వెళ్లగానే అతనికి ఫోన్‌ రావడంతో బైకును అక్కడే ఆపి ఫోన్‌ మాట్లాడేందుకు పక్కకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన యువతి ఆ బైకును స్టార్ట్‌ చేసుకుని వేగంగా ఉడాయించింది. ఈ విషయంపై బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేయగా, ఈనెల 21వ తేదీన కేసు నమోదు చేశారు. నిందితురాలి పూర్తి వివరాలను తెలుసుకుని ఆమె కడపకు రాగానే పసిగట్టి శనివారం సాయంత్రం సింగపూర్‌ టౌన్‌షిప్‌ సర్కిల్‌ వద్ద అరెస్టు చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top