కొత్తజాలారిపేటలో కలకలం

Woman Murdered In Visakhapatnam - Sakshi

కత్తితో పాశవికంగా మహిళపై దాడి  

కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి 

ఆకాశ్‌ అనే యువకుడు హత్య చేశాడని భర్త ఫిర్యాదు

పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): పాతనగరం 21వ వార్డు కొత్తజాలారిపేటలో మహిళ హత్యతో కలకలం రేగింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న మైలపల్లి రాము (45) భార్య మైలపల్లి ముసలి (40)పై ఓ యువకుడు అత్యంత పాశవికంగా కత్తితో దాడి చేసిన సంఘటన శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ సీఐ ఉమాకాంత్, ఎస్‌ఐ శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసు జాగిలాన్ని తీసుకొచ్చి నిందితుడి ఆచూకీ కోసం ప్రయతి్నంచారు. ఆ పరిసరాల్లో జాగిలం తిరిగింది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, చింతపల్లి గ్రామానికి చెందిన మైలపల్లి రాములు, భార్య బిడ్డలతో కలిసి విశాఖపట్నం వలస వచ్చాడు.

రాములు కుటుంబంతో కలిసి కొత్తజాలరిపేట కుంచమాంబ గుడి సమీపంలోని ఇంటిలో రెండేళ్లుగా నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో ఒక అమ్మాయికి, అబ్బాయికి వివాహం అయ్యింది. చిన్న అమ్మాయి అక్కవద్దనే ఉంటుంది. కోడలు ఇటీవల పుట్టింటికి వెళ్లింది. రాములు బోటులో చేపల వేటకు వెళ్తుండగా, భార్య ముసలి ఫిషింగ్‌ హార్బర్‌లో చేపలు కొని ఇంటింటికీ తిరిగి అమ్ముతుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయాన్నే రాములు కొడుకుతో కలిసి బోటులో చేపల వేటకు వెళ్లేందుకు ఫిషింగ్‌ హార్బర్‌కు వెళ్లిపోయాడు. కాసేపటి తరువాత తన సెల్‌ఫోన్‌ ఇంట్లో మరిచిపోయినట్టు గుర్తించిన రాములు తిరిగి ఇంటికి చేరుకున్నాడు.

ఇంటికి చేరుకున్న రాములు ఇంట్లో భార్య ముసలి రక్తపు మడుగులో ఉండడాన్ని గమనించడంతోపాటు పక్కవీధిలో నివాసం ఉంటున్న ఆకాశ్‌ అనే యువకుడు భార్యపై దాడి చేసి అక్కడే తన చెప్పులు, దుస్తులు వదిలి పారిపోతుండడాన్ని గుర్తించాడు. వెంటనే పరిసరాల్లోని వ్యక్తుల సాయంతో నిందితుడిని పట్టుకోవడానికి ప్రయతి్నంచిగా పారిపోయాడు. భార్య కుడి చెవి, కుడి చేతి మణికట్టులపై కత్తితో చేసిన గాయాలు కనిపించడంతో సమీప బంధువు బర్రి పోలీసు సహకారంతో ఆమెను కేజీహెచ్‌కు తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మైలపల్లి ముసలి మరణించింది. కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్‌ పోలీసులు సీఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ఘటనతో కొత్తజాలారిపేటలో విషాదం నెలకొంది. మృతురాలి బంధువులు, స్థానిక నివాసులు పెద్ద సంఖ్యలో కేజీహెచ్‌కు చేరుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top