ఇల్లాలే ఇంటి దొంగ

Wife Robbery Husband Money In Hyderabad - Sakshi

భర్తపై కోపంతో ఇంట్లో చోరీ చేయించిన భార్య

ఇద్దరు నిందితుల అరెస్టు  

రూ.8.76లక్షల నగదు, 5తులాల బంగారం స్వాధీనం

రాంగోపాల్‌పేట్‌: భర్తపై కోపంతో ఓ మహిళ తన ఇంట్లోనే చోరీ చేయించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌గౌడ్, డీఐ వెంకటేశంలతో కలిసి ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు వెళ్లడించారు. రెజిమెంటల్‌బజార్‌కు చెందిన వేణుగోపాల్, సాయి కుమారి అలియాస్‌ సునీత భార్యాభర్తలు. గత కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 4న వారి మధ్య గొడవ జరగడంతో  సునీత ముగ్గురు పిల్లలను తీసుకుని మల్కాజ్‌గిరిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈ నెల 7న వేణుగోపాల్‌ భార్య వద్దకు వెళ్లి మాట్లాడి తుకారాంగేట్‌లో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లిపోయాడు. 9వ తేదీ ఉదయం రెజిమెంటల్‌బజార్‌లోని పక్కింటివారు ఫోన్‌ చేసి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయని చెప్పడంతో వేణుగోపాల్‌ ఇంటికి వచ్చి చూసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిసిన వారి పనిగా గుర్తించి ఆ దిశగా విచారణ చేపట్టారు.

సునీత డైరెక్షన్‌లోనే..
వేణుగోపాల్‌ తరచూ తాగి ఇంటికి వస్తుండటంతో పాటు మరికొన్ని విషయాల్లో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆమె తన సమీప బంధువులు సాయి కుమార్, శివతో కలిసి పథకం పన్నింది. ఇందులో భాగంగా శివకు ఇంట్లో నగదు,  వాటిని దాచిన వివరాలు చెప్పింది. ఆ సమయంలో సాయికుమార్‌ మల్కాజ్‌గిరిలో సునీతతో పాటే ఉన్నాడు. ఈ నెల 8న సాయంత్రం శివ వారి ఇంటి తాళాలు పగులగొట్టి  నగదు, బంగారాన్ని తీసుకెళ్లాడు. కొద్ది రోజుల పాటు వాటిని తమ వద్దే ఉంచుకుని భర్తను ఇబ్బంది పెట్టాలని భావించింది.

మరుసటి రోజు దొంగతనం జరిగిందని సమాచారం అందడంతో వేణుగోపాల్‌తో పాటు అక్కడికి వెళ్లిన సునీత స్పృహ తప్పినట్లు నటించి తనపై అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో భయాందోళనకు గురైన సునీత, సాయి, శివ ఈ నెల10 రేతిఫైల్‌ బస్టాండ్‌ వద్ద కలుసుకున్నారు. శివ డబ్బు, నగదు వారికి అందించి వెళ్లిపోగా సాయి సునీత రైల్లో పూనే వెళ్లిపోయారు. గురువారం ఉదయం నగరానికి తిరిగి వచ్చిన వీరు రెతిఫైల్‌ బస్టాండ్‌  సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో గోపాలపురం క్రైమ్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన తర్వాత కూడా సునీత చోరీతో తనకు సంబంధం లేదని దొంగతనం చేసిన వ్యక్తిని గుర్తించి అతను రైళ్లో వెళ్తుంటే పూనే దాకా వెంబడించి పట్టుకుని డబ్బు తీసుకుని వచ్చానని  నమ్మించేందుకు ప్రయత్నించింది. దీంతో పోలీసులు నిందితులను వేర్వేరుగా విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా శివ పరారీలో ఉన్నాడు. 

రూ.1.20లక్షలు నొక్కేసిన శివ
చోరీకి పాల్పడిన శివ నగదు, బంగారాన్ని తన వద్దే ఉంచుకుని మరుసటి రోజు వారికి అప్పగించాడు. అయితే ఇంట్లో దొరికిన డబ్బు అంతా ఇచ్చేసినట్లు చెప్పిన శివ అందులో నుంచి రూ.1.20 లక్షలు నొక్కేసినట్లు గుర్తించారు.  పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top