ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Wife Killed Husband With Boyfriend in Kurnool - Sakshi

బోయనపల్లెలో ఘటన..

మిద్దెపై నుంచి పడి మృతిచెందాడని బొంకే యత్నం

కర్నూలు, వెల్దుర్తి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తనే దారుణంగా హత్య చేసింది. మండల పరిధిలోని బోయనపల్లెలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటన వివరాలను ఎస్‌ఐ నరసింహులు విలేకరులకు వెల్లడించారు. బోయనపల్లెకు చెందిన లక్ష్మిదేవి, మంగళి శివరాముడు(41) దంపతులు. వీరికి కూతురు, కుమారుడు సంతానం. కుమారుడు నంద్యాలలో కులవృత్తి చేస్తుండగా, కూతురికి ఇటీవలే పెళ్లి చేశారు. మంగళి శివరాముడు కుల వృత్తి, కూలీ పనులతో జీవనం సాగించేవాడు. లక్ష్మిదేవి గ్రామానికే చెందిన వడ్డె రామకృష్ణతో ఏడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసి భర్త పలుమార్లు మందలించాడు. గురువారం కూతురు, అల్లుడు ఇంటికి రావడంతో వివాహేతర సంబంధం విషయమై తీవ్రంగా తగువులాడాడు. అనంతరం శివరాముడు దంపతులు ఆరుబయట అరుగు మీద, కూతురు, అల్లుడు ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు.

రాత్రి కూతురు, అల్లుడు నిద్రించిన గదికి బయట గడియ పెట్టి పథకం ప్రకారం ప్రియుడు రామకృష్ణతో కలిసి శివరాముడుపై కొడవలితో దాడిచేసి హతమార్చారు. అలికిడికి పక్కింటివారు వచ్చేలోపు ప్రియుడు పారిపోగా భార్య ఏమీ తెలియనట్లు ఆరుబయట నిద్రించింది. ఉదయం భర్త మిద్దెపైనుంచి కింద పడి మృతిచెందాడని బొంకే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెల్దుర్తి పోలీసులు రంగంలోకి దిగారు. డోన్‌ డీఎస్పీ ఖాదర్‌బాషా, ఎస్‌ఐలు సంఘటనా ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టారు. అరుగుపై రక్తపు మరకలను గుర్తించారు. మృతదేహాన్ని డోన్‌ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. వెల్దుర్తి విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు రామకృష్ణను వెదికి పట్టుకున్న పోలీసులు అతనితో పాటు లక్ష్మిదేవిని అదుపులోకి తీసుకున్నారు. విచారణానంతరం నేరం అంగీకరించడంతో వీరిద్దరిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top